ఇరవై ఒకటో శతాబ్దిలో నోబెల్ పురస్కారాలు అందుకున్న పాతికమంది రచయితల్లో ప్రథముడు సర్ విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్. ఇక ఈ వరసలో ఇరవైఆరో రచయిత పేరు ఈ అక్టోబర్లో వెల్లడవుతుంది– అందాకా వేచిచూద్దాం! 1932లో కరీబియన్ దేశం ట్రినిడాడ్లో పుట్టి– పదిహేడోయేట బ్రిటన్ కు మెట్టి– 2018లో కన్నుమూసిన నైపాల్‌ను వ్యక్తిగా గానీ, రచయితగా గానీ ఓ చట్రంలో బిగించడం దాదాపు అసాధ్యం!
ఐనా అలాంటి మెట్ట వడ్రంగానికి మనమెందుకు పూనుకోవాలి? నైపాల్‌ను మనవాళ్ళు ‘నోబెల్ పురస్కారం పొందిన రెండో భారతీయుడు’గా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. కానీ సర్ విదియా తనను తాను భారతీయ రచయితగా ఎన్నడూ చెప్పుకోనూలేదు– గర్వించింది అసలే లేదు! నైపాల్ తనను ట్రినిడాడియన్–బ్రిటిష్ రచయితననే భావించుకున్నాడు, అలాగే సంభావించుకున్నాడు! అందుకాయన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు!!
అంచేత, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారతీయుడు రబీంద్రనాథ్ టాగోర్. ‘గీతాంజలి’ కావ్యానికి ఆయనకా బహుమతి 1913లో దక్కింది. 88 యేళ్ళ తర్వాత నైపాల్ రాసిన ‘ద ఎనిగ్మా ఆఫ్ అరైవల్’ అనే ఆత్మకథాత్మక నవలకు సైతం నోబెల్ పురస్కారం దక్కింది. సదరు పురస్కారం అందుకుంటూ, నైపాల్ చేసిన ప్రసంగానికి ఆయన ఇచ్చిన శీర్షిక ‘రెండు ప్రపంచాలు.’ అవి ప్రాచ్య– పాశ్చాత్య ప్రపంచాలు కావు. అమెరికన్– బ్రిటిష్ ప్రపంచాలు మాత్రమే!
ట్రినిడాడ్ లోని ‘హిందువుల’ జీవన సరళి నైపాల్‌కు కొట్టిన పిండి. అందుకే ఆయన ‘కాల్పనిక’ సాహిత్యంలో ప్రముఖంగా ప్రతిఫలించేది అదే. ఐతే, 1961లో అచ్చయిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’తోనే నైపాల్‌కు నవలా రచయితగా చెప్పుకోదగిన గుర్తింపు దక్కింది. 1998 నాటి మోడర్న్ లైబ్రరీ ‘20వ శతాబ్దిలో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో ఈ నవలకు 72వ స్థానం దక్కింది. టైమ్ మ్యాగజీన్ రూపొందించిన ‘1928–2005 మధ్యకాలంలో ఇంగ్లిష్‌లో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో కూడా ఈ నవలకు చోటు దక్కింది. 1971లో ఆంద్రె డాయిష్చ్ ప్రచురణ సంస్థ వెలువరించిన ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ అనే నవల అదే యేడాది బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. నిజానికిది మూడు గొలుసు కథల సంకలనం.
ఈ శిల్పం మరీ అపూర్వమేమీ కాదు– బృహత్కథ, పంచతంత్రం, వెయ్యిన్నొక్క రాత్రులు, క్యాంటర్‌బరీ టేల్స్ నుంచి మన కాశీ మజిలీ కథల వరకూ అన్నీ ఇలాంటి గొలుసుకట్టు చట్రంలో బిగించిన కథలే! 1983లో నైపాల్‌కు ‘జెరూసలేం పురస్కారం’, 1990లో ట్రినిడాడ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ట్రినిటీ క్రాస్’ బహుమతి దక్కాయి. అదే సంవత్సరం బ్రిటిష్ రాజరికం ఈ ట్రినిడాడియన్– బ్రిటిష్ రచయితకు నైట్‌హుడ్ ప్రసాదించింది. ఈ బహుమతులన్నిటికీ తలమానికంగా, సర్ విదియాకు 2001లో నోబెల్ సాహిత్య పురస్కారమూ దక్కింది! అది కూడా ఓ నవలకే దక్కడం గమనార్హం. అర్ధశతాబ్దికి పైగా విస్తరించి వున్న తన సాహిత్య జీవితంలో నైపాల్ 11 నవలలు ఎందుకు రాశాడో ఈ నేపథ్యం వివరిస్తోంది!
