
ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ– ఒక శూన్యం, నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నేను ఊహించని సంఘటన– ఘటన. ఒక నటన, నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేదతీరే సమయం. అలలు అప్పుడప్పుడు వచ్చి పాదాలను పలకరిస్తూ, వెనక్కి వెళ్తూ, మళ్ళీ అల్లరిగా ముందుకు వస్తూ దోబూచులాడుతున్నాయి.ప్రతిరోజు చీకటి పడగానే బీచ్‌కు రావడం రామకృష్ణకు ఆనవాయితీ.బీచ్‌తో రామకృష్ణకు, రామకృష్ణ (ఆర్కే) బీచ్‌కి అనుబంధం పెరిగిపోవడానికి కారణం పూ..ల...మ్మి..పెళ్లికాని రామకృష్ణకు పెళ్ళైన పూలమ్మితో పరిచయం. రామకృష్ణకి పెళ్లి కాకపోవడానికి కారణం రామకృష్ణే!అతని జీవితంలో పెళ్లి అనే పదాన్ని వివిధ రూపాల్లో చూశాడు.
పెళ్లితో ఒక్కటైనా అమ్మానాన్నల గొడవలు మొదలు, స్నేహితుల కష్టాలు, స్వేచ్ఛ కోల్పోవడాలు చూశాడు.‘సరదాగా స్నేహితులతో మందు కొట్టడానికి కూడా స్వేచ్ఛలేని పెళ్లి’ అని తరచూ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు రామకృష్ణ.ఆడవాళ్ళు పెళ్లి కాకముందు, మగవాళ్ళు పెళ్లయ్యాక భర్తలుగా మారాక, అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి అబద్ధాలు చెప్పడం, నేర్చుకోవడం మొదలు పెడతారని చెబుతాడు. ఇలాంటి చాలా కారణాలకు తోడు అతడిని ఇంప్రెస్ చేసే అమ్మాయి తారసపడలేదు. అందుకే బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడయ్యాడు.
ఆఫీస్ వదలగానే, ‘ఎక్కడికెళ్లారు? ఎప్పుడొస్తారు? ఏం చేస్తున్నారు? ఎవరితో ఉన్నారు? వాట్సాప్ వీడియో కాల్ చెయ్’..లాంటి సమస్యలు లేవు కాబట్టి, పెళ్ళైన ఫ్రెండ్స్ బుద్ధిగా, భయంగా ఆఫీస్ వదలగానే ఇంటిముఖం పడతారు కాబట్టి, తనకు అలాంటి బాదరబందీలు లేవు కాబట్టి, ఆఫీస్ వదలగానే ‘ఓ రోజు అలా జగదాంబ సెంటర్‌కు, మరో రోజు గుడికి, ఇంకో రోజు రామకృష్ణ బీచ్‌కు వెళ్తూ ఉంటాడు.అలా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది పూలమ్మి. పరిచయం అయ్యింది అనడం కన్నా తారసపడింది అనాలేమో!
సాధారణంగా రామకృష్ణకు గుడికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు కాని, ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. నిండుగా చీర కట్టుకుని, ఒద్దికగా పూలసజ్జతో గుడికి వచ్చే అమ్మాయిలను చూస్తుంటే, ఒక మంచి పెయింటింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.పెందరాళే ఇంటికి వెళ్లి ఒరగబెట్టే రాచకార్యాలు లేకపోవడం వల్ల ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్ తమ్ముడు శ్రీధర్ దీనికి పెట్టిన పేరు ‘టీపీ టైం’– టైం పాస్ టైం.అలా ఆ రోజు సాయిబాబా గుడికి వచ్చాడు. గుడి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని దృష్టి పూలు అమ్మే అమ్మాయి మీద పడింది.గుడికి వచ్చిన అమ్మాయిల అందమంతా ఆమెలోనే కనిపించింది. వైజాగ్ అమ్మాయిల నవ్వులన్నీ ఆమె పెదవుల్లో కనిపించాయి. కాటన్ చీరలో, చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేంత అందం.
