పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..! | Maharashtra woman drives auto with toddler for a living | Sakshi
Sakshi News home page

పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!

Mar 24 2026 10:46 AM | Updated on Mar 24 2026 4:22 PM

Maharashtra woman drives auto with toddler for a living

ఒక్కోసారి మనకు వచ్చే కష్టాలే దారి చూపేలా బతుకుతెరువును కూడా అందిస్తాయి. మనకే ఈ కష్టాలు అనుకుంటాం గానీ, ఒక్కోసారి మనలోని టాలెంట్‌, సృజనాత్మకతను వెలికితీస్తాయి అవి . కష్టం మనల్ని వదలకపోవచ్చు గానీ దానిపై సవారీ చేసేలా బతుకు మార్గం చూసుకోవాలి అని ఈ మహిళని చూస్తే అర్థమవుతుంది. ఆమె కథ వింటే కన్నీళ్లు వచ్చినా..గెలవాలని మాత్రం కచ్చితంగా ఆకాక్షిస్తారు.

నెట్టింట వైరల్‌గా మారిన కోమల్‌ అనే మహిళ కథ ప్రతి ఒక్కరిని కదలించేలా మనసులను తాకుతుంది. మహారాష్ట్రకు చెందిన కోమల్‌ గైక్వాడ్‌ అనే మహిళ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. ఇందులో పెద్ద వింత ఏముంది అని తీసిపారేయకండి. ఇక్కడే ఉంది అసలు కథ..!. ఆమె కళ్యాణ్‌ వీధుల్లో ఆటో నడుపుతూ..అటు జీవనాన్ని, ఇటు మాతృత్వాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ సాగుతోంది. అదెలా అంటే..ఆమె కథ ఏంటో తెలుసుకోవాల్సిందే మరి..!.

కోమల్‌ ఆర్థిక కష్టాలు కారణంగా పదోతరగతితోనే చదువు ఆపేసింది. 2018లో వివాహం తర్వాత కళ్యాణ్‌ నగర్‌కు మారింది. అక్కడ ఆమె భర్త ఆటో నడిపేవాడు. కానీ తేజు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే..అతడు తన సొంతూరికి వెళ్లిపోయి తిరిగి రాలేదు. దాంతో కోమల్‌ తన బిడ్డను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఎలాంటి ఆసరా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, దీనికి తోడు తేజును చూసుకునేవారు ఎవ్వరూ లేకపోవడంతో ఉద్యోగంలో కొనసాగడం అసాధ్యంగా మారింది. 

తన బిడ్డకు దూరంగా ఉండని పనిచూసుకోవాలని డిసైడ్‌ అయ్యి..డైవింగ్‌ నేర్చుకుంది. అలా అద్దె ఆటోతో మొదలుపెట్టిన కోమల్‌ ఎప్పుడూ తేజును పక్కనే ఉంచుకుని నగర రోడ్లుపై ప్రయాణించడం ప్రారంభించింది. మొదట్లో ఆటో వెనుకభాగంలో బిడ్డను పడుకునేలా సీటింగ్‌ ఏర్పాటుచేయాలనుకుంది. కానీ ఆ దూరం తన కూతురుకి ఇబ్బందిగా ఉండటంతో..తన సీటు పక్కనే చిన్న సీటు ఏర్పాటు చేసేలా ఉపాయం ఆలోచించి..అలా సెటప్‌ చేసింది. 

దాంతో తేజు రోజంతా తన దగ్గరే ఉండేలా..ఆటో నడపుకోవడం సులభమైంది కోమల్‌కు. ప్రస్తుతం కోమల్‌ రోజుకు రూ. 400 నుంచి రూ. 500 దాక సంపాదిస్తోంది. అంతేగాక ఈఎంఐ పద్ధతిలో తన సొంతంగా ఆటోరిక్షాను కొనుగోలు చేసి, మరో అడుగు ముందుకు వేసింది. కోమల్‌కి ఏమి పెద్దపెద్ద లక్ష్యాలు లేవు కేవలం తన కూతురుకి మంచి విద్యను అందించేలా, పాఠశాలకు పంపించడం తోపాటు తాను మరింతగా సంపాదించడమే ఆమె ఆకాంక్షలు. 

నిజంగా కోమల్‌ గ్రేట్‌ కదూ..భారం వదిలేసి పారిపోయిన భర్త గురించి పక్కనపెట్టి..కూతురు ఆలన పాలనా చూసుకునేలా నడుబిగించిన స్త్రీమూర్తి కదూ..!. నిజంగా ఆ అమ్మ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!.

 

(చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్‌చేస్తే..)

 

Advertisement
 
Advertisement
Advertisement