'పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’ అంటే..? | Health Tips: Peripheral artery disease Symptoms and causes | Sakshi
Sakshi News home page

'పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’: ధమనుల్లో బ్లడ్‌కు అడ్డు!

May 26 2026 4:23 PM | Updated on May 26 2026 4:28 PM

Health Tips: Peripheral artery disease Symptoms and causes

అది కీలకమైన మెదడు కణమైనా.... లేదా కాళ్లూ చేతుల్లో ఉండే మామూలు కణమైనా... అది ఏదైనా సరే... దేహంలోని ప్రతి జీవకణానికీఆహారం, ఆక్సిజన్‌ అందడం అవసరం. ఒకవేళ అలా అందకపోతే... కీలకమైన మెదడూ, గుండె లాంటి వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో... మనం అంత ప్రధానం అనుకోని మిగతా కణజాలానికీ అలాంటి ప్రమాదమే జరుగుతుంది. అంటే... కాళ్లూ, చేతుల విషయంలోనూ జరుగుతుంది. అలా కణజాలానికి తగినంత ఆక్సిజన్, ఆహారం అందనందువల్ల వచ్చే అనారోగ్యం... ‘పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’. ఈ సమస్య ఏమిటో, దానితో వాటిల్లో అనర్థాలేమిటో చూద్దాం...

మన కాళ్లూ, చేతుల్లోని ప్రతి కణానికీ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడే అవి సమర్థంగా తమ విధులు నిర్వహించగలుగుతాయి. ఏదైనా కారణాల వల్ల మన కాళ్లూ, చేతులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటంగానీ లేదా వాటిల్లో కొవ్వు పేరుకోవడంగానీ జరిగితే... నిరంతరమూ కొనసాగాల్సిన రక్తసరఫరా సాఫీగా జరగకపోవచ్చు. 

అలా రక్తసరఫరా జరగనందువల్ల వచ్చే ఆరోగ్య సమస్యను ‘పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’ (ప్యాడ్‌) అంటారు. పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ అనే ఈ వ్యాధి స్త్రీలూ, పురుషులూ అనే తేడాలేకుండా అందరిలో కనిపించే అవకాశముంది.

 పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిజీస్‌ ఉన్నవారిలో కాళ్లలోని పిక్కలు, నడుం కింది భాగం (హిప్‌)లో తరచూ తీవ్రమైన నొప్పితో కూడిన తిమ్మిర్లు (క్రాంప్స్‌) వస్తాయి. చాలా సందర్భాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లక్షణం... అంటే పిక్కలు పట్టేయడం  ఎక్కువగా కనిపింవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అంటే ఆ సమయంలో కాలూ, చేతిలోని సదరు భాగానికి తగినంత రక్తసరఫరా అందకపోవడం వల్లనే ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశాముంది. ఇలాంటప్పుడు ఆ భాగానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వగానే ఆ నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. 

కొందరిలో తాత్కాలికంగా స్పర్శ తెలియకుండా పోవడం (నంబ్‌నెస్‌) లేదా  సూదులతో పొట్లుగా అనిపించడం (టింజ్లింగ్‌). 

మరికొందరిలో ఒక్కోసారి ఆ కాలు లేదా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపించవచ్చు. 

ఇంకొందరిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాలకింద మంటగా ఉన్నట్లుగా లేదా పాదాలు, కాలివేళ్ల కింది భాగంలో నొప్పిగానూ, మంటగానూ ఉన్నట్లు అనిపించడం. ఇక కొందరిలో

పాదాలకు లేదా కాలి కింది భాగంలో ఏదైనా పుండు వంటిది వస్తే అది ఒక పట్టాన మానకపో 

పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిజీస్‌ తర్వాతి దశలో కాలు/చేయి తాలూకు రంగు మారడం, అది చల్లబారినట్లుగా ఉండటం మామూలే. ఈ దశలో కొంతమందిలో కాలు /చేతి పైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపో ఇక రక్తసరఫరాకు పూర్తిగా ఆటంకం ఏర్పడి గ్యాంగ్రీన్‌లా పరిణమించిన కొందరిలో... కాలు / చేయి తొలగించాల్సిన (యాంప్యుటేషన్‌కు వెళ్లాల్సినంత) తీవ్రమైన పరిస్థితి కూడా రావచ్చు.

గుండె జబ్బులకూ/ స్ట్రోక్‌కూ అవకాశం:
పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉందంటే అది కేవలం కాలూ, చేతికే పరిమితం అవుతుందనేందుకు వీల్లేదు. అంటే... ఎవరిలోనైనా పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉందంటే ఆ వ్యక్తిలో రక్తం సాఫీగా ప్రవహించేలాంటి తత్వం (టెండెన్సీ) లేదని అర్థం. ఇది కాళ్లూ, చేతుల్లోనే ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కీలకమైన అవయవాలైన గుండె లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అదెంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. 

