హగ్స్‌ – క్వెశ్చన్స్‌ | Hugs – Questions: These questions asked by parents are the future of their children | Sakshi
Sakshi News home page

హగ్స్‌ – క్వెశ్చన్స్‌

Dec 6 2025 1:03 AM | Updated on Dec 6 2025 1:03 AM

Hugs – Questions: These questions asked by parents are the future of their children

పిల్లలను జాగ్రత్తగా సంరక్షించుకోవడం, వారికి మంచి బుద్ధులు అలవడేలా చూసుకోవడం తల్లిదండ్రులందరి బాధ్యత. అయితే ప్రతి ప్రతిరోజు రాత్రి పిల్లల్ని, తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని  ప్రశ్నలు అడగడం వల్ల వారి ఆలోచనా విధానం, వ్యక్తిత్వ వికాసంపై మంచి ప్రభావం పడుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఇంతకీ తల్లిదండ్రులు పిల్లల్ని అడగాల్సిన ఆ ప్రశ్నలేంటో చూద్దామా..

తల్లిదండ్రులు వేసే ఈ ప్రశ్నలు పిల్లల భవిష్యత్తును నిర్దేశించేంత శక్తిని కలిగి ఉంటాయని, ఇవి పిల్లల్లో ఆత్మపరిశీలన, ఆసక్తి, బాధ్యతాభావం, ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యం వంటి ముఖ్యమైన విలువలను పెంచుతాయంటున్నారు నిపుణులు.

తల్లిదండ్రులకు పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ వారిని ముద్దు చేస్తూనే ఉంటారు. అయితే పేరెంట్స్‌ ప్రేమగా పిల్లలకు రోజూ ఒక ముద్దు పెట్టడం, హగ్‌ ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
తల్లిదండ్రులందరికీ పిల్లలంటే ప్రేమే. అయితే కొందరు తల్లిదండ్రులు ఆ ప్రేమను సరిగా వ్యక్తం చేయ (లే)రు. అది చాలా తప్పు. పిల్లలకు తమ ప్రేమను వ్యక్తపరచడం కూడా అవసరం. రోజూ పిల్లలకు ఒక హగ్‌ ఇవ్వడం, ముద్దు పెట్టడం చిన్న విషయంలా కనిపించినా, పిల్లల మనసులో అది అపారమైన భద్రత, సాంత్వన, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.  

హగ్‌ ఇవ్వడం వల్ల ఏమవుతుంది?
రోజూ హగ్‌ ఇవ్వడం వల్ల పిల్లల మెదడులో ‘‘ఆక్సిటోసిన్‌’’ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది పిల్లలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. భయాన్ని తొలగిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. మనుషుల మధ్య ప్రేమను, అనుబంధాన్ని పెంచడంలో ఈ హార్మోన్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే హగ్‌ చేసుకున్న తర్వాత పిల్లలు వెంటనే స్మైల్‌ ఇస్తారు. ప్రశాంతంగా మారతారు.

ముద్దు పెట్టడం వల్ల..?
పిల్లలకు ముద్దు పెట్టినప్పుడు వారి హార్ట్‌ బీట్‌ మారుతుంది. శ్వాస నెమ్మదిస్తుంది, మనసులో ప్రేమ పూరిత వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు ఉదయం ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఒక ముద్దు పెట్టి.. హగ్‌ ఇవ్వడం వల్ల రోజంతా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేరెంట్స్‌ చూపించే ప్రేమ వారికి గుర్తుకు వస్తుంది. దానివల్ల ఒంటరితనం దూరమవుతుంది.

శక్తినిచ్చే హగ్‌
పిల్లలు తప్పులు చేసినప్పటికీ.. వారు బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు దగ్గరకు తీసుకుని హగ్‌ ఇవ్వడం వల్ల వారికి ఎనలేని శక్తి లభిస్తుంది. ‘‘నేను నీతోనే ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు’’ అనే భావన వారిలో కలుగుతుంది. దానివల్ల పిల్లలు తప్పును ఒప్పుకోవడానికి, నేర్చుకోవడానికి, మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు.  

