
న్యూస్‌మేకర్
అరిహా షా. నాలుగేళ్ల పాప. బెర్లిన్‌లో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉంది. ఈ పాపను భారత్‌కు అప్పజెప్పమని విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం ఆ దేశపు విదేశాంగమంత్రిని కోరారు. గత సంవత్సరం ప్రధాని మోదీ స్వయంగా పాపను అప్పజెప్పమని ప్రతిపాదించారు. కాని జర్మనీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఆమె తల్లిదండ్రులు పాప కోసం చూస్తున్నారు. ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుపుతున్నారు. పిల్లల పెంపకంలో భారతీయుల వైఖరి విదేశీయులకు అర్థం కావడం లేదు. అదే సమయంలో
మన పెంపకం సున్నితంగా మారాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు తెలియచేస్తున్నాయి.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో భాగంగా విదేశాలకు వెళుతున్న భారతీయులు అక్కడ పిల్లల పెంపకం విషయంలో ఉన్న చట్టాల పట్ల సరిగా అవగాహన లేకుండా కష్టాలు తెచ్చుకుంటూనే ఉన్నారు. గతంలో నార్వేలో పిల్లలకు దూరమైన దంపతుల ఘటన మనకు తెలిసిందే (దీనిపై మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే సినిమా కూడా వచ్చింది). ఇప్పుడు మరో దంపతులు తమ కుమార్తె కోసం అలమటిస్తున్నారు. వారి పేర్లు భర త్ షా, ధారా షా. గుజరాత్‌కు చెందిన వీరి కుమార్తె అరిహా షా ఇప్పుడు బెర్లిన్‌లో జర్మనీ అధికారుల సంరక్షణలో ఉంది.
ఏం జరిగింది?
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన భరత్ షా తన భార్యతో కలిసి 2018లో బెర్లిన్‌కి ఉద్యోగార్థం వెళ్లాడు. 2021లో వారికి కుమార్తె పుట్టింది. అరిహా షా పేరు పెట్టుకున్నారు. పాపకు ఏడు నెలల వయసున్నప్పుడు (ప్రమాదవశాత్తు అనీ, నాయనమ్మ పొరపాటు వల్ల అనీ చెప్తున్నారు) పాప జననాంగం దగ్గర గాయం అయ్యింది. వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగానే ప్రోటోకాల్‌లో భాగంగా అధికారులు వచ్చి పరిశీలించి అత్యాచారం జరిగిందేమోనన్న అనుమానంతో పాపను తీసుకెళ్లిపోయి స్థానిక ‘యూత్ వెల్‌ఫేర్ ఆఫీస్’ సంరక్షణలో ఉంచారు.
2021 సెప్టెంబర్ నెలలో పాపను తీసుకెళితే ఇప్పటి వరకూ తిరిగి అప్పగించలేదు. జర్మనీ చట్టాల ప్రకారం పిల్లల పెంపకంలో పిల్లలకు హాని జరిగినట్టు ఆధారాలు కనిపిస్తే వారు పిల్లలను తమ సంరక్షణలో తీసుకుంటారు. అందులో భాగంగానే అరిహా షాను స్వాధీన పరుచుకుని తల్లిదండ్రులను కేవలం రెండు మూడు వారాలకు ఒకసారి పాపను చూసే అనుమతిని ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు పాపను తమకు ఇవ్వమని పోరాడుతున్నారు.
ప్రభుత్వం పూనుకున్నా...
అరిహా షా బెర్లిన్ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచి భారత్‌లో ‘సేవ్ అరిహా’ పేరుతో ఉద్యమం మొదలైంది. చాలామంది గుజరాత్ నుంచి పాప కోసం ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఈ విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చాక 2024లో ప్రధాని మోదీ జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో పాప విషయం ప్రస్తావించి పాపను తల్లిదండ్రులకు అప్పగించవలసిందిగా కోరారు.
ఆయన సానుకూలంగా స్పందించినా పాప ఇండియా చేరలేదు. అయితే భారత ప్రభుత్వ ప్రమేయం తర్వాత అత్యాచార అభియోగాన్ని వెనక్కు తీసుకున్నారు. తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రి జొహాన్ వాడెఫుల్‌ను అరిహా షా అప్పగింత కోసం సంప్రదించారు. ‘పాపకు తన భాష, మత, సంస్కృతి, సమాజ పరిసరాలలో పెరిగే హక్కు ఉందని, కాబట్టి పాపను అప్పగించాలని’ కోరినట్టు ఆయన తెలిపారు. విదేశాంగ మంత్రి కూడా దీనిపై సానుకూలత వ్యక్తం చేశారు.
పొంచి ఉన్న ప్రమాదం...
అయితే పాపను సంరక్షణలో ఉంచుకున్న బెర్లిన్ యూత్ వెల్ఫెర్ ఆఫీస్ ఇవన్నీ ఖాతరు చేయడం లేదు. అది ‘సివిల్ కస్టడీ కేసు’ వేసి పాప తల్లిదండ్రులకు శాశ్వతంగా పాప మీద పెంపకపు హక్కును రద్దు చేయమని కోరింది. దీని ప్రకారం తీర్పు వస్తే ఇకపై పాపను అనాథగా నమోదు చేసి అనాథాశ్రమంలో పెంచుతారు. ఈ విషయమై పాప తల్లిదండ్రులు తీవ్ర అందోళనలో ఉన్నారు. వారి వీసా గడువు కూడా త్వరలో ముగియనుంది. ఇకపై వారు పాపను చూడటం కష్టం కూడా.
విదేశాలలో ఉన్న భారతీయులు ఇక్కడిలా అక్కడ పిల్లలను పెంచకూడదని ఈ ఘటన గట్టిగా చెబుతోంది. మన దేశ విధానాలను చాలా దేశాల్లో తప్పుగా, నేరంగా పరిగణిస్తారు. అదే సమయంలో మన దేశంలో కూడా పిల్లల పెంపకంలో సున్నితమైన మార్పులు అవసరం. వారితో వ్యవహరించే పద్ధతి మారకపోతే చట్టాలు కఠినంగా వ్యవహరించకపోయినా పిల్లల ప్రవర్తనలో పెను దోషాలు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త.