స్టడీ
అందానికి సంబంధించి ఏ.ఐ జనరేటెడ్ చిత్రాలు ఆహా అనిపించినా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాయి. న్యూయార్క్‌కు చెందిన డెర్మటాలజిస్ట్ డేచర్ వెబ్‌స్టే దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏఐ జనరేటెడ్ చిత్రాన్ని చూపించి ‘ఈ ఇమేజ్‌లో ఉన్న అమ్మాయిలాగే కనిపించాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఆ మాటకు వెబ్‌స్టే షాక్ అయ్యారు.
‘ఈ ఇమేజ్‌లోలాంటి పెద్ద పెదవులు, పెద్ద కళ్లు, చెక్కినట్లు ఉండే దవడతో నేను కనిపించాలి’ అని అడిగిన ఆ అమ్మాయి వెబ్‌స్టేను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా ఫిల్టర్‌లు సౌందర్య ప్రమాణాలను మార్చిన తీరుకు ఈ సంఘటన అద్దం పడుతుంది. ఏఐ సృష్టించిన సౌందర్య చిత్రాలు నిజజీవితంలో సాధ్యపడతాయని కొంతమంది నమ్ముతున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం... తమ ఫొటోలను ఎడిట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించే వారిలో కొంతమందికి, అందాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ఎన్నో అద్భుతాలు చేస్తుందనే విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ మాన్‌హాటన్‌లోని ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఏఐ జనరేట్ చేసిన తన ఫొటోతో వచ్చింది. సర్జికల్ టైమ్ మిషన్ కావాలని, తాను తన మనవరాలిలా కనిపించాలని అడిగి ఆ సర్జన్ షాక్ అయ్యేలా చేసింది.
‘అలా కుదరదు’ అని నచ్చచెప్పినా ఆ బామ్మ వినలేదు. ‘అలా కనిపించేలా చేయండి’ అని పట్టుబట్టింది. ఫైనల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... ఏ.ఐ ఇమేజ్‌లతో హాస్పిటల్స్‌కు వస్తున్న వారిని చూసినప్పుడు వైద్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి!


