‘‘నన్నెవరో చంపడానికి వెంట పడుతున్నారు’’ అంటూ దివాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. స్టేషన్‌లో వణుకుతూ కూర్చున్న దివాకర్‌ను చూసి ఇన్‌స్పెక్టర్ సూర్యకు మొదట జాలి కలిగింది. తాగడానికి నీళ్లు ఇచ్చి, ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు’’ అన్నాడు.‘‘ఈ మధ్య నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి... సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూడా ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు’’ భయం భయంగా చెప్పాడు దివాకర్. వెంటనే ఇన్‌స్పెక్టర్ సూర్య – దివాకర్ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. అందులో దివాకర్ ఒక్కడే పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. అంత రాత్రివేళ ఒక్కడినే ఇంటికి బలవంతంగా పంపడం సేఫ్ కాదని ఇన్‌స్పెక్టర్ సూర్య స్వయంగా అతడిని ఇంటి దగ్గర దింపాడు. దివాకర్ భార్య అప్పటికే భర్త కోసం ఎదురు చూస్తోంది.
ఇన్‌స్పెక్టర్ విషయం చెప్పాడు. దివాకర్ భార్య రవళి మౌనంగా లోపలికి వెళ్లి, కొన్ని కాగితాలు తెచ్చి ఇన్‌స్పెక్టర్‌కు ఇచ్చింది. అవి డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్...దివాకర్‌కి ‘పారనాయిడ్ స్కిజోఫ్రీనియా’ అనే సైకలాజికల్ డిజార్డర్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అవి.ఇన్‌స్పెక్టర్ సూర్య– దివాకర్ వైపు జాలిగా చూసి ఒక నిట్టూర్పు విడిచి బయటకు వచ్చాడు.ఇన్‌స్పెక్టర్ బయటకు వస్తుంటే, దివాకర్ తనని కాపాడమని తనను ఎవరో చంపేస్తారని అరవడం గుర్తొచ్చింది. జీపులో స్టేషన్‌కు బయల్దేరిన సూర్య రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. అది దివాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే రోడ్డు. కుడి వైపు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రోడ్డు వస్తుంది. సూర్యకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది.
ఆ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు బిగించి ఉన్నాయి. వెంటనే దివాకర్ ఇంటికి వెళ్లే రోడ్డుకు ఉన్న సీసీ ఫుటేజ్ చూశాడు. అందులో దివాకర్‌ను ఒక వ్యక్తి బైక్ మీద వెంబడిస్తున్నాడు. అప్పుడు దివాకర్ వెనక్కి వచ్చి పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తాడు.అతడిని బైక్ మీద వెంబడించిన వ్యక్తి అక్కడే ఆగిపోయాడు. అందుకే ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్‌కు వచ్చే రూట్‌లో సీసీ ఫుటేజ్‌లో అతను కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకు– తను దివాకర్‌ను ఇంటి దగ్గర దింపినప్పుడు దివాకర్ ఇంటికి దూరంలో ఉన్న బైక్... దివాకర్‌ను వెంబడించిన అదే బైక్...వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీపు వెనక్కి తిప్పాడు. దివాకర్ ఇంటి వైపు...
దివాకర్ అపరిచిత వ్యక్తి వైపు భయంగా చూస్తున్నాడు. ముఖానికి మాస్క్ వుంది. అతని చేతిలో చీర వుంది. ఈ చీరతో ఉరేసుకో... నిన్ను నేను చంపను... నువ్వే హాయిగా చచ్చిపోవచ్చు...దివాకర్ పారిపోవాలని చూస్తున్నాడు. ఎదురుగా ఉన్నది ప్రాణంగా ప్రేమించిన భార్య రవళి.‘‘చచ్చిపో దివాకర్... నిన్ను చంపి నేను జైలుకు వెళ్లడానికా ఇంత ప్లాన్ చేసింది. నువ్వు చచ్చిపోతే, పారనాయిడ్ స్కిజోఫ్రీనియాతో చచ్చిపోయావని నమ్మించొచ్చు. దానికి ఇన్‌స్పెక్టర్ కూడా సాక్ష్యం. రవళి నవ్వుతోంది వికృతంగా... అదంతా చూస్తున్న ఇన్‌స్పెక్టర్ సూర్య లోపలికి అడుగు పెట్టాడు.‘‘ఇప్పుడు సాక్ష్యంతోనే వచ్చాను మిసెస్ రవళి.
నీ భర్తకు ఉన్న పారనాయిడ్ స్కిజోఫ్రీనియాను అడ్డం పెట్టుకుని నీ ప్రియుడితో నాటకం ఆడి నువ్వు చేసిన ప్లాన్ ఇప్పుడు నీకే బెడిసికొట్టింది. నీ భర్తను పోలీస్ స్టేషన్‌కు వెళ్లేలా భయపెట్టి సాక్ష్యాన్ని సృష్టించుకోవాలనుకున్నావు. కాని, ఇలా చట్టం చేతికి చిక్కావు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం భర్తను వదిలించుకోవాలని వేసే ఇలాంటి క్రిమినల్ ప్లాన్స్ ఎప్పటికైనా పోలీసుల చేతికి చిక్కాల్సిందే!’’ అని రవళిని చూసి చెప్పాడు. ‘‘ఒక సీసీ ఫుటేజ్ నీ ప్రాణాన్ని కాపాడింది. నీ భార్య ప్రియుడితో కలిసి ఆడిన నాటకానికి చెక్ పెట్టింది’’ దివాకర్‌కు ధైర్యం చెబుతూ అన్నాడు. రవళిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
∙


