
ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఏడాది పాటు పని చేశాను. మరొక మంచి ఉద్యోగం రావడంతో కంపెనీ మారాను. మొదటి కంపెనీ వారు రిలీవింగ్ లెటర్ ఇస్తూ నా పని విధానం బాగుంది అంటూ – భవిష్యత్తుకు అభినందనలు కూడా తెలియజేశారు. రెండవ కంపెనీ వారు బ్యాక్ గ్రౌండ్ పరిశీలనలో కూడా నామీద సానుకూలంగానే చె΄్పారు. 3,4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మూడవ కంపెనీకి ఇటీవలే మారాను. నా బ్యాక్ గ్రౌండ్ పరిశీలనలో మొదట పని చేసిన కంపెనీ వారు నా మీద కొన్ని అభియోగాలు మోపారు. నేను వారి కంపెనీ గోప్యతను దెబ్బతీశాను అని, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇంకా చేయలేదు అని చెప్పగా ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వారు నాకు నోటీసు జారీ చేశారు.
మూడేళ్ల తర్వాత ఇదేమిటి అని మొదటి కంపెనీ వారిని ప్రశ్నించగా, నా బ్యాక్‌గ్రౌండ్ లో ఎటువంటి లోపం లేదు అంటూ మరలా ఒక రి΄ోర్ట్ ఇవ్వడంతో ప్రస్తుత కంపెనీ వారు నోటీసును ఉపసంహరించుకున్నారు. కానీ మొదటి కంపెనీ వారు ఇప్పటికీ కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదు – అడిగితే వారి గోప్యతకు నేను భంగం కలిగించాను అని అభియోగం ఉన్నది కాబట్టి మేము చేయము అని అంటున్నారు. రెండేళ్ల క్రితం ఒక మెయిల్ రాసి వదిలేసాను కానీ ఇప్పుడు ఈ సమస్య వస్తుంది అని అనుకోలేదు. మరొక కంపెనీకి మారినప్పుడు కూడా ఇదే సమస్య రావచ్చు అని అనిపిస్తుంది. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి?
– జాన్ వెస్లీ, విశాఖపట్నం
ఒక కంపెనీలో ఉద్యోగం చేసిన తర్వాత రిలీవింగ్ లెటర్ తీసుకుని వెళ్లి మరొక కంపెనీలో కూడా చేరిన తర్వాత, మూడు సంవత్సరాలపాటు నిశ్శబ్దంగా ఉండి, ఇప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీకు వ్యతిరేకంగా సమాచారాన్ని ఇవ్వడం చట్టరీత్యా తప్పు. రిలీవింగ్ లెటర్‌లో మీ కాండక్ట్ కూడా బాగుంది అని రాశారు కాబట్టి, ఒకసారి ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత ఆ స్టేట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ మరొక స్టేట్మెంట్ చేయడం కుదరదు. మీ కేసులో అది పరువు నష్టానికి కూడా దారితీస్తుంది. ఒకవేళ కంపెనీ వారికి మీపై ఏదైనా ఫిర్యాదు వంటివి ఉండి ఉంటే వారు సరైన సమయంలోగా మీకు నోటీసులు లేదా సమాచారాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే మీరు కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రాకపోయినప్పటికీ చాలా సమయాన్ని వృథా చేశారు. ఏది ఏమైనా, సదరు కంపెనీ వారు మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగే విధంగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో సమాధానాలు ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి కంపెనీ వారితో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకునే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అప్పటికీ కూడా వారు వినకపోతే, అన్ని విషయాలను ΄పోందుపరిచి ఒక లీగల్ నోటీస్ పంపండి. తదుపరి మీకు రావలసిన ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌తో పాటు మీకు జరిగిన అన్యాయానికి తగిన పరిహారం కోరుతూ సివిల్ కోర్టులో దావా కూడా వేయవచ్చు. మీకు లేబర్ హక్కుల చట్టాలు వర్తించినట్లయితే లేబర్ కమిషనర్‌ను, తద్వారా లేబర్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు.