పూనకాలకు కారణం ఏంటో తెలుసా..! | Health Tips: Dissociative disorders Symptoms and causes | Sakshi
Sakshi News home page

పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!

Mar 24 2026 11:48 AM | Updated on Mar 24 2026 11:59 AM

Health Tips: Dissociative disorders Symptoms and causes

మొదట్లో ఒకప్పుడు కొందరు మహిళలకు దేవుళ్లు పూనడం లేదా శివమూగడం అంటూ జరుగుతుంటేది. ఒక ఆసక్తికరమైన అబ్జర్వేషన్‌ ఏమిటంటే... ఇది చాలావరకు ఆర్థికంగా దిగువ మధ్యతరగతి వారిలోనూ, పేద వర్గాల్లోనే కనిపిస్తుండటం చాలా సాధారణం. నిజానికి ఇదొక రకమైన మానసిక రుగ్మత. ఇలాంటి మానసిక రుగ్మతల్లో పేషెంట్‌... ‘నేను’ లేదా ‘తాను’ అనే భావన నుంచి విడిపోయి... మరేదో స్థితిని సంగ్రహిస్తాడు.

అంటే మరో స్థితిని ΄పొందుతాడు కాబట్టి ఇంగ్లిష్‌లో దాన్ని  పొజెసివ్‌ స్టేట్‌ అంటారు. అప్పట్లో అంటే... శాస్త్రీయ అవగాహన అంతగా లేని రోజుల్లో ఇలా జరగడాన్ని... అంటే తాను అన్న భావన నుంచి దూరం జరిగే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. 

నిజానికి హిస్టెరస్‌ అంటే గర్భసంచి (యుటెరస్‌) అని అర్థం. యుటెరస్‌ శరీరంలోని ఇతర భాగాలకు తిరుగాడుతూ... పాకడం వల్ల వచ్చే వ్యాధిగా పరిగణించి అప్పట్లో దీన్ని ‘హిస్టీరియా’ అంటూ వ్యవహరించేవారు. మహిళల్లో ఈ తరహా జబ్బులు ఎక్కువ కాబట్టి హిస్టీరియా అనేవారు. 

అయితే వైద్య విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెంది కారణం తెలిసిన తర్వాత ఆ హిస్టీరియా అనే మాటను వాడకంలోంచి తొలగించారు. అయితే మానసిక విజ్ఞానశాస్త్రం బాగా పెరగడంతో పాటు తన స్థితి నుంచి తాను విడిపోయే పరిస్థితికి (డిసోసియేషన్‌కు) శాస్త్రీయమైన కారణాలు తెలిశాక... ఈ తరహా మానసిక రుగ్మతలను డిసోసియేషన్‌ / కన్వర్షన్‌ డిజార్డర్స్‌గా చెబుతున్నారు. వీటిల్లో అనేక రకాలుంటాయి. అవేమిటో చూద్దాం...

ఓ ఊళ్లోని ఓ పేదింటి అందమైన అమ్మాయిని అక్కడి ఓ రాజకీయ నాయకుడూ... ఊరికి పెద్ద అయిన ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. అతడేమో ఆర్థికంగా, సామాజికంగా చాలా పవర్‌ఫుల్‌. కానీ ఈ అమ్మాయి ఓ అమాయకపు దిగువ ఆర్థికస్థాయికి చెందిన పేద పిల్ల. ఆ పవర్‌ఫుల్‌ వ్యక్తిని ఎదిరించగలిగే బలంగాని,  మానసిక స్థైర్యంగాని ఆ అమ్మాయికి లేవు. అయితే ఆ పవర్‌ఫుల్‌ వ్యక్తి వేధింపులను ఆమోదించి, అతడికి లొంగిపోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. 

ఇలాంటి పరిస్థితుల్లోనే మెదడు ఓ మాయ చేస్తుంది. తనను తాను రక్షించుకునేందుకు ఆ అమ్మాయికి తెలియకుండానే ఓ ఎత్తుగడ వేస్తుంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయికి గ్రామదేవత పూనుతుంది. దాంతో ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. మెదడు చేసే ఈ పనులు ‘సబ్‌–కాన్షియస్‌’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియదు. 

అయితే ఆ అమ్మాయి... తన చుట్టూ ఉన్న ప్రకృతి సంబంధమైన అంశాలను (నేచర్‌ను) అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ‘పొజెస్‌’ చేసుకుంటుంది. అలా తననుంచి తాను ‘విడిపోయి’ అంటే ‘డిసోసియేట్‌’ అయి... గ్రామదేవత తాలూకు స్థితిని ‘పొజెస్‌’ చేసుకుని... అత్యంత పవర్‌ఫుల్‌ వ్యక్తుల నుంచి వచ్చే వేధింపుల నుంచి తనను తాను కాపాడుకోడానికి తనకు తెలియకుండానే ఈ పనులు చేస్తుంది. 

ఇప్పుడు గ్రామదేవత పూనాక ఆ అమ్మాయి స్థితి చాలా బలంగా మారి΄ోతుంది. ఊరిపెద్ద ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా... సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడా అమ్మాయిని తాత్కాలికంగా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ స్థితిలో ఆ అమ్మాయి అక్కడివారి పూజలందుకుంటూ ఉంది. ఆమెకు కావాల్సిన పనులను ఊరి ప్రజలద్వారా చేయించుకుంటూ ఉంది. ఆమె నుంచి వచ్చే మాటను గ్రామదేవత మాటలుగా ఎంచి, ఊరిజనమంతా వాటిని పాటిస్తుంటారు.

నిజానికి ఆమె కోరని మరికొన్ని కోరికలనూ గ్రామస్తులు తీరుస్తుంటారు. దాంతో ఆమె మెదడుకు ఇదొక అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్‌ చేసుకుంటుంది. అంటే గ్రామదేవత తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది. పూనకం (పొసెషన్‌)లోకి వెళ్తుంది. ఇలా కేవలం గ్రామదేవతలే కాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన వేరే మనిషి గానీ, దెయ్యాలూ, భూతాలు కూడా పూనడం అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. సామాన్య జనం దీన్ని పూనడం అంటారుగానీ మానసిక వైద్య శాస్త్రంలో దీన్ని డిసోసియేషన్‌ డిజార్డర్‌ అని చెప్పవచ్చు.

డిసోసియేషన్‌ అంటే...? 
డిసోసియేషన్‌ అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘నేను’ అంటే ఏమిటో, ఆ ‘నేను’ అనే భావన ఎలా కలుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం.  

ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలూ, భావోద్వేగాలూ... ఇవన్నీ తనవిగా గుర్తించడాన్ని ఇంగ్లిష్‌లో ‘ఐ’ అండ్‌ ‘మైన్‌’ అనీ, అదే తెలుగులో చె΄్పాలంటే ‘నేను’ / ‘నా ఆలోచనలు’’ అని చెప్పవచ్చు. అందరిలో ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్‌ కొంతమందిలో ఒక్కోసారి కొంత వ్యవధి పాటు   తొలగిపోతుంది. ఆ సమయంలో ఆ నేను... నేను కానేమో అనే భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్‌’ అంటారు. 

కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... బాగా తీవ్రంగా, తాను  తట్టుకోలేనంతగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గానీ లేదా తన ప్రాణాలకే ముప్పు ఏర్పడినప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడిపోతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్‌ను తనవి కావన్నంతగా విడివడే కండిషన్‌ను ‘డిసోసియేషన్‌ ఆఫ్‌ అఫెక్ట్స్‌’ అనవచ్చు. తన భావోద్వేగాల తీవ్రత కారణంగా అతడి మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా ఓ వ్యక్తి తననుంచి తాను విడిపోవడం జరుగుతుంది.

డీసోసియేషన్‌ కలిగే పరిస్థితులివి... 

తట్టుకోలేనంత ఒత్తిడి 

తీవ్రమైన అలసట 

చాలా తీవ్రమైన డిప్రెషన్‌ 

పసితనంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో ఉండటం... వంటి పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఓ వ్యక్తికి తనదైన దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. 