అలాంటి అందం పూలమాల కట్టి అమ్ముతుంటే, ఆమె అందమే పువ్వుల్లో చేరి పరిమళాలు వెదజల్లుతుందేమో అనిపించింది.మాట్లాడుతున్న ఫోన్‌ను మధ్యలో కట్ చేశాడు. చేతిలోని స్మార్ట్‌ఫోన్ జేబులోకి వెళ్ళింది. అతని కాళ్ళు ఆమె వైపు కదిలాయి.‘రండి సర్, రండి మేడం’ అంటూ వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. పొడవాటి సన్నటి చేతివేళ్ళు పువ్వులను మాలగా కడుతుంటే, ఆ పువ్వులు పులకరించి పోతున్నట్లు వుంది.‘సర్ పూలు కావాలా?’ అడిగింది రామకృష్ణను చూసి.‘వద్ద’ంటూనే పర్స్‌లో నుంచి డబ్బులు తీశాడు.‘ఎన్ని మూరలు సర్...’ అంటూనే చేత్తో మూరలు కొలుస్తుంటే, తన మనసును కొలుస్తున్నట్టు అనిపించింది.శనివారం వేంకటేశ్వరస్వామి గుడిలో కనిపించింది. శుక్రవారం మరో గుడిలో– ఎప్పుడు కలిసినా పూలు కొంటూనే వున్నాడు.
ఇంటికి వెళ్ళాక అతని మంచం పక్కనే ఆ పూలు టీపాయ్ మీద పేరుకు పోతూనే ఉన్నాయి.ఆమె మెడలో మెరిసే పసుపుతాడు, నుదుట సిందూరం, కాలివేళ్లకు మెట్టెలు, ఆమెకు పెళ్లయిందని చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఆమెను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్.ఒకరోజు నవ్వుతూ అన్నాడు. ‘నీ దగ్గర పూలు కొనడానికి రోజుకో గుడి దగ్గరికి రావలసి వస్తోంది’ అని.ఆమె ఏమాత్రం అతడిని నొప్పించకుండా ‘బీచ్‌లో అయితే రోజూ సాయంత్రం నుంచి చీకటి పడే వరకు ఉంటాను. మేడం కోసం పూలు కొనాలనుకుంటే అక్కడికి రండి’ అంది అదే చిరునవ్వుతో.అలా అతనికి ఆమె ద్వారా, బీచ్‌తో మరింత అనుబంధం పెరిగింది.సాయంత్రం ఆఫీస్ వదలగానే బీచ్‌కు వెళ్లడం ఆమెతో కాసేపు మాట్లాడ్డం, పూలు కొనడం.‘రోజూ మేడంకు పూలు తీసుకువెళ్తారు. మేడంను ఒకసారి తీసుకురండి సర్’ అంది కాస్త చనువు పెరిగాక.
నవ్వి ఊరుకున్నాడు రామకృష్ణ. పెళ్ళైన అమ్మాయి పట్ల తాను ఏర్పరచుకున్న ఫీలింగ్ ఏమిటో అతనికే అర్థం కాలేదు.ఒకరోజు అడిగాడు, ‘నీ పేరేమిటి?’ అని ధైర్యం చేసి.‘అందరూ పూలమ్మి అంటారు. అదే నా పేరనుకోండి’ అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు ఆమె అమ్మే పూల కన్నా ఎక్కువ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది.ఆమె దృష్టిలో అతను వివాహితుడు. అతను అలాగే నటించేశాడు. బీచ్‌లో జంటలను చూసినప్పుడు ఒకప్పుడు ఏమీ అనిపించేది కాదు. కాని, ఇప్పుడు కొద్దిగా ఏదో ఫీలింగ్. పూలమ్మి పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె జడలోని సన్నజాజులు అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి.సరిగ్గా అపుడే అతని జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది.ఆ రోజు పూలమ్మి రాలేదు. ఆ రోజే కాదు మరుసటి రోజు కూడా రాలేదు. మూడవరోజు, నాలుగో రోజు...
