'నాన్‌ డైరియల్‌ డీహైడ్రేషన్‌'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం.. | Health Tips: Doctors Said The hidden dehydration risk in non diarrheal illnesses | Sakshi
Sakshi News home page

'నాన్‌ డైరియల్‌ డీహైడ్రేషన్‌'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..

Sep 11 2025 1:14 PM | Updated on Sep 11 2025 5:29 PM

Health Tips: Doctors Said The hidden dehydration risk in non diarrheal illnesses

అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్‌ ఫాగ్‌), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్‌ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్‌ డైరియల్‌ డీహైడ్రేషన్‌’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. 

డీహైడ్రేషన్‌ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్‌ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. 

నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. 

తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ సమస్య వస్తుంది. 

నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్‌ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. 

పరిష్కారం ఏమిటి? 
హైడ్రేషన్‌ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్‌ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్‌ సొల్యూషన్స్‌ కలిగిన తక్కువ గ్లూకోజ్‌. 

క్యాలరీ, డయాబెటిక్‌ సేఫ్‌ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్‌ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. 

ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్‌ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. 

ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. 
డీహైడ్రేషన్‌ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్‌ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్‌ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. 
– డా.మోసిన్‌ అస్లం, కన్సల్టెంట్‌ ఫిజీషియన్, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్‌   

(చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement