
నవజాత శిశువుల నుంచి.. 14 ఏళ్ల పిల్లల వరకు
యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహణ
వీక్లీ క్యాంప్‌లో భాగంగా 25 మందికి ఉచిత శస్త్రచికిత్సలు
14 నుంచి 20 వరకు కొనసాగనున్న శిబిరం
హైదరాబాద్: కొందరు చిన్నారులు పిల్లలు పుట్టుకతోనే వ్యాధులతో బాధపడుతుంటారు. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగలుగుతారు. కానీ పేద , మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నది. అప్పుడే పుట్టిన శిశువుల మొదలు 14 ఏళ్ల చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకు గాను బ్రిటన్ వైద్యులు నిమ్స్‌కు రానున్నారు.
ప్రముఖ వైద్యులు, తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలోని ఈ బృందం ఏటా సెప్టెంబర్‌లో వారం రోజుల పాటు ఉచిత గుండె ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహిస్తుంది. కార్డియోథొరాసిక్ వైద్యుల సమన్వయంతో నిర్వహించే శిబిరాన్ని ఈ నెల 14 నుంచి 20 వరకు నిమ్స్‌లో నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప (Bheerappa Nagari) తెలిపారు. కొన్ని క్లిష్టమైన సర్జరీలను సైతం యూకే డాక్టర్ల చేత నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ఉచితంగా 2డి ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు చేస్తున్నట్లు తెలిపారు.
నిమ్స్ పీడియాట్రిక్ విభాగంలో నెలకు 25 సర్జరీలు
పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ (Paediatric Cardiac ICU) ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేశామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. రెండేళ్ల నుంచి నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా ప్రస్తుతం నెలకు 35 సర్జరీలు చేస్తున్నామన్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి, ఏడాదికి, రెండేళ్లు, ఐదేళ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు కూడా ఉంటాయన్నారు. ఆ సమయంలోగా చేయకపోతే ఆ సమస్యలు ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. నిమ్స్‌కు వచ్చే కేసులు ఎక్కువగా క్రిటికల్‌లో ఉన్నవే వస్తుంటాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె మార్పిడి చికిత్సల నుంచి రోబోటిక్ చికిత్సలను చేస్తున్నామన్నారు.
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి..
నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప
గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారుల తల్లిదండ్రులు 040– 23489025లో సంప్రదింవచ్చని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అరమేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల్‌లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని, పూర్వపు రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచించారు.
చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!
రికార్డు అందుబాటులో లేకుంటే.. ఆస్పత్రిలోనే అవసరమైన స్కీన్రింగ్ నిర్వహిస్తామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 25 మంది చిన్నారులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేసినా.. ఆ తర్వాత కూడా దశల వారీగా నిమ్స్ వైద్యులు ఆపరేషన్లు కొనసాగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 350 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.