థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా?

Dr Venati Shobha Gynecologist Suggestions In Funday Magazine - Sakshi

సందేహం

నాకు పెళ్లయి మూడేళ్లయింది. నా వయసు 29 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. గత ఏడాది నాకు తొలికాన్పు ఏడోనెలలోనే జరిగింది. పుట్టిన పది రోజులకే పాప పోయింది. ఇప్పుడు నాకు నాలుగో నెల. తొలికాన్పులో తలెత్తిన పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు.
– సుమతి, టెక్కలి

సాధారణంగా గర్భస్థ శిశువు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక వారం వరకు పెరుగుతుంది. సక్రమంగా పీరియడ్స్‌ వచ్చేవారిలో చివరి పీరియడ్‌ అయిన మొదటి రోజు నుంచి లెక్కపెడితే, 280 రోజులు లేదా 40 వారాల సమయానికి డెలివరీ తేదీని (ఎక్స్‌పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ–ఈడీడీ) నిర్ణయించడం జరుగుతుంది. దాదాపు 80 శాతం మందికి ఈడీడీ కంటే రెండు వారాల ముందే డెలివరీ జరుగుతుంది. కాన్పు నొప్పులు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. 36 వారాలకు ముందే కాన్పు కావడాన్ని ప్రీటెర్మ్‌ డెలివరీ అంటారు. సాధారణంగా 36–37 వారాల వరకు బిడ్డ ఊపిరితిత్తుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడుతుంది. 

ఇంకా ముందే పుట్టడం వల్ల బిడ్డ ఊపిరితిత్తులు సరిగా ఎదగక బిడ్డ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు ఏర్పడి, సమయానికి సరైన వైద్య సహాయం అందకపోయినా, బిడ్డ చికిత్సకు సరిగా స్పందించకపోయినా బిడ్డకు ప్రాణాపాయం కలగవచ్చు. మీ పాప మరీ ఏడో నెలలోనే పుట్టడం వల్ల ఇబ్బంది అయినట్లుంది. గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్‌ చిన్నగా ఉన్నా, లూజ్‌గా ఉన్నా కొందరిలో బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయం వదులై, నెలలు నిండకుండానే కాన్పు జరగవచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్లు, ఇంకా ఇతరేతరా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, గర్భాశయం ఆకారంలో తేడాలు ఉంటే బైకార్నుయేట్‌ యుటెరస్, సెప్టేట్‌ యుటెరస్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు కొందరిలో 7–8 నెలలో కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

చదవండి: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!!

ఇప్పుడు మీకు నాలుగో నెల గర్భం కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ముందు జాగ్రత్తగా స్కానింగ్‌లో గర్భాశయ ముఖద్వారం– అంటే సర్విక్స్‌ లెంగ్త్‌ తెలుసుకుంటూ ఉండటం ముఖ్యం. ఒకవేళ సర్విక్స్‌ లూజ్‌గా ఉన్నా, చిన్నగా ఉన్నా గర్భాశయ ముఖద్వారానికి యోనిభాగం ద్వారా సర్‌క్లాజ్‌ కుట్లు వేయడం జరుగుతుంది. వజైనల్‌ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ, వాటికి సరైన చికిత్స తీసుకోవడం, అలాగే గర్భాశయ కండరాలు కుంచించుకోకుండా ఉండటానికి ప్రొజెస్టిరాన్‌ ఇంజెక్షన్లు, మాత్రలు అవసరాన్ని బట్టి వాడటం, శారీరక శ్రమ లేకుండా విశ్రాంతిగా ఉండటం వంటి జాగ్రత్తలు డాక్టర్‌ సలహా మేరకు తీసుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు నెలలు నిండకుండా జరిగే కాన్పులను అరికట్టవచ్చు. 

కాని, కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం పనితీరు, శరీరం తీరును బట్టి కొందరిలో ముందుగానే కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు బిడ్డలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి 7–8 నెలలో స్టిరాయిడ్‌ ఇంజెక్షన్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్‌ సలహాను పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని సౌకర్యాలూ ఉన్న ఆస్పత్రిలో చెకప్‌ చేయించుకుంటూ ఉంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఒకవేళ ముందుగా పుట్టినా, సమయానికి ఇంక్యుబేటర్‌లో ఉంచి, సరైన చికిత్స ఇవ్వడం వల్ల, బిడ్డ చికిత్సకు స్పందించే తీరు బట్టి బిడ్డ ఆరోగ్యంగా బయటపడుతుంది.

నేను థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నాను. నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నా ఎత్తు 5.1, బరువు 75 కిలోలు. ఇంట్లోవాళ్లు త్వరలోనే నాకు పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. థైరాయిడ్, పీసీఓడీ రెండు సమస్యలూ ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా?
– సాయిలక్ష్మి, ధర్మవరం

థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు తలెత్తినప్పుడు కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, సక్రమంగా వచ్చినా, కొందరిలో అండం సరిగా పెరగకపోవడం, అది విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవడం, గర్భం వచ్చినా, అబార్షన్‌ జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాకపోతే ఈ సమస్యలకు గైనకాలజిస్టులు చెప్పిన సలహాలను పాటిస్తూ, సరైన చికిత్స తీసుకుంటే, థైరాయిడ్‌ సమస్య అదుపులో ఉండి, పీసీఓడీ వల్ల ఉండే హార్మోన్ల అసమతుల్యత చక్కబడితే గర్భం తప్పకుండా వస్తుంది. ఇక మీ విషయానికి వస్తే, ఎత్తు 5.1 అడుగులకు గరిష్ఠంగా 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. 

కాని, మీరు 75 కిలోలు ఉన్నారు. మీ సమస్యలకు సగం చికిత్స బరువు తగ్గడమే! క్రమం తప్పకుండా వాకింగ్, యోగా, ఏరోబిక్స్‌ వంటి వ్యాయామాలతో పాటు జంక్‌ఫుడ్‌ మానేసి, మితమైన పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. మీరు పెళ్లి కుదిరే లోపు బరువు తగ్గి, థైరాయిడ్‌ మాత్రలు సరైన మోతాదులో తీసుకుంటూ, థైరాయిడ్‌ సమస్యను అదుపులో ఉంచుకుంటే, పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు సహజంగానే పెరుగుతాయి. బరువు తగ్గితే పెళ్లయిన తర్వాత గర్భం రాకపోయినా, సరైన చికిత్సతో గర్భం త్వరగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బరువు తగ్గకుండానైతే, గర్భం కోసం చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బరువు తగ్గడానికి పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం మంచిది.

- డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌ 

చదవండి: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్‌!! కానీ కారు ప్రమాదంలో..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top