బంధం బలపడుతుంది
రోజూ ఇలా పేరెంట్స్‌ ప్రేమని పొంందిన పిల్లలు భవిష్యత్తులో మంచి వ్యక్తులవుతారు. క్రమశిక్షణతో ఉంటారు. ఇతరులను అర్థం చేసుకునే గుణాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు రోజూ పిల్లలను ఇలా ప్రేమతో దగ్గర చేసుకోవడం తల్లిదండ్రులకూ మంచిదే. మనసులో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. రోజంతా పని చేసిన అలసట సడలిపోయి మనసు తేలికవుతుంది. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.

ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?
పిల్లలను ప్రతిరోజూ పడుకునేముందు ‘ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’’ అని అడగాలి. దానివల్ల వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. అంతేకాదు, పిల్లల్లో ఆసక్తిని పెంచి, పరిశీలన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ ఒక్క ప్రశ్నతో వారు రోజు మొత్తం నేర్చుకున్న విషయాలను గుర్తుచేసుకుంటారు. ఫలితంగా వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది. తాము నేర్చుకున్న విషయాన్ని అంచనా వేసే అలవాటు ఏర్పడుతుంది. అంతేకాదు, తల్లిదండ్రులు తాము నేర్చుకున్న విషయాల పట్ల ఆసక్తి చూపుతున్నారని పిల్లలు భావిస్తారు. దానివల్ల పిల్లలు, పేరెంట్స్‌ మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. అంతేకాదు రోజూ ఏదో ఒక్క విషయం కొత్తగా నేర్చుకోవాలి అనే ప్రేరణ పిల్లల్లో కలుగుతుంది. ఇలా నిరంతరం అడగటం వల్ల పిల్లల్లో సజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం క్రమంగా పెరుగుతాయి.

ఈ రోజు నీకు ఏదైనా కష్టంగా అనిపించిందా?
పిల్లలను ప్రతిరోజు ‘‘ఈ రోజు నీకు ఏ విషయం కష్టంగా అనిపించింది?’’ అని అడుగుతుండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు తమ కష్టాలను వినడానికి సిద్ధంగా ఉన్నారని పిల్లలు తెలుసుకోవడం వల్ల వారిలో భద్రతాభావం, నమ్మకం పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది. దాని ద్వారా వారిలో ఆత్మపరిశీలన, నిజాయతీ, భావాలను వ్యక్తపరిచే ధైర్యం పెరుగుతుంది. అంతేకాదు, పిల్లలు తమకు కష్టమైన విషయాలను ఎప్పటికప్పుడు తమ తల్లిదండ్రులకు చెప్పుకోవడం వల్ల వారి మానసిక భారం తగ్గి భావోద్వేగాలలో స్థిరత్వం పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఈ ప్రశ్న ద్వారా పిల్లలకు కష్టాలు సహజమని.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని అర్థమవుతుంది.

రేపు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు?
పిల్లలను రోజూ ‘‘రేపు నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? నీకు ఏం తెలుసుకోవాలని ఆసక్తి ఉంది?’’అని అడగడం వల్ల వారిలో భవిష్యత్‌ పట్ల సానుకూల దృష్టి, నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు, ఈ ప్రశ్న పిల్లలను ఆలోచించేలా చేసి, వారి రోజును వారే స్వయంగా ΄్లాన్‌ చేసుకునేలా చేస్తుంది.  రేపు నేర్చుకోవాలనుకునే విషయాన్ని గుర్తించడం వల్ల వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా పిల్లల ఆసక్తులను అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. దానివల్ల పిల్లల అభిరుచులకు అనుగుణంగా మద్ధతు, మార్గదర్శకత్వం అందించవచ్చు. 

తల్లిదండ్రులు రోజూ పిల్లలు స్కూలు నుంచి రాగానే వారి కోసం కాస్త సమయం కేటాయించి.. వారిని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని ఈ మూడు ప్రశ్నలు అడగడం ద్వారా వారిలో ఆత్మపరిశీలన, ఆసక్తి, ధైర్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, స్వతంత్ర ఆలోచన వంటి ముఖ్యమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. పేరెంట్స్‌ చేసే ఈ చిన్న ప్రయత్నం వల్ల వారు చదువులోనే కాక, జీవితంలోనూ విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement