తామస మనువు జననం | king saurashtra deer curse and tamasa manvantara story | Sakshi
Sakshi News home page

తామస మనువు జననం

Apr 19 2026 10:12 AM | Updated on Apr 19 2026 10:12 AM

king saurashtra deer curse and tamasa manvantara story

పూర్వం సురాష్ట్రుడు అనే రాజు ఉండేవాడు. వీరాధి వీరుడిగా విఖ్యాతి పొందిన సురాష్ట్రుడి సుపరిపాలనలో అతడి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అతడి మంత్రి నరసింహ శర్మ. అమిత రాజభక్తి కలిగినవాడు. రాజుకు అన్ని వ్యవహారాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాడు.
రాజుకు మరింత మేలు చేయాలనే తలంపుతో నరసింహ శర్మ సూర్యుడి కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. ‘సూర్య భగవంతుడా! మా మహారాజుకు అమితమైన ఆయుర్దాయాన్ని అనుగ్రహించు. అది చాలు నాకు’ అన్నాడు నరసింహ శర్మ. ‘తథాస్తు’ అని వరాన్ని అనుగ్రహించి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు.వెంటనే మంత్రి నరసింహ శర్మ రాజు వద్దకు వెళ్లి, జరిగినదంతా చెప్పాడు.తన గురించి మంత్రి పొందిన వరం తెలుసుకున్న రాజు సురాష్ట్రుడు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయసాగాడు.

రాజుకు అమితాయుర్దాయం కలిగినా, అతడి భార్యలకు అంత ఆయుర్దాయం లేనందున, వారు ఒక్కొక్కరు గతించిపోయారు. భార్యలు ఒక్కొక్కరుగా గతించిపోవడంతో సురాష్ట్రుడికి విరక్తి కలిగింది. రాజ్యాన్ని మంత్రికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లిపోయాడు.అతడు తపస్సు చేసుకుంటూ ఉండగా, కొంతకాలానికి వర్షాకాలం వచ్చింది. ఒకసారి విపరీతమైన వర్షం కురిసింది. వరదనీటితో అడవి జలమయమైంది. సురాష్ట్రుడు ఆ వరదనీటిలో కొట్టుకుపోసాగాడు. అదే నీటిలో కొట్టుకు వస్తున్న ఒక లేడి అతడికి ఆధారంగా దొరికింది. లేడిని పట్టుకుని ఎలాగోలా సురాష్ట్రుడు కాసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు.ఒడ్డుకు చేరుకున్నాక సురాష్ట్రుడు కృతజ్ఞతతో ఆ లేడిని దువ్వుతూ, దాని మీద మోహంలో పడ్డాడు. లేడి మీద తనకు మోహం కలగడం అతడికి ఆశ్చర్యం అనిపించింది. ఇది మామూలు లేడి కాదనుకున్నాడు.

‘ఓ హరిణమా! నువ్వెవరివి? నిన్ను తాకగానే నాకు నీ మీద మోహం మొదలైంది. దీనికి కారణమేంటి?’ అని అడిగాడు.‘మహారాజా! గతజన్మలో నేను దృఢధన్వుడు అనే రాజు కుమార్తెను. నీ గతించిన భార్యలలో నేను మొదటిదానిని. నా పేరు ఉత్పలమాల’ అని పలికింది. సురాష్ట్ర మహారాజు సంభ్రమాశ్చర్యాలు చెందాడు. ‘మరి నీకు ఈ లేడి జన్మ ఎందుకు కలిగింది?’ అని అడిగాడు.‘నేను దృఢధన్వుని కుమార్తెగా ఉన్నప్పుడు ఒకసారి చెలికత్తెలతో వనవిహారం చేస్తుంటే, ఒక ముని కుమారుడు ఎదురయ్యాడు. అతడు నన్ను మోహించి, వివాహం చేసుకోమని అడిగాడు. నేను క్షత్రియ కన్యను. నిన్ను వివాహమాడలేను. యోగ్యురాలైన బ్రాహ్మణ కన్యను చూసుకుని వివాహం చేసుకోమని అతడికి నచ్చజెప్పాను. 

అతడు కినుక వహించి, వచ్చే జన్మలో హరిణమవుతావని శపించాడు. శాప విముక్తి చెప్పవలసిందిగా ప్రార్థిస్తే, నీ పూర్వజన్మ భర్త అయిన రాజు ప్రవాహంలో కొట్టుకువస్తూ, నిన్ను ఆధారంగా పట్టుకుని ఒడ్డుకు వస్తాడు. అతడు నీ కంఠాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు. మహారాజా నా కంఠాన్ని ఆలింగనం చేసుకోండి’ అంది లేడి రూపులోనున్న ఉత్పలమాల. సురాష్ట్రుడు ఆ లేడి మెడను ఆలింగనం చేసుకున్నాడు. లేడికి పూర్వరూపం వచ్చింది. ఆమెను వెంటతీసుకుని, సురాష్ట్రుడు రాజధానికి చేరుకున్నాడు. 

మంత్రికి, పరివారానికి జరిగినదంతా చెప్పాడు. వారంతా సంతోషించారు.కొన్నాళ్లకు ఉత్పలమాల గర్భందాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. సురాష్ట్ర మహారాజు పుత్రుడికి జాతకర్మ జరిపించి, తామసుడు అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. ఇలా రోజులు సాగుతుండగా, ఒకనాడు ఆకాశవాణి ‘రాజా! నీ కుమారుడు తామసుడు మనువుగా ప్రఖ్యాతి పొందుతాడు’ అని పలికింది. తామసుడు సూర్యోపాసన చేసి, సకల విద్యలూ నేర్చుకున్నాడు. సమస్త భూమండలాన్నీ జయించి, పాలించాడు. అతడి పాలనాకాలం తామస మన్వంతరంగా ప్రసిద్ధి పొందింది.
∙సాంఖ్యాయన

Advertisement
 
Advertisement
Advertisement