కళ: త్రీ ఇన్‌ వన్‌... నెంబర్‌వన్‌!

Lead actors of award-winning short film Cheepatakadumpa - Sakshi

కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు.

‘ఈ సబ్జెక్ట్‌ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్‌ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్‌ దేవాశిష్‌ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.

దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్‌ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్‌ సెన్సిటివిటీ’ అవార్డ్‌ గెలుచుకుంది.

‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి.
స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్‌ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి...

మధ్యప్రదేశ్‌లోని బర్త్‌ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్‌లో మ్యూజిక్‌కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్‌...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్‌మండల్‌’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ముంబై యూనివర్శిటీలో మాస్‌ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్‌ఎస్‌డీ స్టూడెంట్‌. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్‌లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’  చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్‌ డైరెక్టర్‌. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది.

ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్‌ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్‌ఎస్‌డీ స్టూడెంట్‌. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్‌ షేక్‌స్పియర్‌ ‘ఎ మిడ్‌నైట్‌ సమ్మర్‌ డ్రీమ్‌’ను ‘కసుమాల్‌ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్‌ డ్రామటిక్‌ అసోసియేషన్‌’ (ముంబై) అనే థియేటర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకురాలు.

తాజా విషయం
ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top