పూలమ్మితో పరిచయం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు పూలమ్మి పూలు అమ్మని రోజు లేదు. వర్షం వచ్చినా సరే, గొడుగు వేసుకుని మరీ బీచ్‌కు వచ్చేది.రామకృష్ణ కుదురుగా ఉండలేకపోయాడు. పూలమ్మి పూలు అమ్మే ప్రతి గుడికి వెళ్ళాడు. సాయిబాబా గుడికి, వేంకటేశ్వరస్వామి గుడికి, దుర్గ గుడికి– ఎక్కడా కనిపించలేదు. బీచ్‌కు రావడం లేదు.పూలమ్మికి ఏమైంది?రామకృష్ణ అన్వేషణ మొదలైంది. గుడిలో పూలు అమ్మే వాళ్ళను, బీచ్‌లో పూలు అమ్మే వాళ్ళను ఎంక్వయిరీ చేశాడు. ఎట్టకేలకు పూలమ్మి చిరునామా సంపాదించాడు. ఆఫీస్ వదలగానే పూలమ్మిని వెతుక్కుంటూ బయలుదేరాడు.∙∙ పూలమ్మి ఇల్లు ఊరికి చివర వుంది. పూలమ్మి ఇంటిని సమీపిస్తున్న కొద్ది రామకృష్ణలో ఉద్వేగం, పూలమ్మిని చూడబోతున్నానన్న ఉద్వేగం ఓ వైపు, ‘ఎందుకొచ్చారు?’ అని అడిగితే ఏం చెప్పాలి? కాళ్ళు పూలమ్మి ఇంటి ముందు ఆగాయి.
చిన్న ఇల్లయినా పర్ణకుటీరంలా వుంది. చుట్టూ చెట్లతోనే ప్రహరీ, చిన్న చెక్క గేటు. దానికి అల్లుకున్న మల్లెతీగ. రెండువైపులా చామంతి, బంతి, గులాబీ మొక్కలు. కనకాంబరాలు ఓ పక్క, మరువం ఇంకో పక్క మల్లెతీగలు ఇంటిని అల్లుకుని...ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టు వుంది.చెక్క గేటు తీసుకుని లోపలి అడుగు పెట్టగానే మంచం మీద పడుకుని ఉన్న నాలుగేళ్ల పాప కళ్ళు తెరిచింది. పూలమ్మిని చూసినట్టే వుంది. తన అడుగుల శబ్దం విని కప్పుకున్న దుప్పటి తొలిగించి లేవబోయింది. కాళ్లు చచ్చుబడి సహకరించడం లేదు.రామకృష్ణ మనసు చివుక్కుమంది. పూలమ్మి కూతురికి ఈ కష్టమా?‘అమ్మ లేదా పాపా?’ అడిగాడు రామకృష్ణ. ఛ పాపకు ఏమైనా కొని తీసుకు రావాల్సింది. అయినా తనకు తెలిస్తే కదా, పూలమ్మికి ఓ పాప ఉందని. తానెప్పుడూ అడగలేదు. పూలమ్మి చెప్పనూ లేదు.
