డాక్టర్‌ ఫస్ట్‌ లేడీ అంటే తప్పేంటి!?

Jill Biden At Center Of Flap Over Who Gets To Be Called Doctor' - Sakshi

అమెరికా కొత్త అధ్యక్షుడి సతీమణి డాక్టర్‌ జిల్‌ బైడెన్‌ తన పేరులోని ‘డాక్టర్‌’ అనే మాటను వైట్‌ హౌస్‌లోకి అడుగు పెట్టకముందే తీసి పక్కన పెట్టేయాలని యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు సూచించడం.. పురుషాహంకారంపై మహిళల ఆగ్రహాగ్నికి తాజా ఆజ్యం అయింది. ఒక మహిళ సొంతంగా ఏం సాధించినా గుర్తింపు లభించదా?! అమెరికా ప్రథమ మహిళ అయినా, భర్త చాటున ఆయన నీడలో ఉండిపోతేనే ఆమెకు గుర్తింపూ గౌరవమూనా?! తనకంటూ ఒక ఉనికిని, అస్తిత్వాన్ని ఆమె ఏర్పరచుకుంటే వెక్కిరింపులు, పరిహాసాలు తప్పవా అని హిల్లరీ క్లింటన్, మిషెల్‌ ఒబామా, ఇంకా ఇతర ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్‌ జిల్‌ బైడెన్‌కు మద్దతుగా నిలబడుతున్నారు.

కొద్ది రోజుల్లో డాక్టర్‌ జిల్‌ బైడెన్‌ అమెరికా ‘ప్రథమ మహిళ’ కాబోతున్నారు. అయితే ‘డాక్టర్‌’ అనే టైటిల్‌ని మించిన తలమానికం మాత్రం కాదు ఆమెకు ఆ ‘ఫస్ట్‌ లేడీ’ అనే గుర్తింపు. విద్యాబోధనలో పదమూడేళ్ల క్రితం పీహెచ్‌డీ చేశారు జిల్‌ బైడెన్‌. అప్పట్నుంచే ఆమె పేరుకు ముందు డాక్టర్‌ అనే మాట ఉంది. ఊరికే మాట వరసకు ఉండటం కాదు. ఆ మాటను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు జిల్‌ బైడెన్‌. ప్రేమించడం అంటే.. ఒబామా హయాంలో ఎనిమిదేళ్ల తన ‘ద్వితీయ మహిళ’ హోదాలో కూడా ఒక్కనాడూ ఆమె తన ఉద్యోగాన్ని రెండోస్థానంలో వదిలేయలేదు! యూనివర్సిటీ ప్రొఫెసర్‌గానే ఉండిపోయారు. ఒకవేళ తను ప్రథమ మహిళ అయినా కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే తన తొలి ప్రాధాన్యం అని ఎన్నికలకు ముందే ప్రకటించారు డాక్టర్‌ జిల్‌ బైడెన్‌.

డాక్టరేట్‌ అన్నది ఆమె సాధించిన విజయం. అది ఆమె సంతోషం. అయితే ఆమె ప్రథమ మహిళ అయ్యాక తన పేరుకు ముందున్న ‘డాక్టర్‌’ అనే ఆ టైటిల్‌ను తీసి పక్కన పెట్టేయకపోతే వైట్‌ హౌస్‌ గౌరవానికి భంగం కలుగుతుందని జోసెఫ్‌ ఎప్‌స్టెయిన్‌ అనే ఆయన ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రికలో డిసెంబర్‌ 11 న రాసిన ఒక అపహాస్య వ్యాసం ఆమె అస్తిత్వాన్ని, సంతోషాన్ని హరించే విధంగా ఉంది. ఒక స్త్రీ.. ‘డాక్టరేట్‌’ను తన ఉనికిగా చెప్పుకోవడం కూడా తప్పేనా! ఆమె భర్త అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రం ఆమె తన డాక్టరేట్‌ను దాచిపెట్టి, అతడి నీడలో ఉండిపోవలసిందేనా అని హిల్లరీ క్లింటన్, మిషెల్‌ ఒబమా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కుమార్తె బెర్నీస్‌ కింగ్, మరికొందరు ప్రముఖులు జిల్‌ బైడెన్‌కు మద్దతుగా నిలబడంతో స్త్రీని లోకువ చేసే మగబుద్ధిపై అగ్రరాజ్య విద్యావంతులలో చర్చ మొదలైంది.  
∙∙
‘ఇదొక పెద్ద కామెడీ. నియమ విరుద్ధం’ అంటాడు జోసెఫ్‌ ఎప్‌స్టెయిన్‌. కామెడీ, నియమ విరుద్ధం ఏంటంటే జిల్‌ బైడెన్‌ తన పేరుకు ముందు ‘డాక్టర్‌’ అనే టైటిల్‌ని అలాగే ఉంచేసుకోవడం అట! వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో ఆయన రాసిన ఆ వ్యాసం శీర్షిక ఎలా ఉందో చూడండి. ‘వైట్‌ హౌస్‌లో ఎవరైనా డాక్టర్‌ ఉన్నారా? లేకుంటే కనుక ఒక ఎం.డి. కావాలి’. వెక్కిరింపు అన్నమాట. డాక్టర్‌ అంటే ఆయన ఉద్దేశంలో డెలివరీ చేయగలిగిన డాక్టర్‌ మాత్రమే. ఆ మాట కూడా రాశాడు. ‘జిల్‌ బైడెన్‌ ఎడ్యుకేషన్‌ సైన్సెస్‌లో పీహెచ్‌.డి చేశారు. ఆమె చేసింది మెడికల్‌ డిగ్రీ కాదు. కాన్పు చేసి, బిడ్డను బయటికి తీసినవాళ్లు మాత్రమే తమ పేరుకు ముందు ‘డాక్టర్‌’ అని ఉంచుకోవాలి’ అంటాడు! ఇంకా ఆ వ్యాసంలో జిల్‌ బైడెన్‌ను ‘కిడ్డో’ అని, ‘ఫ్రాడ్యులెంట్‌’ అని, ‘ఎ టచ్‌ కామిక్‌’ అనీ నానా మాటలూ అన్నాడు. ఆమె చిన్న పిల్లట. జోసెఫ్‌ ఎప్‌స్టెయిన్‌ కూడా చిన్నపిల్లాడేం కాదు. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ‘ది అమెరికన్‌ స్కాలర్‌ మేగజీన్‌’ మాజీ ఎడిటర్‌. అంతటి మనిషిలో ఇంతటి స్త్రీద్వేషం, పురుషాహంకారం ఏమిటి?!
∙∙
జనవరి 20 తన భర్త అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జిల్‌ బైడెన్‌కు రెండు బాధ్యతలు అవుతాయి. అమెరికా ప్రథమ మహిళగా ఒకటి, నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్న బాధ్యత ఒకటి. ఈ రెండో బాధ్యతనే ఆమె ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పేరుకు ముందు డాక్టర్‌ అనే టైటిల్‌ ఉన్నా, లేకున్నా పాఠాలు చెప్పడం అనే ఆసక్తి ఆమెకు మొదటి నుంచీ ఉంది. జోసెఫ్‌ ఎప్‌స్టీన్‌ గారు మాత్రం పాఠాలు చెప్పడంలోని ఆమె నిబద్ధతను వదిలేసి, పాఠాలు చెప్పడంలో ఆమె సాధించిన డాక్టరేట్‌ వెంట పడ్డారు! ఈయన వ్యాసానికి వెస్టెర్న్‌ కెంటకీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జెన్నిఫర్‌ వాల్టన్‌ హాన్‌లీ తగిన సమాధానమే చెప్పారు. ‘జిల్‌ బైడెన్‌ తన టైటిల్‌ని వదిలేయడం కాదు.

