Dolly Singh: కాలీ లడకీ... డాలీసింగ్‌!

Dolly Singh Introduced the newest fashion and inspiration to many - Sakshi

సన్నగా, నల్లగా ఉండడంతో.. తోటి విద్యార్థులంతా ‘ కాలీ లడ్కీ’, ‘సుఖీ దాండి’, బ్యాగ్‌ ఆఫ్‌ బోన్స్‌’ అంటూ డాలీసింగ్‌ను ఆటపట్టిస్తుండేవారు. ఖండించాల్సిన టీచర్లు సైతం కొన్నిసార్లు డాలీ వేసుకున్న డ్రెస్‌ పార్టీకి నప్పదని చెప్పి వెనక్కి పంపించేవారు. ఇటువంటి ఎన్నో అవహేళనలను ఎదుర్కొంటూ కూడా ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివి, సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేసింది డాలీ. ఫ్యాషన్‌ బ్లాగర్, కంటెంట్‌ క్రియేటర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

నైనిటాల్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1993లో డాలీ సింగ్‌ పుట్టింది. డాలీ సింగ్‌ తల్లిదండ్రులకు ‘అప్నా బజార్‌’ పేరిట ఒక గిఫ్ట్‌ షాపు ఉంది. ఈ షాపు మీద వచ్చే కొద్దిపాటి ఆదాయమే వారి  జీవనాధారం. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ డాలీ సింగ్, తన తమ్ముడితో కలిసి స్కూలుకు వెళ్లి చక్కగా చదువుకునేది. స్కూల్లో తన బక్కపలుచని శరీరాన్ని తోటి విద్యార్థులు గేలిచేసినప్పటికీ చురుకుగా చదువుతూ.. క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చేది.

స్పిల్‌ ది సాస్‌..
డిగ్రీ తరువాత ఎమ్‌బీఏ చదివేందుకు క్యాట్‌ పరీక్ష రాసింది. కానీ ఎమ్‌బీఏలో సీటు రాలేదు. దీంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ)ఎంట్రన్స్‌ రాయగా.. ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఢిల్లీ ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసింది. పీజీ చదువుతూనే మరోపక్క ‘స్పిల్‌ ది సాస్‌’ పేరిట ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రార ంభించింది. ఈ బ్లాగ్‌లో సరికొత్త ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఫోటోలను పోస్టు చేసేది. వీటితోపాటు దుస్తుల ఫ్యాషన్‌ వీడియోలు, యాక్సెసరీస్, బడ్జెట్‌ ధరలో ఫ్యాషన్‌ దుస్తుల షాపింగ్‌ ఎలా చేయాలి... వంటి అంశాలపై వీడియోలను పోస్టు చేసేది. 
తల్లి, తండ్రి, తమ్ముడితో డాలీసింగ్‌ 

పీజీ ప్రాజెక్టులో భాగంగా డాలీ సింగ్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ‘ఐ దివ’ లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేసింది. ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక ఐ దివాలో కంటెంట్‌ క్రియేటర్‌గా చేరి.. నిర్మాతగా, రచయితగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభంలో వీడియోలు షూట్‌ చేయడం కాస్త కష్టంగా ఉండడంతో...రెండేళ్ల తరువాత ఐ దివ డైరెక్టర్‌ ‘సౌత్‌ ఢిల్లీ గర్ల్స్‌’ పేరిట షోను ప్రారంభించారు. ఈ షోలో డాలీసింగ్‌ కుషా కపిలతో కలిసి చాలా వీడియో సీరిస్‌ చేసింది. ఈ సీరిస్‌ బాగా పాపులర్‌ అయింది. డాలీసింగ్‌ కెరియర్‌లో ఇదో మైలురాయి. ఈ షోతో డాలీకి అపారమైన పాపులారిటి వచ్చింది. సౌత్‌ ఢిల్లీ గర్ల్స్‌ సిరీస్‌ తరువాత డాలీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘జీనత్‌’ ‘మిసెస్‌ కపూర్‌’, ‘నటాషా’ ‘రెక్‌లెస్‌ రేణు’, గుడ్డీ బాబాయ్‌’, ‘బబ్లీ’ వంటి వీడియోలు డాలీసింగ్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. నైనిటాల్‌లోని డాలీ సింగ్‌ ఇంటిని ‘మై రియల్‌ హౌస్‌ టూర్‌’ పేరిట ఎడిటింగ్‌ చేయని వీడియో అప్‌లోడ్‌ చేసింది. వాస్తవానికి దగ్గరగా ఉన్న వీడియో కావడంతో వ్యూవర్స్‌ బాగా ఇష్టపడ్డారు.

రాజుకీ మమ్మీ..
‘రాజుకీ మమ్మీ’ టాక్‌ షో ద్వారా చాలామంది బాలీవుడ్‌ సెలబ్రెటీలను డాలీ ఇంటర్వ్యూ చేసింది. ప్రియాంకా చోప్రా, ఆయుష్మాన్‌ ఖురానా, కంగనా రనౌత్, కరీనా కపూర్, నవాజుద్దీన్‌ సిద్దికీ, పంకజ్‌ త్రిపాఠి వంటి వారితో కలిసి చేసిన క్యారెక్టర్‌ వీడియోలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. డాలీ సింగ్‌ యూట్యూబ్‌ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్, ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ఫాలో అయ్యే వారిసంఖ్య లక్షల్లోనే ఉంది. 

ఒకపక్క ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, యూట్యూబ్‌ సిరీస్‌లో తీరికలేకుండా గడుపుతున్న డాలీ గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘భాగ్‌ బీని భాగ్‌’ సిరీస్‌లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.                                        

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top