అంటే పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉన్నవారికి గుండెపో పక్షవాతం ముప్పుండే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్‌ పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 

నిర్థారణ: 
ఫిజికల్‌గా బయటకు కనిపించే లక్షణాలతోపాటు... ‘పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’ను నిర్ధారణ చేయడానికి ‘యాంకిల్‌ బ్రాకియల్‌ ఇండెక్స్‌’ (ఏబీఐ) అనే పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ఎంతమాత్రమూ నొప్పి ఉండదు. ఈ పరీక్షలో అల్ట్రా సౌండ్‌ తరంగాల సహాయంతో భుజాలు / పాదాలు ఉండాల్సిన రక్తపోటునుకొలుస్తారు. ఈ ఏబీఐ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలనూ, వ్యాధి ఉందని అనుమానిస్తున్న వ్యక్తిలోని రిస్క్‌ ఫ్యాక్టర్లనూ సరిపోల్చి చూస్తారు. 

ఈ పరిశీలన తర్వాత... వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని ఫిజీషియన్‌ నిర్ణయిస్తారు.  ఏబీఐ టెస్ట్‌లో... మొదట భుజం లేదా చేతిలోని రక్తపోటు (బ్లడ్‌ ప్రెషర్‌)ను... మామూలు బీపీ యంత్రంలో కొలవడంతోపాటు, డాప్లర్‌ అని పిలిచే ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్‌ స్టెతస్కోపు సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. 

ఈ వ్యాధినిర్థారణ కోసం శరీరంపై గాటు పెట్టకుండా కూడా నిర్ధారణ చేసే (నాన్‌ ఇన్వేజివ్‌) పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమేజింగ్‌ టెక్నిక్స్‌ సహాయంతో  ఈ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు... మాగ్నెటిక్‌ రిజోనెన్స్‌ యాంజియోగ్రఫీ (ఎమ్మార్‌ఏ), సీటీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్‌ టెక్నిక్స్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధినిర్ధారణకు తోడ్పడతాయి.

ఈ వ్యాధి ఎవరెవరిలోనంటే.. 

వయసు యాభై ఏళ్లు పైబడ్డ ఏ వ్యక్తిలోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పెరిగే వయసు(ఏజింగ్‌)తోపాటు మరికొన్ని అంశాలూ ఈ వ్యాధికి కారణమవుతుంటాయి. అవి... 

పొగతాగే అలవాటు ఉండటం ∙వ్యాయామం చేయకపోవడం 

స్థూలకాయం ∙డయాబెటిస్‌ ∙నియంత్రణలో లేని రక్తపోటు / రక్తపోటు పెరగడం 

రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం 

ఈ లక్షణాలతో పాటు కుటుంబ సభ్యుల్లో పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉండటం అనేది ఆ ముప్పును మరింత పెంచే అంశం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకూ ‘ప్యాడ్‌’ రిస్క్‌ ఉందనే అంశాన్ని గుర్తెరిగి... దగ్గరి కుటుంబ సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కారణాలు...
పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌కు అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది...  రక్తనాళాల్లోపల రక్తం ప్రవహించే పైప్‌ లోపలి పొర గట్టిబారడం. ఈ కండిషన్‌ను అథెరోస్కీ›్లరోసిస్‌ అంటారు. నునుపుగా ఉండే తలం మీద ద్రవం ఎలాంటి అంతరాయమూ లేకుండా సాఫీగా జారిపోతుంటుంది. ఒకవేళ ఆ తలం గరుగ్గానూ, గట్టిబారినట్లుగా మారడం వల్ల  రక్తసరఫరా సాఫీగా జరగదు. దాంతో రక్తసరఫరాకు  అంతరాయం ఏర్పడుతుంది. 

ఇలా రక్తనాళంలోని  లోపలి తలం గరుగ్గా, గట్టిబారినట్లుగా మారడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కొవ్వు, కొలెస్ట్రాల్‌ వంటివి రక్తప్రవాహం సాఫీగా వెళ్లే ఆ పైప్‌లోపలి తలంపై అంటుకుని అక్కడ గారలా ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి అంతరాయాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. దాంతో ఒకచోట క్రమంగా రక్తానికి ఏదైనా తట్టుకుంటూ తట్టుకుంటూ ఉండటం వల్ల క్రమంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లుగా ఓ ఉండలాగా (క్లాట్స్‌) ఏర్పడవచ్చు. ఇది ఒక్కోసారి రక్తనాళాన్ని బ్లాక్‌ చేసి రక్తసరఫరాను అపేయవచ్చు.

చికిత్స
పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌కు చికిత్స చేసే ముందర బాధితుల ఫిట్‌నెస్, వ్యాధి తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.  కొన్ని సందర్భాల్లో కేవలం బాధితుడి జీవనశైలిలో మార్పులు చేయడంతోనే వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశముంది.ఉదాహరణకు బాధితుడికి పొగతాగే అలవాటు ఉంటే, పూర్తిగా  మానేయడం ద్వారా మున్ముందు కాలూ / చేయి కోల్పోయే పరిస్థితి తప్పిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులతో పాటు, వ్యాధి మరింత ముదరకుండా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు మూసుకుపోయిన చోట వాటిని తెరచేందుకు అవసరమైన చికిత్స ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.