జోసెఫ్‌ ఎప్‌స్టెయినే అదనంగా ఒక డిగ్రీ పట్టాను సంపాదించాలి. తన ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోడానికి’’ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌ భర్త ఎంహాఫ్‌.. ‘ఇలాంటివి ఒక పురుషుడిపై రాయరెందుకు?’ అని ట్వీట్‌ చేశారు. అందరికన్నా ముందు జిల్‌ బైడెన్‌కు మద్దతుగా మాట్లాడింది ఆయనే. తర్వాత మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కూతురు బెర్నైస్‌ కింగ్, జో బైడెన్‌ ప్రతినిధి మైఖేల్‌ లా రోసా, మరో ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామా.. జిల్‌ బైడెన్‌ వైపు గట్టిగా నిలబడ్డారు. ప్రముఖులు, మెడికల్‌ డాక్టర్‌లు కూడా జిల్‌ బైడెన్‌ కు సంఘీభావం తెలిపారు. అనేకమంది మహిళలు ఆమె గౌరవార్థం తమ ట్విట్టర్‌ అకౌంట్‌లో తమ పేరుకు ముందు ‘డాక్టర్‌’ అనే మాట (ఆనరఫిక్‌)ను జత కలుపుకున్నారు. కొందరైతే ‘పురుషాహంకారం’, ‘స్త్రీ ద్వేషం’లో జోసెఫ్‌ ఎప్‌స్టెయిన్‌కు డబుల్‌ పీహెచ్‌డీ ఇవ్వాలి అని సున్నితంగా రెండు అంటించారు.
 
ఇన్‌స్టాలో మిషెల్‌ మద్దతు
‘‘ఆడపిల్లలకు మాత్రమే కాదు. మహిళలందరికీ జిల్‌ రోల్‌ మోడల్‌. వైట్‌ హౌస్‌లో ఎనిమిదేళ్లు తనను దగ్గరగా చూశాను. ప్రొఫెషనల్‌ ఉమన్‌ అంటే తనే అనిపించింది. ఒక బాధ్యత కాదు. కాలేజ్‌లో పాఠాలు, ఇంట్లో తల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా అన్ని పాత్రల్లోనూ తను ఆదర్శంగా ఉండేవారు. ప్రొఫెషనల్‌గా ఉండే ఒక మహిళ.. ఆమె ‘డాక్టర్‌’, ‘మిస్‌’, ‘మిసెస్‌’, ఆఖరికి ‘ఫస్ట్‌ లేడీ’ అయినా, ఎంత సాధించినా ఆమె శక్తిని గౌరవించడం కన్నా, ఆమెను అపహాస్యం చేయడమే ఎక్కువగా ఉంటుంది. తరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న వివక్షే ఇది. అయినా స్త్రీ ఎప్పటికప్పుడు తనను తను నిరూపించుకుంటూనే ఉంది. జిల్‌ బైడెన్‌ కన్నా మెరుగైన ‘ఫస్ట్‌ లేడీ’ ఉంటారా?!’’

కాబోయే అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌తో మిషెల్‌ ఒబామా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top