
డిసెంబర్ నెల వేడుకలకు ఇప్పటి నుండే ప్రిపరేషన్
యేటా నగరంలో కేక్ మిక్సింగ్ సందడి తెలిసిందే
పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా 2 నెలల ముందే మిక్సింగ్, సోకింగ్
విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్, ఆల్కహాల్ మిశ్రమం తయారీ
గత కొంత కాలంగా వైన్ తయారీకి గ్రేప్ స్టాంపింగ్
స్టార్ హోటల్స్, ప్రముఖ రిసార్ట్స్‌లో స్టాంపింగ్ సందడి
హైదరాబాద్ నగరంలో అప్పుడే కేక్ మిక్సింగ్ (Cake Mixing), గ్రేప్ స్టాంపింగ్ సందడి మొదలైంది. సాధారణంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమాలు డిసెంబర్‌లో విరివిగా జరుగుతుండటం విదితమే. కానీ ట్రెడిషనల్ పద్ధతిలో కనిసం రెండు నెలల ముందుగానే ఈ కేక్ మిక్సింగ్ నిర్వహించి ఆల్కహాల్స్‌తో సోకింగ్ చేస్తారు. ఇలా చేసిన కేక్ మిక్సింగ్‌తో డిసెంబర్ మొదటి వారం నుంచి ప్లమ్ కేక్ తయారు చేస్తుంటారు. అంతేకాకుండా ఫ్రాన్స్ సంస్కృతిలో భాగమైన గ్రేప్ స్టాంపింగ్ చేసి సోకింగ్ చేస్తారు. ఈ సంస్కృతి గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో కూడా పాత పద్దతులతోనే నిర్వహిస్తున్నారు. సంప్రదాయం, వినోదం, గ్లామర్ మేళవించిన ఈ కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ఈవెంట్స్ హైదరాబాద్ నగరానికి కొత్త అనుభూతిని జోడిస్తున్నాయి. నగరంలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఈ కేక్ మిక్సింగ్‌ను ఇప్పుడే నిర్వహించి సోకింగ్ చేస్తున్నాయి. –సాక్షి, సిటీబ్యూరో
పాశ్చాత్య దేశాల్లోనే కాదు నగరంలోనూ
సెప్టెంబర్ మధ్య నుంచి డిసెంబరు వరకు నిర్వహించే కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ విరివిగా చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్ ఈ ఈవెంట్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. నగరంలోని నోవోటెల్ ఎయిర్ పోర్ట్ ఈ కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాన్ని మొట్ట మొదటగా చేసి ఈ ఏడాది సంబరాలకు నాంది పలికింది. సంప్రదాయం, ఆధునికత మేళవించిన ఈ మిక్సింగ్, స్టాంపింగ్ ఈవెంట్స్‌లో ఆరోగ్య సూత్రాలు కూడా దాగున్నాయి. ముఖ్యంగా కేక్ మిక్సింగ్‌లో ఆల్మండ్, కిస్‌మిస్, పిస్తా, ఆప్రికాట్, బ్లాక్ రెసిన్, యెల్లో రెసిన్, క్యాష్యూనట్స్ వంటి విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్‌తో ఆల్కహాల్ కలిపి కేక్ మిక్సింగ్ చేస్తారు. వీటికి పలు రకాల స్పైసెస్ కూడా కలుపుతారు. ఈ మిశ్రమాన్ని దాదాపు 2 నెలల వరకూ సోకింగ్ (నిల్వ) చేస్తారు. ఈ పద్దతిలో ఆల్కహాల్‌తో డ్రై ఫ్రూట్స్ కలిసి అద్భుతమైన ఫ్లేవర్ అందిస్తుంది. ఈ సోకింగ్ ద్వారా తయారైన మిశ్రమంతో చేసేదే అసలైన ప్లమ్ కేక్. దీనికి డిసెంబర్ నెలలో ముఖ్యంగా క్రిస్మన్, న్యూ ఇయర్ సీజన్‌లో ప్రత్యేక ఆహార పదార్థంగా స్వీకరిస్తారు.
