
‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అని చెక్ బయో ఆర్గానిక్స్ కో–ఫౌండర్ కీర్తి అంటున్నారు. ఇటీవల నగరంలోని నోవోటెల్ హోటల్ వేదికగా స్త్రీ శక్తి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్, బ్యూటీ, టూరిజమ్, వైద్యం, ఎంటర్‌ప్రెన్యూర్ వంటి వివిధ విభాగాల్లో 30 మంది మహిళలు పురస్కారాలను అందుకున్నారు.
వారిలో చెకోటి కీర్తి రెడ్డి ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ వైవిధ్యమైనది. ఆమె ఏనాడూ ఒక పారిశ్రామికవేత్త కావాలని కల కనలేదు. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి, హైదరాబాద్‌కి కంప్యూటర్ పరిచయమైన తొలినాళ్లలో కోచింగ్ సెంటర్ నిర్వహించారు. కానీ జీవితం ఆమెను వ్యవసాయం, పరిశ్రమల రంగం వైపు నడిపించింది. పరిశ్రమను నడిపించడంలో ఆమె పాటించిన నియమాలే ఆమెను తన రంగంలో వన్ అండ్ ఓన్లీగా నిలిపాయి.
‘రైతు నేస్తం, ఏరువాక, నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ పురస్కారాలు ఆమెకు గతంలో గుర్తింపునిచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ వేదికగా ప్రకటించిన ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ కీర్తి ప్రస్తుతం స్త్రీ శక్తి పురస్కారం అందుకుని మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారు.
పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు..
‘తొగర చెట్టు.. ప్రకృతి మనదేశానికి అందించిన వరం. సంజీవని వంటి తొగర పండు మీద పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఆ చల్లటి వాతావరణంలో ఈ చెట్లు మనలేవు. మా కుటుంబ సభ్యులకు నోని ఫ్రూట్ ఔషధంగా పని చేయడంతో నేను ఆ పండు మీద అధ్యయనం మొదలుపెట్టాను. దీని కోసం పొలం కొని పంట వేశాను. పండ్లతో జ్యూస్‌లు, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి.
కేవలం పరిశ్రమ నిర్వహణ మాత్రమే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం కలగలిసి ఉండడంతో నాకు ‘ఫార్మర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ వెల్‌నెస్ ప్రోడక్ట్స్’ విభాగంలో ఈ పురస్కారం లభించింది. నోని పండు మీద చేసిన పరిశోధనల కారణంగా ‘నోని కీర్తి’ నయ్యాను. ఈ స్త్రీ శక్తి పురస్కారం ఎంపిక ప్రక్రియలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు పాతిక మంది పాల్గొన్నారు.
జ్యూరీ సభ్యులు పురస్కార గ్రహీతలను జూమ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు’ అని వివరించారు కీర్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు స్త్రీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ సంప్రదాయ గోంద్‌లడ్డు, నారాయణపేట చీరలు, టెర్రకోట బొమ్మలు వంటి హస్తకళాకృతులను తయారు చేస్తున్న ఐదుగురు గ్రామీణ, ఆదివాసీ మహిళలు స్త్రీ రత్న పురస్కారాలను అందుకున్నారు.
(చదవండి: అందాల తారల ఆగమనం..)