Fashion Blouse Trend: డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!  రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి!

Fashion Boutique: New Trend From Maggam Work To Computer Work Blouse - Sakshi

నగరంలో నయా ట్రెండ్‌

కంప్యూటరైజ్డ్‌ బొటిక్‌ల హవా

గంటల వ్యవధిలోనే ఎంబ్రాయిడరీ డిజైన్‌ పూర్తి

ఆసక్తి చూపుతున్న మహిళలు

విద్యానగర్‌/కరీంనగర్‌: బొటిక్‌ రంగం పెరిగిన ఆధునికతతో మగ్గం వర్క్‌ నుంచి కంప్యూటరైజ్డ్‌ రంగంలోకి అడుగిడింది. మనకు నచ్చిన డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్‌లను కుట్టించుకునే అవకాశం కంప్యూటరైజ్డ్‌ బొటిక్‌ ద్వారా మహిళలకు లభించింది. ఫ్యాషన్‌ డిజైనర్లు మహిళల కలలకు రూపమిస్తూ బొటిక్‌ ప్రపంచాన్ని కలర్‌ఫుల్‌గా మారుస్తున్నారు.

అతివల మనసు దోచే బొటిక్‌లెన్నో రోజురోజుకూ కరీంనగర్‌లో వెలుస్తూ ఫ్యాషన్‌మయంగా మార్చేస్తున్నాయి. వైవిధ్యాన్ని కోరుకునేవారికి సృజనాత్మకతను జత చేస్తూ కంప్యూటర్‌ ద్వారా కొత్త ఫ్యాషన్లు రూపొందిస్తున్నారు. 

డిజైన్‌ బట్టి ధరలు
కరీంనగర్‌లో ప్రస్తుతం కంప్యూటర్‌ బొటిక్‌ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ధరించడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. వారు ఎంచుకున్న డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌పై డిజైన్‌ వేయడానికి రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ  తీసుకుంటున్నారు.

రోజూ మూడు బ్లౌజ్‌లు..
బొటిక్‌ కంప్యూటర్‌ మిషన్స్‌ రాక ముందు మగ్గం వర్క్‌ చేసేవారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన బొటిక్‌ కళాకారులు ఒక్క బ్లౌజ్‌పై మగ్గం వర్క్‌ చేస్తే వారం పదిరోజులు పట్టేది. ప్రస్తుతం రోజుకు మూడు బ్లౌజ్‌లకు బొటిక్‌ వర్క్‌ చేస్తున్నాను. – కొప్పుల వేణుకుమార్, నవ్యశ్రీ కంప్యూటర్‌ బొటిక్‌ వర్క్స్, జ్యోతినగర్, కరీంనగర్‌

ఫ్యాషన్‌ డిజైనింగ్‌కు ఆదరణ..
ఫ్యాషన్‌ డిజైనింగ్‌కు ఆదరణ పెరిగింది. కరీంనగర్‌లోని విద్యానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర టెంపుల్‌ వద్ద 2సంవత్సరాల క్రితమే వసుంధర పేరుతో కంప్యూటరైజ్డ్‌ బొటిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాను. యువతుల నుంచి పెద్దవారి వరకు బొటిక్‌ వర్క్‌ బ్లౌజ్‌లు ధరిస్తున్నారు. కొరియర్‌ సర్వీస్‌ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా వర్క్‌ ఆర్డర్స్‌ వస్తాయి.      – శ్వేతారఘురాం, కంప్యూటరైజ్‌ బొటిక్‌ వర్క్స్, విద్యానగర్, కరీంనగర్‌

అభిరుచికి తగ్గట్లు..
బొటిక్‌ డిజైనింగ్‌లో కంప్యూటర్లు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పుడు మరింత ఆధునిక కంప్యూటరైజ్‌డ్‌ బొటిక్‌ మిషన్స్‌ వచ్చాయి. కొరుకున్న డిజైన్‌ను 1గంట నుంచి 8గంటలలోపు సమయం పడుతుంది.   – నవ్యశ్రీ, కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ వర్క్స్, జ్యోతినగర్, కరీంనగర్‌

కోరుకున్న డిజైన్లు..
ఎప్పటికీ ఉండే పెళ్లిళ్లు, పేరంటాలకు తోడు ఇప్పుడు స్పెషల్‌ పార్టీలు కూడా వచ్చి చేరాయి. ఇలాంటి పార్టీల్లో హుందాతనం, హోదా, ప్రత్యేకత ఉట్టిపడేలా డ్రెస్సింగ్‌ ఉండాలని మహిళలు కోరుకుంటారు. కోరుకున్న డిజైన్‌ను గంట నుంచి 8 గంటలలోపు తయారు చేసి ఇస్తున్నారు.

ఇద్దరం కలసి ఏర్పాటు చేశాం 
మేమిద్దరం స్నేహితులం. ఇద్దరం కలిసి లేడీస్‌ టైలరింగ్‌ షాపు నిర్వహించే వాళ్లం. క్రమేణా మంచి ఆదరణ లభించింది. మా కస్టమర్లు చాలా మంది బొటిక్‌ డిజైనింగ్‌ వేరే వారి వద్ద చేయించేవారు. వారందరి ప్రోత్సాహంతో ఎంబ్రాయిడరీ బొటిక్‌ కంప్యూటరైజ్డ్‌ మిషన్‌ గత నెలలో తీసుకొచ్చి వర్క్‌ చేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.1000 వరకు వస్తున్నాయి.  – భారతి, శ్వేత, షణ్ముఖి డిజైనర్స్, జ్యోతినగర్, కరీంనగర్‌

ఒక్కరోజులో కోరుకున్న డిజైన్‌లో బ్లౌజ్‌..
ఇది వరకు బ్లౌజ్‌పై మగ్గం వర్క్‌ చేయించుకోవాలటే రెండు, మూడు నెలల సమయం పట్టేది. పండుగకు రెండు నెలల ముందే చీర కొనుక్కొని మ్యాచింగ్‌ బ్లౌజ్‌పై మగ్గం వర్క్‌కోసం ఇచ్చేదాన్ని, ఇప్పుడు సీజన్‌ వర్క్‌ను బట్టి వారం ముందు ఇస్తే చాలు బొటిక్‌ బ్లౌజ్‌ తయారు అవుతుంది.
– తూమ్‌ అరుణ, గృహిణి, సుభాష్‌నగర్, కరీంనగర్‌

గ్రాండ్‌ లుక్‌ ఉండాలి
ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీర తీసుకున్న తర్వాత మంచి డిజైన్‌తో బొటిక్‌ వర్క్‌ బ్లౌజ్‌ ఉండాలి. అప్పుడే చీరకు మరింత గ్రాండ్‌ లుక్‌ వస్తుంది. తద్వారా మనకూ వస్తుంది. చీర బాగుండి బ్లౌజ్‌ బాగాలేకుంటే చీరకు ఉన్న అందం పోతుంది.   
– సింగిరికొండ మాధవి, గృహిణి, తిరుమల నగర్, కరీంనగర్‌ 

చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖ‌ర్జూరాలు త‌ర‌చుగా తింటున్నారా? ఈ విష‌యాలు తెలిస్తే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top