‘అమ్మ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది అంకుల్’ అంటూ హాలు వైపు చూసింది.రామకృష్ణ లోపలికి అడుగుపెట్టాడు.అప్పుడే పూలమ్మి లైటు వేసింది. లైటు వెలుతురులో పూలమ్మిని అలానే చూస్తూ ఉండిపోయాడు. పూలమ్మి తన మెడలోని మంగళసూత్రం తీసి, ఎదురుగా ఉన్న దేవుని పటం ముందు పెట్టింది. మెట్టెలు తీసేసింది. నుదుట సిందూరం చెరిపేసింది. వెనుతిరిగింది.ఎదురుగా రామకృష్ణ .‘సర్ మీరా? ఇక్కడ.. నా కోసం?’‘నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చాను. సారీ పూలమ్మి’ తలొంచుకుని అన్నాడు రామకృష్ణ.చిన్నగా జీవంలేని నవ్వు నవ్వింది పూలమ్మి.‘మనల్ని సృష్టించిన ఆ దేవుడు మన అనుమతి లేకుండా, మన తలరాతలు తన ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. నా తలరాత చూడటానికి వచ్చారా?’ ఆమె కంట్లో సన్నటి కన్నీటిపొర.‘కాళ్లు చచ్చుబడి పోయిన నా కూతురు, వైధవ్యాన్ని శాపంగా భరిస్తున్న నేను– ఇదీ నా కుటుంబం, తాగుబోతు భర్త, తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకు కారణమై, తనూ చచ్చాడు.
ఆ పాపం, ఏ పాపం తెలియని నా బిడ్డను వెంటాడింది. నా బిడ్డ కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆపరేషన్ చేస్తే తిరిగి నా కూతురు మామూలుగా అవుతుందని చెప్పారు. నా బిడ్డ కాళ్ళు బాగుపడడం కోసం పూలమ్మిగా కొత్త పాత్రలోకి వచ్చాను. ఒకప్పుడు ఇష్టంగా వ్యాపకంగా పెంచుకున్న చెట్లు, నాకు జీవనాధారం అయ్యాయి. గుడిలో దేవుని పాదాల చెంతకు, బీచ్‌లో అమ్మాయిల జడల్లో కొలువుతీరే పువ్వులు అమ్మే ఈ పూలమ్మి, నుదుట కుంకుమ లేకుండా, వైధవ్యంతో పూలు అమ్మితే అపశకునం అనుకోవచ్చు. అందుకే సుమంగళిగా నటించాను. మోసం చేయడానికి కాదు. నా బిడ్డను బతికించుకోవడానికి నటించాను. ఇంతకు మించి నా కథలో ఏ మలుపులు లేవు’ కళ్ళు తుడుచుకుని చెప్పింది పూలమ్మి.
‘ఇప్పుడు ఆ నటనను నిజం చేయొచ్చుగా! నేను సూటిగా చెబుతున్నాను. నాకు పెళ్లి కాలేదు. నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. నిన్ను చూశాక, ఎందుకో ఒక అందమైన భావం, నీకు పెళ్లయిందని తెలిసినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నీ కథ తెలిశాక, జాలితో కాదు, మరింత ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ రామకృష్ణ మనసులో మాట చెప్పాడు.‘క్షమించండి. మీ మంచి మనసుకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఈ పొగచూరిన మనసును ఇవ్వలేను. నా బిడ్డ కాళ్లు బాగైతే, నా నటనకు స్వస్తి చెప్పి, మరో దారి చూసుకుంటాను. ఈ పూలమ్మిని మర్చిపోండి’ చెప్పింది.‘పోనీ కొన్నాళ్ళు నేను నీకు భర్తగా కాకుండా, నీ బిడ్డకు తండ్రిగా నటిస్తాను. మన బిడ్డకు, సారీ.. నీ కూతురికి కాళ్ళు వచ్చేవరకు.
