ఇస్లాం వెలుగు
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) సమక్షంలోకి ఆయన అనుచరుడు ఒకరు వచ్చారు. ఎంతో ఆశగా, కాస్త గర్వంగా ప్రవక్తతో ఇలా అన్నాడు: ‘‘ప్రవక్తా! వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేయించాను. ఇంత కష్టపడ్డాను కదా, ఇప్పుడు మా అమ్మ రుణం తీర్చుకున్నట్లేనా?’’
దానికి ప్రవక్త (స) ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. ఆయన ఎంతో శాంతంగా, అంతే గంభీరంగా... ‘‘నువ్వు ఎంత చేసినా, మీ అమ్మ నిన్ను ప్రసవిస్తున్నప్పుడు ఆ వేదన భరించలేక పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’’ అని చెప్పారు.
అదీ తల్లి స్థానం! మనల్ని నడిపించడానికి తన నడుము వంచి, మనల్ని పెంచడానికి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన మాతమూర్తి త్యాగానికి ఈ సృష్టిలో ఏదీ సాటిరాదు. ఏ భౌతిక సేవలు, ఏ సంపదలు ఆ రుణాన్ని పూర్తిగా తీర్చలేవు. పాలుపట్టిన తల్లికి... భుజంపై దుప్పటి పరిచిన ప్రవక్త! కన్నతల్లి ఎలాగూ ఆదరణీయురాలు, మరి పాలుపట్టి పెంచిన తల్లి స్థానమేమిటి? దానికి ప్రవక్త (స) తన జీవితం ద్వారానే ఒక అద్భుతమైన ఆదర్శాన్ని చూపారు.
ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త (స) తన సహచరులతో కలిసి ఏదో ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నారు. అంతలో అటుగా ఒక సామాన్య వృద్ధురాలు వచ్చింది. ఆమెను చూడగానే ప్రవక్త (స) ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారు. ఎంతో ఆ΄్యాయంగా ముందుకు వెళ్లారు. అంతటితో ఆగక, తన భుజంపై ఉన్న పవిత్రమైన దుప్పటిని తీసి నేలపై పరిచి, ఆమెను ఎంతో గౌరవంగా దానిపై కూర్చోబెట్టారు. వినయంతో, లాలిత్యంతో ఆమెతో మాట్లాడారు.
ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఒక సహచరుడు... ‘ఈమె ఎవరు?‘ అని పక్కనున్న వారిని అడిగాడు. దానికి మరో సహచరుడు, ‘‘ఆమె ప్రవక్త (స)కు బాల్యంలో పాలుపట్టిన తల్లి దాయీ హలీమా’’ అని చెప్పారు. ప్రవక్త మాతృమూర్తి బాల్యంలోనే కన్నుమూయడంతో హలీమా ఆయన్ను సాకారు. కన్నతల్లి కాకపోయినా, కేవలం పాలుపట్టి పెంచినందుకే లోక గురువైన ప్రవక్త అంతగా తలవంచి గౌరవించడం... నేటి సమాజానికి ఒక కనువిప్పు.
తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోసే భారం ఒకెత్తయితే, ప్రసవ సమయం చావు అంచుల్లోకి వెళ్లి వచ్చే పునర్జన్మ. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్తాన్ని పాలుగా మార్చి పట్టే అమృతం... ఈ ముప్ఫై నెలల త్యాగమే ప్రతి మనిషి ఉనికికి పునాది. అందుకోసమే ఖుర్ ఆన్ ఒక చక్కని ్రపార్థనను మానవాళికి నేర్పింది. తల్లిదండ్రులను గౌరవించుకుందాం... వారి పాదాల చెంతే స్వర్గాన్ని వెతుక్కుందాం. – ముహమ్మద్ ముజాహిద్