సరికొత్త ట్రెండ్..
ఫ్రాన్స్‌లో ప్రసిద్ది చెందిన గ్రేప్ స్టాంపింగ్ పద్ధతిని గత కొన్ని సంవత్సారాలుగా భాగ్యనగరంలోనూ వైన్ తయారికి సరికొత్త సంస్కృతిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ద్రాక్షపళ్లను పెద్ద చెక్క బుట్టలో వేసి కేవలం మనుషులు మాత్రమే పాదాలతో తొక్కి ఒక వేడుకలా నిర్వహిస్తారు. ఈ స్టాంపింగ్‌లో భాగంగా వచ్చిన ద్రాక్ష రసాన్ని సోకింగ్ చేసి వైన్‌గా తయారు చేస్తారు. నగరంలో సందడిగా జరగుతున్న ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ ప్రతినిధులను విశేషంగా అలరిస్తున్నాయని స్టార్ హోటల్ యాజమాన్యం తెలుపుతోంది.
సోషల్ మీడియా ప్రభావం
గతంలో పాశ్చాత్య దేశాల్లో ప్రత్యేకంగా జరుపుకునే ఈ సంబరాలు సోషల్ మీడియా ప్రభావంతో ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా ట్రెండ్స్ హైదరాబాద్ నగర వాసుల జీవితాల్లో భాగం అయ్యేందుకు సామాజిక మాధ్యమాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్ ఈ ఈవెంట్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ఫెస్టివల్ ముందస్తు శుభారంభమే కాదు, సంస్కృతి, కమ్యూనిటీ స్పిరిట్‌కి నిదర్శనంగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఈవెంట్స్ మరింత విస్తృతమవుతాయని, మరింత మందిని ఆకట్టుకుంటాయని నోవోటెల్ హోటల్ ప్రధాన చెఫ్ అమన్న రాజు చెబుతున్నారు.
వేవ్ ఆఫ్ హ్యాపీనెస్.. కేక్ మిక్సింగ్ అనేది క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి ముందుగా నిర్వహించే సంప్రదాయం. ఇందులో డ్రై ఫ్రూట్స్, నట్స్, కాండీడ్ ఫ్రూట్స్, మసాలాలు, వైన్స్ కలిపి ఒక ప్రత్యేకమైన మిక్స్ తయారు చేశాం. దీనిని సోకింగ్ చేయడం వల్ల దీని రుచి, సుగంధం ఎక్కువవుతుంది. ఆ మిశ్రమం డిసెంబర్‌లో జరిగే కేక్ బేకింగ్‌కు ఉపయోగిస్తాం. దాదాపు 160 కిలోల ఈ మిశ్రమం సోకింగ్ తరువాత 250 కిలోల ప్లమ్ కేక్ తయారీకి సరిపోతుంది. దీనిని సిగ్నేచర్ క్రిస్మస్ కేక్‌ల కోసం వినియోగిస్తాం. ప్రముఖ పేస్ట్రీ చెఫ్ దివ్య గోప్పనగారి ఆధ్వర్యంలో ఈ మిక్సింగ్ చేశాం. అంతేకాకుండా వేవ్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో 25 అడుగుల పొడవైన కేక్ కూడా తయారు చేశాం. దీంతో పాటు గ్రేప్ స్టాంపింగ్ కూడా నిర్వహించాం. వైన్ తయారీకి నిర్వహించే ఈ పద్ధతిలో మనుఫులు మాత్రమే తమ పాదాలతో ద్రాక్షా పళ్లను తొక్కుతూ, డ్యాన్స్ చేస్తారు. ఇదొక ఫన్–ఫొటోజెనిక్ సందడి. స్టాంపింగ్ కోసం పెద్ద తోట్లను ద్రాక్షాలతో నింపి మంచి మ్యూజిక్‌తో పెద్దలు చిన్నారులతో ఓ వేడుకలా నిర్వహించాం. – సుఖ్‌బీర్ సింగ్, జనరల్ మేనేజర్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్.