నీకు భర్తగా జీవించే అవకాశం లేనప్పుడు, ఇలా నటించే అవకాశాన్ని కోరడం తప్పు కాదు కదా! ఊహ తెలియకముందే నాన్న విదేశాల్లో ఉన్నాడని నమ్మించి నటించావు. ఆ నాన్నను నేనే అని చెప్పు. ఆ సంతోషంతో త్వరగా నడుస్తుంది. కొన్నాళ్ళైనా నాకు ఇష్టమైన నిన్ను నా జీవితంలోకి నటిగా ఆహ్వానించే అవకాశం ఇవ్వు’ అన్నాడు రామకృష్ణ.అప్పటికే కూతురు వాకింగ్ స్టిక్ సహాయంతో అక్కడికి వచ్చి, ‘ఎవరమ్మా.. నాన్నా.. నాన్నొచ్చాడా? ఆ చిన్నారి కళ్ళలో వెలుగు.కూతురు కళ్ళలో వెలుగు చూసి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక పోయింది. అప్పటికే రామకృష్ణ ఆ పాపను దగ్గరకు తీసుకున్నాడు.‘భలే కనిపెట్టావ్.. ఎంతైనా నా కూతురువి కదా..’ అన్నాడు పూలమ్మి వైపు చూడకుండా.‘నేనంతే నాన్నా!’ అప్రయత్నంగా అంది. ఆ పిలుపుకు చిన్నప్పటి నుంచి దూరమైన ఆ పాప.‘మరి నీ బట్టలు తెచ్చుకోలేదు. నా కోసం ఏమీ తేలేదు. నువ్వు బోల్డు గిఫ్టులు తీసుకు వస్తావని చెప్పింది అమ్మ’ అంది అమాయకంగా.‘ఆఫీస్ పని మీద వచ్చాను. నీ కాళ్ళు బాగయ్యాక మిమ్మల్ని పెద్ద ఇంట్లోకి తీసుకు వెళతాను’ చెప్పాడు. ఆ పాప ఆ నటన నిజమేనని నమ్మి బయటకు వెళ్లి పూలతో మాట్లాడుతోంది.
‘మా నాన్నొచ్చాడ’ని చెబుతూ మురిసిపోతోంది.ఆలా అతని పాత్ర నటన మొదలైంది. కానీ అతను జీవిస్తున్నాడు.అతని దినచర్య మారిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాప కోసం బొమ్మలు తీసుకురావడం, పాపను బయటకు తీసుకు వెళ్లడం– అనివార్యంగా పూలమ్మి కూడా అతనితో పాటు వెళ్ళక తప్పడం లేదు.ఒకరోజు బీచ్‌కి వెళ్లారు. మొదటిసారి బీచ్‌కి వచ్చిన పాప అక్కడ ఉన్న పిల్లలను చూసి కేరింతలు కొట్టింది. ఇద్దరి చేతులు పట్టుకుని ఇద్దరి భుజాల మీద ఆడుకుంది. సినిమాకు తీసుకువెళ్లాడు. అమ్మ ఒడిలో కూర్చుంది. పూలమ్మి భుజం తాకుతుంటే, రామకృష్ణ మనసులో చిన్నపాటి ఉద్వేగం.పాపకు రామకృష్ణకు మధ్య బంధం పెరిగింది. అయినా తన పరిధిని మించి ఎప్పుడూ పూలమ్మి ఇంట్లోకి, ఆమె గదిలోకి అడుగు పెట్టలేదు. పాప ఎన్నోసార్లు ‘ఎందుకు నాన్న లోపలికి రావు’ అంటే ఏదో కారణం చెప్పేవాడు.
పూలమ్మి రామకృష్ణ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.తర్వాత వంట చేసి క్యారేజీ ఇవ్వడం మొదలైంది.ఆ తర్వాత అతనికి కోసం ఎదురు చూడటం అలవాటైంది. ఒకరోజు వర్షంలో తడిసి వస్తే (అ)ప్రయత్నంగా అతని తల తుడిచింది తన చీర కొంగుతో.
అతని బట్టలు ఉతికి ఆరేసింది. ఇస్త్రీ చేసింది.తాను పాప కోసం నటిస్తోందా? అతని మీద ప్రేమతో జీవిస్తోందా? అర్థం కాలేదు పూలమ్మికి.పాపకు ఆపరేషన్ అయ్యింది. కాళ్లు బాగుపడ్డాయి. లేచి నడుస్తోంది. పరుగెత్తుతోంది. ఆ రోజు పాప పుట్టినరోజు. పెద్ద కేక్ తెచ్చాడు. కొత్త బట్టలు తెచ్చాడు. పాపతో కేకు కట్ చేయించాడు. పెద్ద సందడి. అతని మనసులో చిన్న అలజడి.హడావుడి ముగిసింది. అర్ధరాత్రి కావస్తోంది. అప్పటి వరకు ఆడుకుని అలిసిపోయిన పాప నిద్రలోకి జారుకుంది. గడప లోపల పూలమ్మి. గడపకు ఇవతల రామకృష్ణ.
