
వైరల్
అనుబంధాలు, ఆప్యాయతలకు భాష, సరిహద్దులతో పనిలేదు అని చెప్పడానికి ఈ వైరల్ వీడియో నిదర్శనం. విదేశీ పర్యాటకురాలిగా బెంగళూరుకు వచ్చిన అరీనా అక్కడే పదిహేను రోజులు ఉన్నది. ఆ రోజులు తనని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి.
పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు రద్దీతో నిండిన మార్కెట్లు, పండగ ఉత్సవాలు, జాతరలు, కష్టజీవుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. ఈ క్రమంలో తనకు ఎంతోమంది పరిచయం అయ్యారు.
‘బెంగళూరులో పదిహేను రోజులు ఉన్న నేను ఈ దేశంతో పూర్తిగా ప్రేమలో పడిపోయాను. ఇండియా అనేది ఆధ్యాత్మిక శక్తితో కూడిన అద్భుతం దేశం’ అని తన పోస్ట్‌లో రాసింది అరీనా.
బెంగళూరులోని వైవిధ్య భరిత సాంస్కృతిక సౌరభాన్ని ప్రశంసించింది. ‘బెంగళూరు వీధుల్లో అలా నడుచుకుంటూ పోతే చాలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రతి మూల ఏదో ఒక ప్రత్యేకత కళ్లకు కడుతుంది’ అంటున్న అరీనా బెంగళూరులో ఉన్నన్ని రోజులు సంప్రదాయ దుస్తులే ధరించింది. మతసంబంధమైన కార్యక్రమాలు, ప్రార్థనలలో పాల్గొనేది. ‘ఈ దేశాన్ని విడిచి వెళ్లాలంటే మనసుకు చాలా కష్టంగా ఉంది’ అని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది ఆరీనా.