Ganesh Chaturthi 2023: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!

Life Lessons From Lord Ganesha On Ganesh Chaturthi - Sakshi

వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు. చదువు దగ్గర నుంచి కళల వరకు ఏది మొదలుపెట్టాలన్న ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఇవాళే గణనాథుని జన్మదినోత్సవం ఈ సందర్భంగా ..ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దామా! 

విధి నిర్వహణే ముందు..
పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా. అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లబోతే గణేషుడు అడ్డుకుంటాడు. శివుడు తాను ఫలానా అని చెప్పినా గణేషుడు వినడు. తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది. కనుకనే సాక్షాత్తూ శివుడే వచ్చినా సరే… గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేసి తీరుతాడు. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్‌లో మనం దూసుకెళ్లవచ్చు. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎలా పని తప్పించుకుని తిరగాలనే చూసే ఉద్యోగులు ప్రమోషన్‌లు, బోనస్‌లు మాత్రం కావాలని గోల చేస్తుంటారు. ముందు మీ డ్యూటీ సంక్రమంగా చేస్తే మనం కచ్చితంగా ఉన్నత పదవులను పొందగలుగుతాం. 

తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువ కాదు..
గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతాడు. కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది. పూజలు అనగానే ఆర్భాటాలు పలికే మనం తల్లిదండ్రుల వద్దకు వచ్చేటప్పటికి ఎంతమంది వినాయకుడిలా అనుసరిస్తున్నారో ఆలిచిస్తే మంచిది. దేవుడు కూడా తల్లిదండ్రులను సేవ తర్వాతే దేవుడు పూజ అని నర్మగర్భంగా చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. 

తప్పుచేసిన వారిని క్షమించడం..
వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రున్ని ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండాపొమ్మని చెప్పి శాపం పెడతాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించాలన్న విషయాన్ని వినాయకుడి జీవితం చెబుతుంది.

చేపట్టి పనిని వెంటనే పూర్తిచేయడం..
వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెబుతాడు. దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం (పెన్ను లాంటిది) విరుగుతుంది. అయినా గణేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు. కానీ మధ్యలో ఆగడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆగకూడదన్నమాట..! చేపట్టిన పనిని చాలా త్వరగా పూర్తి చేయాలని తెలుపుతోంది

ఆత్మ గౌరవం కోల్పోకూడదు..
ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గలోకానికి గణేషున్ని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు.

అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి గణేషున్ని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు. వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు.

అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం.. మనకూ ఆదర్శనీయమే. ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనమూ అనుసరించాల్సిందే. ఎవరేమన్నా.. ఏ పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది..!

---ఆర్‌ లక్ష్మీ లావణ్య

(చదవండి: వినాయ‌కుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top