
స్త్రీలకు నవరత్నాలు ఇష్టం. అయితే వాటిలో కొన్నే కొందరికి ‘మేచ్‘ అవుతాయి అని కూడా నమ్ముతారు. వజ్రం, ముత్యం, కనకపుష్యరాగం, కెంపు, పగడం, వైఢూర్యం, నీలం, గోమేధికం... వీటన్నింటితో పాటు పచ్చ... అన్నీ అద్భుతమైన ఆకర్షణ కలిగినవే. స్త్రీలు వీటిని తమ ఆభరణాల్లో పొదిగి మిలమిలా మెరుస్తారు. అయితే ఇప్పుడు ఈ నవరత్నాలకు సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు తెలియపోవడం వల్ల 25 లక్షలు కోల్పోయింది మాన్సీ శర్మ.
ఇటీవల ప్రసారమైన కౌన్ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్‌లో మాన్సీ శర్మకు హాట్‌సీట్ దక్కింది. ఆమె ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. అమితాబ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల 25 లక్షలు గెలుచుకుంది. తర్వాతి ప్రశ్నకు సమాధానం చెప్తే 50 లక్షలు వస్తాయి. అప్పుడు అమితాబ్ అడిగిన ప్రశ్న– పచ్చల రాజధానిగా పేరుబడ్డ ముజో నగరం ఏ దేశంలో ఉంది అని. ఆప్షన్స్‌లో ఎ) నికరాగ్వే బి)నైజీరియా సి)జింబాబ్వే డి)కొలంబియా అని ఇచ్చారు.
అయితే ఈ ప్రశ్నకు మాన్సీ శర్మ జవాబు చెప్పలేకపోయింది. 25 లక్షలతో ఆట ముగించి అంతటితో సంతృప్తి పడింది. ఈ ప్రశ్నకు సరైన జవాబు కొలంబియా. పచ్చల రాజధానిగా పేరుబడ్డ ముజో నగరం ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ పచ్చల మైనింగ్ కోసం పూర్వం జాతుల మధ్య రక్తపాతాలు జరిగాయి. స్పానిష్ జాతీయులు ఇక్కడి ఆదివాసులైన ముజో ఇండియన్సును ఊచకోత కోశారు కూడా. అయితే కాలక్రమంలో ఈ ప్రాంతం అన్ని దాడులను తట్టుకుని నిలబడింది.
ఇక్కడి పచ్చల గనుల్లో నేటికీ విలువైన పచ్చలు వెలికి తీస్తున్నారు. అవి ప్రపంచ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన పచ్చలుగా డిమాండ్ కలిగి ఉన్నాయి. ఇందుకు కారణం ఇక్కడి పచ్చలు దాదాపు 30 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అని శాస్త్రవేత్తల అంచనా. అందుకే వీటి క్వాలిటీకి తిరుగు ఉండదు. అన్నట్టు ఇక్కడి ముజో ఇండియన్సు ఈ పచ్చల గనులకు ఒక దేవత ఉందని నమ్ముతారు. ఆమె పేరు ‘ఆరె’. ఆ దేవత చల్లగా చూడటం వల్లే ఇక్కడ పచ్చలు పండుతుంటాయని అంటారు.