వాడాల్సిన మందులురక్తనాళాలు మూసుకుపోవడం అన్నది కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల జరుగుతుంటే దేహంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను నియంత్రించడానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో కాలు /చేయి తిమ్మిర్లు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా మందులు వాడాల్సి రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ (క్లాట్‌)ను కరిగించే మందులూ ఉపయోగించాల్సి రావచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు బాధితులకు రక్తపోటును నియంత్రించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.

ఒకవేళ జీవనశైలి మార్పులూ... మందులూ సరిపోకపోతే?
కొందరిలో కేవలం జీవనశైలి మార్పులతోనూ లేదా మందులు వాడటం వల్ల  గాని ఈ జబ్బు అదుపులోకి రాకపోతే అప్పుడు కూడా రక్తనాళాల్లో  రక్తసరఫరాను సాఫీగా జరిగేలా చూడటానికి అనేక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... ఎక్కడైతే రక్తసరఫరాకు అడ్డంకి ఏర్పడి... తట్టుకుంటూ రక్తసరఫరా జరుగుతుంటుందో 

ఆ ప్రాంతాన్ని అక్కడికక్కడే తెరచి సాధారణ రక్తసరఫరాను పునరుద్ధరించవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియను గతంలోలా సంప్రదాయిక సర్జరీ రూపంలోగాక ఎలాంటి గాటూ లేకుండానే కొన్ని ప్రక్రియల ద్వారా చేయడమిప్పుడు సాధ్యమవుతుంది.

గాటు పెట్టకుండా రక్తప్రవాహాన్ని సరిచేయడం ఇలా...
రక్తప్రవాహానికి అడ్డుపడ్డ క్లాట్‌ను తొలగించి, రక్తసరఫరాను పునరుద్ధరించడానికి ఈ కింది పద్ధతులను అవలంబిస్తారు.  

యాంజియోప్లాస్టీ : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు చేసినట్లుగానే కాళ్లూ / చేతుల తాలూకు రక్తనాళంలోనూ... అడ్డు పడ్డ ప్రాంతానికి ఒక బెలూన్‌ లాంటి దాన్ని పంపి... ఆ బెలూన్‌ను రక్తం ఆగిన చోట ఉబ్బేలా చేస్తారు. దాంతో రక్తనాళంలోని ఆ ప్రదేశంలో అడ్డు తొలగిపోయి, రక్తసరఫరా మామూలుగా అవుతుంది.

అథెరెక్టమీ: ఈ ప్రక్రియలో రక్తనాళం (ధమని)లోకి ఒక క్యాథెటర్‌ను పంపుతారు. రక్తనాళంలోకి వెళ్లే ఒక నునుపైన పైప్‌ లాంటి దాన్ని క్యాథెటర్‌ అంటారు. దీని ద్వారా రక్తనాళం లోపలి ఉన్న గారను తొలగిస్తారు. గట్టిగా మారి ఉన్న ప్రాంతాన్ని నున్నగా అయ్యేలా చేయడం, లేదా షేవ్‌ చేసినట్లుగా నునుపుగా మార్చడం జరుగుతుంది.

స్టెంట్‌ వేయడం: గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళం సన్నబడ్డప్పుడు ఆ సన్నటి ప్రాంతాన్ని మళ్లీ మామూలుగానే తెరుచుకుని ఉంచేలా చేస్తారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి పైప్‌ లాంటి దాన్ని వేసి తెరచి ఉండేలా చేసినట్లే (స్టెంట్‌ వేసినట్లే)... అచ్చం అదే తరహాలో కాలు / చేతిలోని రక్తనాళాల్లోని మూసుకుపోయి ఉన్నభాగానికి ఒక స్టెంట్‌ వేస్తారు. దాంతో మూసుకుపోయిన భాగం తెరచుకుంటుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం లేకుండా రక్తసరఫరా సాఫీగా జరిగిపోతుంది.  

స్టెంట్‌ గ్రాఫ్ట్స్‌: కొన్ని సందర్భాల్లో ఈ స్టెంట్‌లలో సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ వంటిదాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. 
కేవలం ఇలాంటి మార్గాలే కాకుండా కొన్నిసార్లు సాంప్రదాయికంగా చేసే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళంలో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తనాళం అంతా మూసుకుపోతే బైపాస్‌ కూడా చేయాల్సి రావచ్చు. 

వ్యాయామం లేకుండా ఉండటం వంటి బద్ధకంగా ఉండే జీవనశైలి, పొగతాగడం వంటి దురలవాట్ల కంటే మన దేహంలోని అవయవాలు విలువైనవి కాబట్టి... అలాంటి దురలవాట్లను వదులుకొని, చురుకైన జీవితం గడపడం అవసరం. దాంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగించవచ్చు.

డాక్టర్‌ రాజా వి కొప్పాల సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ , రేడియాలజిస్ట్‌

నిర్వహణ: యాసీన్‌

(చదవండి: అచ్చం సంతూర్‌ యాడ్‌ మాదిరిగా 47 ఏళ్ల మామ్‌..! నో ఐస్‌ బాత్‌, నో క్రేజీ డిటాక్స్‌..)

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement