మా పై ఫ్లాట్‌లోకి ఎవరో కొత్తగా అద్దెకి వచ్చారు. పైనుంచి చప్పుళ్ళు వినిపించసాగాయి. ‘‘నిన్న రాత్రి ఆ చప్పుళ్ళకి నాకు నిద్రపడితే ఒట్టు.’’ మర్నాడు మావారికి చెప్పాను.చక్రాల కుర్చీని తోసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ బల్ల దగ్గరికి వెళ్ళాను. పై ఫ్లాట్ నుంచి వచ్చిన ఆమ్లెట్, చికెన్ సేండ్‌విచ్‌లు చూపించి మావారు చెప్పారు. ‘‘అదృష్టం. ఫ్రెండ్లీ పీపుల్.’’రెండు రాత్రుల తర్వాత పై ఫ్లాట్‌లోంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.‘‘భార్యాభర్తల పోట్లాట.’’ మావారు చెప్పారు.‘‘వాళ్ళకి ఫర్నిచర్ సర్దిన అలసట తీరినట్లుంది.’’ నవ్వుతూ చెప్పాను.
మరో రెండు రోజుల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మావారితో కబుర్లు చెప్తూ కాఫీ తాగసాగాను. డోర్ బెల్ మోగడంతో మావారు వెళ్ళి తలుపు తెరిస్తే ఓ ముప్ఫై ఏళ్ళ యువతి బయట నించుని కనిపించింది. ఆమె చేతుల్లో ఓ పసిబిడ్డ ఉంది.‘‘హలో. గుడ్ మార్నింగ్. మేము మీ పై అపార్ట్‌మెంట్‌కి అద్దెకి వచ్చాం. ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ ఉండటంతో ప్రైవసీ బావుందని దీన్ని తీసుకున్నాం.’’ నవ్వుతూ చెప్పింది.‘‘రండి. పాప పేరేమిటి?’’ నవ్వుతూ ఆహ్వానించాను.ఆమె చెప్పాక మావారు నన్ను పరిచయం చేసి చెప్పారు.
‘‘థాంక్స్. సేండ్‌విచెస్ చాలా రుచిగా ఉన్నాయి.’’‘‘మీకు బాగా శబ్దాలు వినిపించి ఉంటాయి. అపాలజీగా వాటిని పంపాను.’’‘‘మీ పిల్లల్ని మా ఆవిడ దగ్గర వదిలి మీరు షాపింగ్‌కి కాని, ఎక్కడికైనా వెళ్ళచ్చు.’’ మావారు సూచించారు.‘‘ఓ. థాంక్స్. అత్యంత అవసరమైతే తప్ప మీకా శ్రమ ఇవ్వను. మీ కాలికి ఏమైంది?’’ ఆమె నా కాలికి ఉన్న కట్టుని చూసి అడిగింది.‘‘పడ్డాను. సూపర్ బజార్లో పిల్లలు అరటిపళ్ళని నేలమీద పడేశారు. చితికిన అరటిపళ్ళు రోడ్ మీద ఒలికిన ఆయిల్ కన్నా ప్రమాదం. వాటి మీద కాలు వేసి జారిపడడంతో కుడికాలు విరిగింది. ఇంకో మూడు వారాల దాకా అది అతుక్కోదని డాక్టర్ చెప్పాడు.’’ జవాబు చెప్పాను.‘‘అందులో మన అపార్ట్‌మెంట్‌కి లిఫ్ట్ కూడా లేదు. ఐయాం సారీ. ప్లీజ్ గెట్‌వెల్ సూన్.’’ ఆమె చెప్పింది.
‘‘తలకి తగలకపోవడం అదృష్టం.’’ మావారు చెప్పారు.∙∙∙ఆ రాత్రి మావారికి పై ఫ్లాట్‌నుంచి వినిపించే ఏడుపుకి మెలకువ వచ్చి నన్ను లేపారు. అది ఆమె ఏడుపుగా గుర్తించాను. ఆమె భర్త అరుపులు వినిపించాయి. ఆ ఏడుపు కొద్దిసేపు విని ఆయన విసుగ్గా అరిచారు.‘‘ఈ కొత్త పొరుగు న్యూసెన్స్ ఏమిటి? మన సెక్రటరీతో చెప్పి వాళ్ళని ఖాళీ చేయించాలి. నాకు రేపు ప్రజంటేషన్ కూడా ఉంది.’’ కోపంగా చెప్పారు.మర్నాడు ఉదయం మావారు వెళ్ళాక ఇంటర్నల్ ఇంటర్‌కమ్ మోగింది.
ఆమె నుంచి ఆ కాల్. ఇద్దరం ఒకరినొకరం పలకరించుకున్నాక ఆమె అడిగింది.‘‘నేను ఈ సందు చివర కార్నర్ స్టోర్‌కి వెళ్ళిరావాలి. నేను వచ్చేదాకా మా అమ్మాయిని మీ దగ్గర ఉంచుకుంటారా? సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.’’‘‘తప్పకుండా. తీసుకురండి.’’‘‘నిద్రపోతోంది. లేస్తే ఎవరూ కనపడకపోతే ఏడుస్తుందని.’’వెంటనే చక్రాల కుర్చీలో తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాను. నాలుగైదు నిమిషాల్లో భుజం మీద చిన్నపాపతో ఆమె వచ్చింది. రబ్బర్ షీట్ కూడా తెచ్చింది. గెస్ట్ రూమ్‌లోని మంచాన్ని చూపించాను.
‘‘థాంక్స్ ఎలాట్.’’ పాపని పడుకోబెట్టి వెళ్ళిపోయింది.ఆమె చెప్పినట్లుగా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.‘‘మా అమ్మాయి లేవలేదుగా?’’‘‘లేదు.’’‘‘లేవదని తెలుసు. థాంక్స్ అగైన్.’’ కేరీ బేగ్‌తో పైకి వెళ్తూ చెప్పింది.∙∙∙ఆ రాత్రి పైనుంచి మళ్ళీ మాకు పోట్లాటతో మొదలై కొట్టిన చప్పుళ్ళు, తాగుబోతు మగ గొంతు వినిపించాయి. దాంతోపాటు ఆమె ఏడుపు కూడా.‘‘రేపు ఆ ఇంటాయనకి ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏమిటని అడుగుతాను.’’ మావారు కోపంగా అరిచారు.మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగింది.
చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా వాచ్‌మేన్. భయంగా మెట్లవైపు చూపించాడు. లుంగీలోని ఓ ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి ఆఖరు మెట్టు మీద పడున్నాడు. అతని మెడ అసహజ రీతిలో తిరిగి ఉండడంతో అతను జీవించిలేడని గ్రహించాను.‘‘సెక్రటరీని పిలుచుకురా.’’ భయంగా అరిచాను.సెక్రటరీ డాక్టర్‌కి, పోలీసులకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా కింది మెట్టు మీద పడున్న అతన్ని పరిశీలనగా చూశాను.అతని అరిపాదాలకి చితికిన అరటిపళ్ళ గుజ్జు అంటుకుని కనిపించింది.చూస్తే పై మెట్ల మీద చాలా చోట్ల ఆ గుజ్జు కనిపించింది!క్రితం రోజు ఆమె నా దగ్గర తన కూతుర్ని ఉంచి షాప్‌కి వెళ్ళి తెచ్చిన కేరీ బేగ్‌లో అరటి పళ్ళు చూశానని గుర్తొచ్చింది!
-మల్లాది వెంకట కృష్ణమూర్తి