ఇంగ్లిష్‌లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్‌ ‘సెల్ఫ్‌ ఫీలింగ్‌’ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తేలిగ్గా డిసోసియేషన్‌కు లోనవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్స్‌) కూడా ఏర్పడవచ్చు. 

ఉదాహరణకు ‘అపరిచితుడు’ సినిమాలోని మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్స్‌ కూడా ఓ వ్యక్తి తననుంచి విడివడి వేరే వ్యక్తిని లేదా వేరే వ్యక్తుల ప్రవర్తనలనూ, పర్సనాలిటీలను ΄పొజెస్‌ చేసుకోవడమే అని చెప్పవచ్చు.

‘నేను’ లేదా ‘నా’ అనే భావన లేకపోవడం ఎలా జరుగుతుందంటే... 
ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి చూపు, వినికిడి, స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ ఉపయోగపడుతుంటాయి. తాను ఉన్న తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. 

అది లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు. దీనికి సంబంధించి మరింత అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మన దేహంలోని ఒక భాగానికి మత్తు (లోకల్‌ అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అలా ఇచ్చాక అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తున్నప్పటికీ... అక్కడేం జరుగుతోందో మనక తెలియదు. 

ఒకవేళ అలా శస్త్రచికిత్స చేస్తున్న విషయం గనక మనం మన కళ్లతో చూడకపోతే అది మన శరీరానికి సంబంధించిందన్న భావన కూడా మనకు కలగక΄ోవచ్చు. ఉదాహరణకు మన పంటికి ఏదైనా  చికిత్స చేయించుకుంటున్నప్పుడు అక్కడ లోకల్‌ అనస్థీషియా ఇచ్చాక పన్నుకు డ్రిల్లింగ్‌ జరుగుతున్నప్పటికీ మనకు అక్కడ ఏమవుతోందో అన్నది తెలియనే  తెలియదు.

మరికొన్ని ఉదాహరణలివి...  
కొందరు పీర్ల గుండం దగ్గరా లేదా తమ మొక్కుబడులలో భాగంగా నిప్పులు తొక్కుతూ చేసే మరికొన్ని ప్రత్యేక ప్రార్థనల్లో నిప్పుల మీద బాధే తెలియకుండా నడుస్తుంటారు. తీవ్రమైన భక్తి ఆవేశాలకూ, భక్తిభావనలకు లోనైనప్పుడు ఆ తన్మయత్వం తారస్థాయిలో ఉన్నప్పుడు బాధ అనే భావనే రాదు. ఈ తరహా డిసోసియేషన్‌ను ‘సెన్సరీ డిసోసియేషన్‌’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శజ్ఞానానికి సంబంధించిన డిసోసియేషన్‌గా చెప్పవచ్చు. 

ఏదైనా తట్టుకోలేనంత తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు అది మన మెదడుపై ఒక షాక్‌లాంటి ప్రభావం చూపవచ్చు. అంతటి ప్రభావం కారణంగా  మెదడు మొద్దుబారి΄ోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అందుకే కొందరికి చాలా పెద్ద యాక్సిడెంట్‌ జరిగి తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆ షాక్‌ కారణంగా చాలాసేపటి వరకు వానికి నొప్పి కలగక΄ోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్‌ కారణంగా జరిగే పరిణామమే. 

ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో అత్యంత ఆసక్తితో అందులో మునిగి΄ోయినప్పుడు ఓ విద్యార్థిలోగానీ లేదా ఏదైనా అత్యంత ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నప్పుడూ ఎవరైనా వ్యక్తిగానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియనంతగా అందులో పూర్తిగా లీనమైపోయినపోవచ్చు. అది కూడా డిసోసియేషన్‌కు ఓ తార్కాణమే. 

మనసు నిండా తీవ్రమైన భక్తిభావనను నిండిపోయినప్పుడు తనలోకి దైవం వచ్చినట్లుగా కొందరు అనుభూతి చెందవచ్చు. ఇలాంటి భావనలకు లోనుకోవడం కూడా ఒక రకంగా ‘డిసోసియేషన్‌’యే అని చెప్పవచ్చు. ఈ స్థితినే  ‘పొసెషన్‌’ అంటారు. కాకపోతే ఇది పూర్తిగా సంస్కృతి ఆమోదించిన అంశం కావడంతో... అంతటి భక్తి భావన అన్నది ఆ వ్యక్తికి గానీ, లేదా ఇతరులకు గానీ  ఇబ్బంది కలగజేయనంతవరకు దాన్ని వ్యాధిగా పెద్దగా పరిగణించరు. 

