‘క్లిక్’ కొట్టండి.. మామిడి కల్తీని పట్టుకోండి! | How Chemically Ripened Fruits Are Ruining Your Health | Sakshi
Sakshi News home page

‘క్లిక్’ కొట్టండి.. మామిడి కల్తీని పట్టుకోండి!

Apr 30 2026 12:22 PM | Updated on Apr 30 2026 12:44 PM

How Chemically Ripened Fruits Are Ruining Your Health

వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పసుపు పచ్చగా నిగనిగలాడుతూ ఊరించే మామిడి పండ్లు కనిపిస్తాయి. ఈ రంగు వెనుక వెనుక ‘కాల్షియం కార్బైడ్’ అనే భయంకరమైన రసాయన కుట్ర దాగి ఉంది. రాత్రికి రాత్రే కాయలను పండించే ఈ విషపూరిత రసాయనాన్ని అడ్డుకునేందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో ఒక అద్భుత పరిష్కారం లభించబోతోంది. పంజాబ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న సరికొత్త ఏఐ మొబైల్ యాప్ ద్వారా, వినియోగదారులు కేవలం ఒక ఫొటోతో పండు నాణ్యతను పరీక్షించే వీలు కలుగుతుంది.

సాధారణంగా వ్యాపారులు లాభాల కక్కుర్తితో కాల్షియం కార్బైడ్‌ను పండ్లను మాగబెట్టడానికి వాడుతున్నారు. దీనివల్ల విడుదలయ్యే ఎసిటిలీన్ వాయువు పండ్లకు రంగును ఇస్తుంది. అయితే అందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ అవశేషాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల కిడ్నీ, కాలేయ వైఫల్యాలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల జీర్ణవ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ సమస్యను శాస్త్రీయంగా ఎదుర్కోవడానికి ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. ఈ స్మార్ట్ యాప్ పండు యొక్క రంగు, ఉపరితల నిర్మాణం, కాంతి పరావర్తనాన్ని విశ్లేషించి, అది సహజ సిద్ధంగా పండిందా లేక రసాయనాలతో పండించబడిందా అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. రసాయనాలతో పండిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, లోపల గట్టిగా ఉండి, సహజమైన సువాసనను కోల్పోతాయి. ఈ సూక్ష్మ వ్యత్యాసాలను ఏఐ డేటా విశ్లేషణ ద్వారా కచ్చితత్వంతో పసిగట్టవచ్చు.

భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతించిన ఎథిలీన్ గ్యాస్ పద్ధతి ఖరీదైనది కావడంతో వ్యాపారులు ఈ చౌకైన విషాన్ని వాడుతున్నారు. అయితే త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఏఐ సాంకేతికత సామాన్య వినియోగదారుడికి ఒక రక్షణ కవచంలా మారనుంది. ఇది అందుబాటులోకి వస్తే, కల్తీ పండ్ల మాఫియాకు ముకుతాడు వేయడమే కాకుండా,  ఆహారం సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ స్వయంగా తనిఖీ చేసుకునే అవకాశం కలుగుతుంది. అంటే త్వరలో కేవలం ఒక క్లిక్‌తో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉండబోతోంది.

ఇది కూడా చదవండి: Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement
 
Advertisement
Advertisement