ఒక హత్య.. ముగ్గురు హంతకులు | Funday Crime Stroy | Sakshi
Sakshi News home page

ఒక హత్య.. ముగ్గురు హంతకులు

Apr 5 2026 10:48 AM | Updated on Apr 5 2026 10:48 AM

Funday Crime Stroy

సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్‌ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు.  గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్‌ కూడా వచ్చాడు. క్లూస్‌ టీమ్‌ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ వైపు చూసి అన్నాడు కమిషనర్‌... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్‌ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్‌ భారీ అప్పుల్లో వున్నాడు.

సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్‌ పార్టనర్‌ వినాయక్‌...  ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ క్రైమ్‌ స్పాట్‌ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్‌ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్‌లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్‌ ... వేడివేడిగా ఫిల్టర్‌ కాఫీ తాగితే ఈ కూల్‌లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్‌ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. 

ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ ఇన్వెస్టిగేషన్‌ స్టైల్‌ తెలిసిన కమిషనర్‌ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్‌ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్‌ థాట్‌ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్‌! మా మామయ్య చనిపోతే నాకేంటి  లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు.  అజయ్‌ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్‌ ఇచ్చినందుకు లైఫ్‌లో నుంచే మీ బాస్‌ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌.‘‘సర్‌! నేను ఒక మాములు ఉద్యోగిని. 

నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్‌ ఆన్సర్‌... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్‌ చేయడానికి వెళ్లి రిమోట్‌ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్‌ పార్టనర్‌ను పిలిపించాడు.‘‘మిస్టర్‌ వినాయక్‌! మీ లాయర్‌కు ఫోన్‌ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్‌.‘‘మీ బిజినెస్‌ పార్టనర్‌ను హత్య చేసినందుకు’’ అన్నాడు.

‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్‌ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్‌ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్‌... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్‌ను అడిగాడు.కమిషనర్‌ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్‌ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్‌ ఏసీకి మోషన్‌ సెన్సార్‌ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్‌ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్‌ అప్పులను తీరుస్తానని ప్రామిస్‌ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.

స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్‌ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్‌ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్‌ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్‌ ఏసీకి మోషన్‌ సెన్సర్‌ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్‌ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్‌ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్‌ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్‌ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్‌ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్‌! కేవలం గంట వ్యవధిలోనే  కేసును మైండ్‌ గేమ్‌తో సాల్వ్‌ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్‌.


 

Advertisement
 
Advertisement
Advertisement