కాలుగాలిన పిల్లిలా ప్రపంచమంతా కలతిరిగిన నైపాల్ తొమ్మిది పది యాత్రా చరిత్రలు రాసివుండడంలో వింతేముంది? తన– తన కుటుంబ సభ్యుల పౌరసత్వ–వారసత్వాల గురించి ఆలోచించడానికే జీవితమంతా ఖర్చు పెట్టిన నైపాల్ తన పూర్వికుల పురిటిగడ్డ భారతదేశం గురించి మూడు పుస్తకాలు రాశాడు. ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్‌నెస్’, ‘ఇండియా–ఎ వూండెడ్ సివిలిజేషన్’, ‘ఇండియా– ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’ అనే ఈ పుస్తకాలు మూడూ నైపాల్ యాత్రా చరిత్రల్లో ముఖ్యమైనవి. వాటిని రాజకీయ– చారిత్రక యాత్రా చరిత్రలనవచ్చు. వాటిల్లో ఏ కోశాన్నా భారతదేశమన్నా, దాని చరిత్రన్నా ప్రేమాదరాలు వ్యక్తమైనట్టు నాకెక్కడా కనిపించలేదు!
అయితే, ఈ వరసలోని మూడో పుస్తకంలో భారతదేశంలోని పీడిత తాడిత వర్గాల పట్ల ఒకింత సహానుభూతి వ్యక్తమైందని ‘నైపాల్ నిపుణులు’ కొందరు అంటారు.
నైపాల్ పూర్వికులు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్‌గా పిల్చుకునే ప్రాంతంలో తూర్పు భాగానికి చెందినవాళ్ళు. ఒకప్పుడు దాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. అలా, అది అప్పుడూ యూపీయే, ఇప్పుడూ యూపీయే! ఆనాటి మరో బ్రిటిష్ వలస ట్రినిడాడ్–టొబాగోకు నైపాల్ పూర్వికులు వలస వెళ్ళారు. 1837–’38లో, యూపీ డెల్టా అనే ‘గంగా జమునా దోఅబ్’ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది. దాని ధాటికి తట్టుకోలేక విదేశాలు పట్టిపోయిన వాళ్ళలో నైపాల్ పితామహుడు పండిత దూబే, మాతామహుడు పండిత కపిల్ దేవ్ కూడా వున్నారు.
ఈ పండితులు ఇద్దరూ, గత్యంతరం లేక, ఇండెంచర్డ్ లేబర్ (ఇప్పటి వాడుక ప్రకారం కాంట్రాక్టు కూలీలు అనాలేమో!)గా మారవలసివచ్చింది. ట్రినిడాడ్ చెరుకు తోటల్లో కూలిపని చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకున్నారు; వృత్తివ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుకున్నారు. నైపాల్ పితామహుడి పేరు కూడా నాకెక్కడా తగల్లేదు కానీ, అతగాడు తన కుమారుడు ‘శీకుమార్ నైపాల్’ను ఇంగ్లిష్ జర్నలిస్టుగానూ, రచయితగానూ స్థిరపడే రీతిలో పెంచుకోగలిగాడు. ఇంగ్లిష్ సాహిత్యమన్నా, రచయితలన్నా అభిమానించే శీకుమార్ పెంపకంలో విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్ నోబెల్ లారియెట్ కావడంలో విడ్డూరమేముంది? ∙ _ - మందలపర్తి కిషోర్