‘నేను వెళ్తున్నాను’ చెప్పాడు రామకృష్ణ.‘రేపు కొద్దిగా పెందరాళే రావొచ్చుగా! మీకు ఇష్టమైన మినప్పప్పు మిక్సీకి వేశాను. మినప వడలు, సాంబారు, మీకిష్టమైన పల్లీ చట్నీ’ అని, ‘పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా...’ ఆశగా అంది పూలమ్మి.‘వెళ్లిపోతానని అంటున్నది ఈ వూరి నుంచి. పాపకు కాళ్లు వచ్చాయి. నా జ్ఞాపకాలకు సరిపడా అనుభూతి దొరికింది. ఇంకా నటించి, ఒక నటుడిగా బతకలేక పోతున్నాను. ఎప్పుడైనా సినిమా పూర్తయితే, పాత్రను, పాత్ర నటనను వదిలి వెళ్ళిపోవలిసిందేగా! అందుకే, ఇప్పుడే ఇక సెలవని...’ రామకృష్ణ గొంతు గాద్గదికం అవుతోంది.‘పాపకు నాన్న ఆఫీస్ పనిమీద మళ్ళీ వెళ్లాడని చెప్పు. నువ్వు జాగ్రత్త పూలమ్మి’ వెనుదిరిగాడు. పూలమ్మి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి వెళ్లలేక.
పూలమ్మి అలాగే నిలబడి పోయింది.మొదటిసారి రామకృష్ణ తెచ్చిన చీర కట్టుకుంది.మొదటిసారి మనస్ఫూర్తిగా జడలో రామకృష్ణకు ఇష్టమైన పువ్వులు పెట్టుకుంది.మొదటిసారి నటించడం మాని జీవించింది.‘వెళ్ళండి ... ఎంతైనా మగ మహారాజులు కదా! కూతురి పుట్టినరోజు కూడా బలాదూర్ తిరగండి. ఇంట్లో భార్య ఉంది. అది తన కోసం ఎదురుచూస్తుంది అని ఆలోచించకుండా వెళ్ళండి’ పూలమ్మి ఉక్రోషంగా అంది. గొంతులో దుఃఖం తన్నుకు వస్తోంది.ఒక్కసారిగా గిరుక్కున వెనక్కి తిరిగాడు. గుమ్మం ముందు నిలబడి తాను తెచ్చిన చీర కట్టుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, తన పూలమ్మి, కళ్ళనుండి నీళ్లు ఒంపుకొని... మనసు నిండా ప్రేమ నింపుకొని... రెండు చేతులు చాచి, గుమ్మానికి అడ్డు తొలగి లోపలి గది లోపలికి, తన మనసు గదిలోకి ఆహ్వానిస్తూ...
నుదుట కుంకుమ చెదిరి, తలలో పూలు అలసి, ఒంటిమీద ఉన్న ఆచ్ఛాదనలు చెదిరి, దేహాలు ఒక్కటై, తెల్లవారు ఝామున వినిపించే కువకువల సుప్రభాతం వింటూ... ఒకరినొకరు చుట్టుకుని... నిన్నటి వరకు నటించిన పాత్రలకు జీవం పోసి, నటన వదిలి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.మరోసారి పూలమ్మిని చుట్టేస్తూ ‘అవును నీ పేరేమిటి పూలమ్మీ’ అడిగాడు.
‘మీరు ప్రేమతో పిలిచే పేరే. పూలమ్మి...’ అతని గుండెలో ఒదిగిపోతూ చెప్పింది పూలమ్మి.