కీమోతో సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎక్కువ కదా.. తీసుకోవాలా వద్దా?

Health Advice: Side Effects Of Chemotherapy In Cancer Treatment - Sakshi

మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. దేహంలో కొన్ని ప్రాంతాల్లో వచ్చే క్యాన్సర్‌ సర్జరీ ద్వారా తొలగించడానికి అంత అనువుగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కీమోలో ఇచ్చే రసాయనాల ద్వారా వాటిని నాశనం చేయ?డానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో 100పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకేమందునే వాడవచ్చు కూడా.

అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతి లో కీమోలో ఇస్తుంటారు. ఈ రకరకాల మందులన్నీ వాటి ఉమ్మడి ప్రభావంతో క్యాన్సర్‌ కణాలపై పోరాడి వాటిని తుదముట్టిస్తాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్‌ కణాలు దానికి లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కీమోథెరపీలో కాంబినేషన్స్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. ఆ రోగిలో ఉన్న క్యాన్సర్‌ రకాన్ని, అతడి కండిషన్‌ను బట్టి ఏయే మందులు ఎంతెంత మోతాదులో, ఎంతకాలంపాటు ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తుంటారు.  

క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందుల రూపకల్పన జరిగింది. అందువల్ల ప్రతి మందు వేర్వేరుగా పనిచేస్తుంటుందని గుర్తుంచుకోవాలి. ఇక కీమోథెరపీ వల్ల క్యాన్సర్‌ కణాలతో పాటు శరీరంలోని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో వల్ల పేషెంట్‌ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు.

ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌ వల్ల ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌లో భాగంగా... వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం) వంటివి కలగవచ్చు. రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయితే... ఇటీవల సైడ్‌ఎఫెక్ట్స్‌ తక్కువగా ఉండే కీమోథెరపీ మందులనూ రూపొందిస్తున్నారు. అందుకే క్యాన్సర్‌ పేషెంట్లు... డాక్టర్‌ సూచించినప్పుడు అపోహలు తొలగించుకుని, కీమో తీసుకోవడమే మంచిది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top