Due To Heavy Rain Pink Eye Cases Out Break In Delhi: Know How To Avoid - Sakshi
Sakshi News home page

కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస‍్తాయా?

Published Wed, Jul 26 2023 11:03 AM

Due To Heavy Rain Pink Eye Cases Out Break In Delhi How To Avoid - Sakshi

వర్షాకాలం కారణంగా గత కొన్ని రోజులుగా దేశంలో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సీజన్‌కి తగ్గట్టుగా వచ్చే వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న కండ్లకలక కేసులు మరింత కలవారుపాటుకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తేమతో కూడిన వాతావరణం కావడంతో వైరస్‌లు, బ్యాక్లీరియాలు పెరిగేందుకు ఇది కాస్త అనుకూలంగా ఉంటుంది. దీంతో దేశంలో కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, ఈశాన్యా రాష్ట్రాలలోని చిన్నారులు అధికంగా ఈ వ్యాధి భారిన పడ్డారు.

అంతేగాదు మహారాష్ట్రలోని పూణేలో అలంది అనే పట్టణంలో కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 2,300 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌ అయితే కండ్లకలక వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. యమునా నది వరద కారణంగా ఢిల్లీలో ఈ కంటి ఇన్ఫెక్షన్లు గతేడాదికంటే అధికంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు కండ్లకల అంటే ఏమిటి? వర్షాకాలంలో ఇది వస్తుందా? తదితరాలు గురించి చూద్దాం!.

'ఐ ఫ్లూ' అని కూడా పిలుస్తారు
కళ్లను ప్రభావితం చేసే ఇన్ఫెక్షనే కండ్లకలక. దీన్ని వైద్య పరిభాషలో 'ఐ ఫ్లూ' లేదా 'పింక్‌ ఐ' అని కూడా పిలుస్తారు. ఇది కంటిని కప్పి ఉంచే స్పష్టమైన పొర కండ్లకలక వాపుకు కారణమవుతుంది.

ఎందువల్ల వస్తుందంటే..
ఏదైనా అలెర్జీ కారకాలు లేదా పొగ, దుమ్ము, పుప్పొడి లేదా రసాయనాల నుండి వచ్చే గాఢతతో కూడిన గాలి కంటి ఫ్లూకి దారితీయవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువ కాలం ధరించడం  లేదా వాటిని సరిగా శుభ్రం చేయకుండా ధరించడం తదితరాల కారణంగా ఈ కంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే జలుబు లేదా దగ్గు వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కూడా ఈ కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే  గొంతు, కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ ఒకటే కావడమే అందుకు కారణం.

ఈ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు

  • ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది. ఐతే అందరిలో కామన్‌గా కనిపించేది.. స్టికీ డిశ్చార్జ్‌తో కళ్ళు ఎర్రగా ఉంటాయి.
  • దురదగా అనిపించడం.
  • కళ్ల నుంచి అదేపనిగా నీరు రావడం. కళ్లు తెరవలేకపోవడం, కంటి నొప్పి తదితర లక్షణాలు వ్యాధి సోకిన పేషెంట్‌లో కనిపిస్తాయి. 

ఈ సీజన్‌లోనే ఎందుకు..
వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా కూల్‌గా మారుతుంది. దీనికితోడు వర్షాకాలం కావడంతో విపరితమైన నీటి ఎద్దడిన ఉంటుంది. దీంతో నీటి వనరులన్నీ కలుషితమవుతాయి. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. మనం తెలియకుండా ఆ నీటితో కడుక్కోవడంతో ఈ ఇన్ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు అన్ని మూక్ముమ్ముడిగా దాడి చేస్తాయి. ఈ వాతావరణ మార్పులు తగ్గట్టు సరైన శుభ్రత పాటించకపోవడంతో ప్రజలు ఈ వర్షాకాలంలో ఈ వ్యాధుల బారినపడే అవకాశాలు అధికం.

నివారణ: 

  • కృత్రిమ కన్నీళ్లు లేదా ఏదైనా లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించడం ప్రభావంతమైన చికిత్సలలో ఒకటి.
  • వేడి నీటితో కాటన్‌ క్లాత్‌ని​ ముంచి కళ్లను కడగడం. పరిశుభ్రతను పాటించాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లతో కూడిన యాంటీబయాటిక్ కంటి చుక్కలు మాత్రమే ఉపయోగించాలి. వ్యాధిని ముదరిపోయేంత వరకు నిర్లక్ష్యం చేస్తే ఈ యాంటిబయోటిక్స్‌ కూడా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే..

  • మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవడం.  వెచ్చని నీటితో తరచుగా మీ చేతులను కడగడం వంటివి చేయాలి
  • ముఖ్యంగా మీ కళ్ళను తాకడానికి ముందు లేదా తర్వాత కంటి చుక్కలు వేయండి.
  • మీ కళ్ళను తాకడం లేదా రుద్దడం మానుకోండి 
  • ఒకవేళ మీకు కండ్లకలక ఉంటే, శుభ్రమైన, తడి వాష్‌క్లాత్ లేదా తాజా కాటన్ బాల్‌ని ఉపయోగించి మీ కళ్ళను క్లీన్‌ చేసుకోండి.
  • దీంతోపాటు దిండ్లు, వాష్‌క్లాత్‌లు, తువ్వాళ్లు, కంటి చుక్కలు, కన్ను లేదా ముఖ అలంకరణ, మేకప్ బ్రష్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కాంటాక్ట్ లెన్స్ నిల్వ కేసులు లేదా కళ్లద్దాలు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేయవద్దు. వీటిలో వైరస్ లేదా బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుంది. 
  • మీ తలగడ కవర్‌లను తరుచుగా మార్చండి. వేడినీటి డిజర్జెంట్‌లోను వాష్‌ చేయండి. ప్రతి రోజు శుభ్రమైన టవల్‌ లేదా వాష్‌ చేసిన క్లాత్‌ ఉపయోగించండి.
  • విటమిన్‌ ఏ, సీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. 
  • రెగ్యులర్‌ కంటి చెకప్‌లు చేయించుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి సత్వరమే బయటపడొచ్చు లేదా రాకుండా జాగ్రత్తపడవచ్చు కూడా. 

(చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య)

Advertisement
Advertisement