Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు

Fans Remember Milkha Singh Love Story After His Death - Sakshi

‘నాకొచ్చిన అన్ని ట్రోఫీల కన్నా గొప్ప ట్రోఫీ నా భార్య’ అని అనేవారు మిల్ఖా సింగ్‌. మిల్ఖా సింగ్, ఆయన భార్య నిర్మల్‌ కౌర్‌ 59 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. తమ ప్రేమ కథను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఆ రోజుల్లోనే కొంత సాహసం చేశారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఎంతగా ఉండలేకపోయారంటే 5 రోజుల తేడాలో ఇద్దరూ మరణించారు. జూన్‌ 13న నిర్మల్‌. జూన్‌ 18న మిల్ఖా. మిల్ఖా సింగ్‌ మరణించాక అభిమానులు ఆయన ప్రేమ కథను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ జూన్‌ నెలలో భార్య నిర్మల్‌ కౌర్‌ కరోనాతో మరణించిన ఐదు రోజులకు మిల్ఖా సింగ్‌ కూడా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. బహుశా ఈ లోకం ఆయనకు నిరర్థకం అనిపించి ఉండవచ్చు ఆమె లేకుండా. తన భార్య నిర్మల్‌ను ఎవరికి పరిచయం చేసినా మిల్ఖా ‘నా గుండె చప్పుడు’ అని అనేవారు. ఆమె లేనప్పుడు ఆయన గుండె చప్పుడు ఆగిపోవడం ఆయన దృష్టిలో సహజమే కావచ్చు. భారతదేశానికి తన పరుగు తో విశేషమైన పేరు తెచ్చిన మిల్ఖా సింగ్‌ తన ప్రేమ కోసం కూడా బాగానే పరుగు తీశారు. 1960 లో మొదలైన ప్రేమ కథ 1962లో పెళ్లితో సుఖాంతమైంది.

అతను స్టార్‌ ఆమె టీచర్‌
మిల్ఖాసింగ్, నిర్మల్‌ కౌర్‌ల పరిచయం 1958లో కొలంబోలో జరిగింది. ఆమె వాలీబాల్‌ ప్లేయర్‌. ఇతను అథ్లెట్‌. ‘అప్పుడు ఆమెతో కబుర్లు చెప్పాను. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనొచ్చు’ అంటారు మిల్ఖా. ఆ తర్వాత రెండేళ్లపాటు వాళ్లు కలవలేదు. ఢిల్లీలో 1960లో అక్కడి స్టేడియంలో ప్రాక్టీస్‌కు వెళ్లేవారు మిల్ఖా. అక్కడే స్కూల్‌ పిల్లలను ప్రాక్టీసు చేయిస్తూ నిర్మల్‌ వచ్చేవారు. ‘అక్కడ ఆమెను చూసి చాలా సంతోషించాను. రెండేళ్ల క్రితం చూసిన నిర్మల్‌కు ఇప్పటి నిర్మల్‌కు ఎంత తేడా. ఆమె ఇప్పుడు ఇంకా నిండుగా తయారైంది’ అని తన ఆత్మకథలో రాశారు మిల్ఖా. అయితే ఆయన బిడియపడుతూ ఉంటే ఆమే అతణ్ణి బలవంతం గా కాఫీకి పిలిచింది. ఆ తర్వాత వారు కలుసుకోవడం కొనసాగింది. ‘ఒకసారి నేను ఆమె కారులో వస్తూ ఉన్నాం. నేను డ్రైవింగ్‌ చేస్తూ ఉన్నాను. ఆమెతో మాట్లాడుతూ కొంచెం పరధ్యానంగా ఉండటంతో కారు కంట్రోల్‌ తప్పింది. రోడ్డు మీద వెళుతున్న కొంతమందికి డాష్‌ ఇచ్చాను. ఒకామె గాయపడింది. అది పెద్ద గొడవ అయ్యింది ఆమె ఖర్చులన్నీ భరించి కొంత డబ్బు నేను ఇచ్చినా...’ అని రాశారు మిల్ఖా. వీరిద్దరూ కలిసి తిరగడం పత్రికలకు ఎక్కింది. కాని ఇరువురూ భయపడలేదు.


