ధనమూలం ఇదం జగత్!
కాలాంతకుడు కాలం చెల్లాక వస్తాడు, అప్పులవాడు ఎప్పుడైనా వస్తాడన్నది ఒక నిజం..
‘ధనమూలం ఇదం జగత్’ అని అనిపించారు వాల్మీకి లక్ష్మణుడి చేత.. ఆది కావ్యంగా ఆదరింపబడి అనునిత్యం మన బతుకుల్లో అల్లుకు పోయిన రామాయణంలోని మాట... నేటికీ అన్వయింపబడే మాట..
యుగాలు మారినా, కాలాలు మారినా శిలాశాసనంగా ఉన్న మాట.. ధనమే రాజ్యాలు ఏలుతోంది.. మూలంగా మారి బలంగా తయారై చంచలమైన డబ్బు నిశ్చలంగా నిలిచిపోయింది.
భర్తృహరి తన శతకంలో ‘అన్ని గుణాలు ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి’ అని అంటారు... ఇది లోకం పోకడ అని అనుకున్నప్పటికి ధనానికి నల్గురు దాయాదులు.. ధర్మం, అగ్ని, రాజు, దొంగలని భర్తృహరి సెలవిచ్చారు.. ధర్మం అంటే మనం స్వయంగా సక్రమంగా ఖర్చు పెట్టేది, అగ్ని అంటే ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యం ద్వారా పోయేది, రాజు అంటే మనం చెల్లించే పన్నులు, దొంగలు అంటే దొంగలు ఎత్తుకొని పోయేది.. ఈ మధ్య తరచు జరిగే నేరాల వలన పోతోంది...
ధర్మం, అర్థం, కామం, మోక్షం... ఈ నాల్గు పురుషార్థాలుగా చెప్తారు...
అర్ధం పురుష లక్షణం అంటారు.. కాలానుగుణంగా ‘ముదితల్ నేర్వగ రాని విద్య లేదన్నట్లు పరిగణనలో తీసుకొని అర్థం మానవ లక్షణం అని అనొచ్చు.. అయితే ఏదైనా ధర్మబద్ధంగా వుండాలి, చట్టబద్ధంగా, న్యాయపరంగా ఉండాలి..
దశరథుడి పరిపాలన ధర్మంగా సాగింది.. రామరాజ్యం గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. రమణి వ్యామోహంతో లంకేశుడు రాజ్యం, ప్రాణం పోగొట్టుకుంటే, రాజ్యలక్ష్మి కోసం రారాజు దుర్యోధనుడు ఆధోగతి పాలయినాడు.. ఇతరుల ఆస్తి కోసం, డబ్బు కోసం దురాశ పడ్డ వాళ్ళు నిలువలేక పోయారు..
సాధనమున సమకూరు పనులు ధరలోన అని వేమన సెలవిచ్చినప్పటికీ, సా‘ధన’ము వలన అన్నీ సమకూరతాయి అన్నది సత్యం...
పైసా మే పరమాత్మ హై అని మన ఎదురుగా లక్ష్మీదేవిని ఆవిష్కరణ చేసిన వాళ్ళున్నారు, కొండమీద కోతి అయినా దిగి రావాల్సిందే అనే అహంకార పూరితులూ ఉన్నారు... అప్పుచేసి పప్పు కూడు వద్దన్నారు.. అప్పులేని వాడు అధిక సంపన్నుడని వేమనగారు గౌరవించినా.. అప్పుల అప్పారావులు ఎక్కువైపోయారు.. ఆడంబరాలకి వెళ్లి అప్పు చేసి, తిప్పలు తప్పక కటకటాలలో చిప్పకూడు తిన్నవాళ్లు ఉన్నారు..
పంచతంత్రంలో చెప్పిన అష్టకష్టాల్లో ‘అప్పు’ ఒక కష్టం.. అయినా జనాలు మారటం లేదు..
‘అప్పిచ్చు వాడున్న’ ఊరిలో నివసించమన్న సలహా సుమతీ శతకంలో ఉంది.. కాని అప్పులు చేయమని కాదు.. అదే సుమతీ శతకంలో అప్పు చేసి వ్యయం చేస్తే కీడు చేస్తుందన్నాడు...
కాలాంతకుడు కాలం చెల్లాక వస్తాడు, అప్పులవాడు ఎప్పుడైనా వస్తాడన్నది ఒక నిజం..
దాశరథి శతకంలో భక్తరామదాసు ప్రస్తావించిన ఏడు వ్యసనాలలో అర్థదూషణం ఒకటి..
మహాభారతం ఉద్యోగ పర్వం విదురనీతిలో వ్యసనాల జాబితాలో వృథావ్యయం ఒకటి...
ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, సినీదర్శకులు వారి సామాజిక బాధ్యతలో భాగంగా అర్థం గూర్చి చెప్తూ సక్రమంగా సంపాదించమని, అప్పులు వద్దని, పొదుపు మంత్రం పాటించండి అనీ సెలవిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖర్చు తగ్గించే చర్యలు పాటించండి అని పిలుపు ఇచ్చారు.
ఇం‘ధనం’ వాడకం తగ్గించడం, ఖర్చులు వాయిదాలో భాగంగా బంగారం కొనుగోలు, విదేశీ ప్రయాణం ఏడాదిపాటు వద్దని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించమని చెప్పారు.
మీ పొదుపే మీ భద్రత అన్నారు అబ్దుల్ కలాం.. చాణుక్యనీతిలో తెలివి గా ఖర్చుపెట్టమని ఉంది.
చివరిగా..
సంచయాత్ వర్థతే విత్తం అన్నారు.. పొదుపు వలన సంపద పెరుగుతుంది..
అర్థమనర్థం భావయ నిత్యం అన్నారు ఆది శంకరాచార్యులు వారు.. అర్థం అనర్థం కాని... సంతుష్టం: కో పీ శ్రీ మాన్... ఎవడు సంతుష్టుడో వాడే శ్రీమంతుడు...
మరీ వేదాంతానికి పోకపోయినా సక్రమ మార్గంలో నడుచుకుంటూ వెళదాం. – డాక్టర్ కందాల సత్యనారాయణ మూర్తి