డిసోసియేషన్‌ ఆమ్నీషియా : ఏదైనా షాకింగ్‌ సంఘటనతో లేదా బలమైన  కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగినా లేదా అలాంటి గాయాల్ని  కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం జరుగుతుంది. ఇలా తమకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే వాటిని మరచి΄ోయడాన్ని  ‘డిసోసియేషన్‌ ఆమ్నీషియా’ అంటారు. ఈ కండిషన్‌లో కలిగే మరచి΄ోవడం అన్నది  సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. 

డిసోసియేటివ్‌ ఫ్యూగ్‌ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పని ప్రదేశం నుంచి అకస్మాత్తుగా ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అతడు ఈ ప్రయాణంలో తన సెల్ఫ్‌కేర్‌ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి) అంశాల విషయంలో మామూలుగా ఉన్నా... తాను తిరిగి వెనకకు వచ్చాక తాను ఎక్కడెక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ పాక్షికంగానో లేదా మొత్తంగానో మరచి΄ోవచ్చు. ఇలాంటి డిసోసియేషన్‌లో కనిపించే లక్షణాలకు ఎలాంటి నరాల వ్యాధులూ కారణంగా కనిపించవు.  

ట్రాన్స్‌ అండ్‌ ΄÷సెషన్‌ స్టేట్‌ మధ్య తేడా... 
∙ట్రాన్స్‌ : తాను అనే తన సొంత భావనను అంటే తానెవరు అనే ఫీలింగ్‌ను... ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే తన ఐడెంటిటీని కోల్పోయే లేదా పూర్తిగా మరచి΄ోయే  స్థితిని ‘ట్రాన్స్‌’ అంటారు. తన చుట్టూ జరుగుతున్న వాటిని ఏమాత్రం గుర్తించలేక΄ోవడమో లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించగలిగడం లాంటి స్థితిని ‘ట్రాన్స్‌’గా చెప్పవచ్చు. ఆ స్థితిలో తన భాష, కదలికలు, శారీరకంగా తాను కనబరిచే సాధారణ ΄ోష్చర్స్‌... ఇవన్నీ చాలావరకు తగ్గి΄ోతాయి. ఈ స్థితిలో ΄÷డి΄÷డిగా కేవలం రెండు మూడు మాటలు మాట్లాడుతుంటారు. 
పొసెషన్‌ కండిషన్‌ : ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరినట్లుగా ప్రవర్తించే కండిషన్‌ను ‘పొసెషన్‌’ అంటారనీ, దానికి అపరిచితుడు సినిమా లాంటి ఉదాహరణలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా స్పష్టంగా చె΄్పాలంటే కేవలం ఏ గ్రామదేవత మాత్రమే కాకుండా... ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా ఉండటం... అలాగే మరికొందరిలో దెయ్యం / భూతం / ఏదో  శక్తి ఆవహించినట్లుగా భావించడం కూడా పొసెషన్‌ స్టేట్‌గానే చెప్పవచ్చు. 

ఈ పరిస్థితి కారణంగా తనకు గానీ... అతడి వల్ల ఇతరకులకు గానీ ఇబ్బందిగా లేనంతవరకు దాన్ని వ్యాధిగా పరిగణించరు. ఒకవేళ అలాంటి పొజెషన్‌ స్టేట్‌ వల్ల అది ప్రమాదకరంగా పరిణమించినప్పుడే దాన్ని వ్యాధిగా గుర్తిస్తారు. ఒక ప్రాంతంలో సెషన్‌ సంస్కృతిలో ఇమిడిపోయి ఉండవచ్చు. అలాంటి  సందర్భాల్లో మాత్రం ఆ ప్రవర్తనను వ్యాధిగా గుర్తించడం అంతగా జరగదు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం దాన్ని వ్యాధిగా భావించి తగిన చికిత్స అందించాలి.  