మిల్ఖాసింగ్, నిర్మల్‌ కౌర్‌ల పెళ్లినాటి ఫొటో 

చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి
ఆ సమయంలోనే మిల్ఖా మిలటరీ ఉద్యోగానికి రిజైన్‌ చేసి చండీగఢ్‌లో పంజాబ్‌ స్పోర్ట్స్‌ అకాడెమీకి ఉద్యోగిగా వెళ్లారు. కాని ఢిల్లీలో టీచరుగా పని చేస్తున్న నిర్మల్‌ ఆయనకు బాగా గుర్తుకొచ్చేది. ప్రతి వీకెండ్‌ కారు డ్రైవ్‌ చేసుకుంటూ ఢిల్లీకి వచ్చి ఆమెను కలిసేవారు.  కొన్ని నెలలకే నిర్మల్‌ కూడా చండీగఢ్‌కు షిఫ్ట్‌ అయ్యారు. ఆమె కూడా పంజాబ్‌ స్పోర్ట్స్‌ అకాడెమీ ఉద్యోగి అయ్యారు. దాంతో వీరి ప్రేమ కథ ఇరు ఇళ్లల్లో తెలిసిపోయింది. మిల్ఖా సిఖ్‌. నిర్మల్‌ హిందూ. నిర్మల్‌ ఇంట్లో ఈ పెళ్లి మొదట ఇష్టం కాలేదు. నాటి పంజాబ్‌ సి.ఎం ప్రతాప్‌ సింగ్‌కు నిర్మల్‌ తల్లిదండ్రులు ఈ ఉదంతం పై లేఖలు రాసేవారు. దాంతో ఆయన మిల్ఖాను పిలిచి ఒకరోజు బాగా ఫైర్‌ అయ్యారు. ఆ తర్వాత మిల్ఖా ఆయనకు తమ ప్రేమ గురించి పూర్తిగా వివరించి చెప్పడంతో ఏకంగా సి.ఎం. రంగంలో దిగి ఇరు కుటుంబాల వారికి చెప్పి పెళ్లి జరిపించారు. 1962లో వీరి పెళ్లయ్యింది. మిల్ఖాకు, నిర్మల్‌కు ఎడం 9 ఏళ్లు.


కొడుకు, కోడలు, మనవడితో మిల్ఖా దంపతులు 

ఆమె నా సర్వస్వం
పెళ్లయ్యాక మిల్ఖా తన భార్యే తన సర్వస్వం గా భావించేవారు. ‘ఎప్పుడు మేము కారులో బయటకు వెళ్లినా ఆయనే డోర్‌ తెరిచి నిలుచునేవారు’ అంటారు నిర్మల్‌. ‘నేను మెట్రిక్యులేషన్‌ దాటలేదు. కాని నా నలుగురు పిల్లలు బాగా చదువుకున్నారు. అందుకు కారణం నిర్మల్‌’ అంటారు మిల్ఖా. వీరు ఒక పిల్లాడిని కూడా దత్తత తీసుకున్నారు. అతను మిలట్రీలో పని చేస్తూ 1999లో టైగర్‌ హిల్‌ బ్యాటిల్‌లో మరణించాడు. వీరి ఒక కుమార్తె న్యూయార్క్‌లో డాక్టర్‌ అయితే కుమారుడు జీవ్‌ మిల్ఖా ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌.

దేశ విభజన సమయంలో దాదాపు అనాథలా పాకిస్తాన్‌ నుంచి భారతదేశం వచ్చి స్వశక్తితో పెరిగి సైన్యంలో చేరి అక్కడే పరుగు నేర్చి భారతదేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే క్రీడాకారుడైన మిల్ఖా ఆ పరుగుతో వచ్చిన జీవితాన్ని సఫలం చేసుకోవడంలో భార్య నిర్మల్‌ను భాగస్వామిగా చేసుకున్నాడు. ప్రేమ మొదలయ్యే ముందు అప్పటికే కీర్తి గడించిన మిల్ఖా సింగ్‌ను చూసి ‘నువ్వు స్థిరం ఎరగని తుమ్మెదవు. నేను ఒంటరి చెట్టును. ఈ చెట్టు గురించి నీకు గుర్తుంటుందా’ అన్నదట నిర్మల్‌. ఆ తుమ్మెద ఆ తర్వాత ఆ చెట్టునే అంటిపెట్టుకుని ఉండిపోవడమే ఈ ప్రేమలోని అందం. సుగంధం.
– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top