డిసోసియేషన్‌తో కలిగే సమస్యలు 

డిసోసియేటివ్‌ కన్వల్షన్స్‌ : శరీరంలో ఫిట్స్‌ వచ్చిప్పుడు దేహంలో ఎలాంటి కదలికలు సంభవిస్తాయో డిసోసియేటివ్‌ కన్వల్షన్‌లో అలాంటి కదలికలు కనిపిస్తాయి. ఈ కండిషన్‌లో ఉన్నవారు కిందపడి΄ోయినప్పటికీ సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండక΄ోవచ్చు లేదా చాలా అరుదుగా మాత్రమే ఇలా జరగవచ్చు. 

డిసోసియేటివ్‌ మోటార్‌ డిజార్డర్స్‌ : తనలో ఎలాంటి శారీరక సమస్యా లేకపోయినప్పటికీ... నరాలకు సంబంధించిన ఎలాంటి లో΄ాలూ లేక΄ోయినప్పటికీ... వీళ్లలో మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం,  అడుగులు సరిగా పడక΄ోవడం, నడవలేక΄ోవడం, బ్యాలెన్స్‌ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ‘డిసోసియేటివ్‌ మోటార్‌ డిజార్డర్‌’ కావచ్చు. 

డిసోసియేటివ్‌ అనస్థీషియా / సెన్సరీ లాస్‌: ఏ కారణమూ లేకుండా... ఒక వ్యక్తి శరీరంలోని ఒక భాగంగానీ లేదా మొత్తం శరీరంలోగానీ ఎలాంటి  స్పర్శా  లేకపోడంతో పాటు వారిని తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్‌΄ోజ్‌ చేసినా వారికి ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగక΄ోవడాన్ని డిసోసియేటివ్‌ అనస్థీషియా / సెన్సరీ లాస్‌గా పేర్కొనవచ్చు. అయితే ఇలా కొందరిలో వారు తమ చూపు, వాసన చూసే శక్తి, వినికిడి శక్తిని కూడా కోల్పోవడం జరగవచ్చు. 

యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్‌ వాష్‌’ ప్రక్రియను కూడా ఒక రకమైన డిసోసియేషన్‌గా చెప్పవచ్చు. ∙కొందరికి... వారు తమ శరీరం నుంచి విడి΄ోయి, తమ శరీరాన్ని బయటి నుంచి చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్‌డెత్‌’ అనుభవాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్‌ వల్ల కలిగే అనుభూతులే అని చెప్పవచ్చు.  

కన్వర్షన్‌ డిజార్డర్స్‌ :
తీవ్రమైన మానసిక సంఘర్షన కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. ఇలా మానసిక అంశాలను శారీరక లక్షణాలుగా మార్చుకుని బయటపెట్టడాన్ని   ‘కన్వర్షన్‌ డిజార్డర్‌’ అంటారు.

చికిత్స
ఏ కారణాల వల్ల డిసోసియేషన్‌ లేదా కన్వర్షన్స్‌ జరుగుతోందో గుర్తించి ఆ కారణాలను దూరం చేసి ఈ లక్షణాలు తమంతట తామే తగ్గి΄ోతాయి. అలాగే ఈ తరహా పేషెంట్స్‌లో వారు కోల్పోయిన లేదా ఛిద్రమైన వాళ్ల  ‘సెల్ఫ్‌’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు సమర్థమైన చికిత్స అందించవచ్చు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్‌ను బలపరచడం / పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కరించవచ్చు. 

ఇందులో భాగంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలిగేలా వాళ్లలో కొన్ని నైపుణ్యాలనూ (స్కిల్స్‌), ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ను పెంచడం కూడా ఈ జబ్బులకు చికిత్సలో ఓ ప్రధానమైన భాగం. అవసరాన్ని బట్టి కొన్ని  మందులు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ వంటివీ అందించాల్సి రావచ్చు.


డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై హెచ్‌వోడీ ఆఫ్‌ సైకియాట్రీ –సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్‌  

(చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement