ఈ నాలుగింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా..! | Differences Between Hotel, Motel, Restaurant, And Resort | Sakshi
Sakshi News home page

ఈ నాలుగింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా..!

Jun 1 2026 9:47 AM | Updated on Jun 1 2026 7:38 PM

Differences Between Hotel, Motel, Restaurant, And Resort

హోటల్, మోటెల్, రెస్టారెంట్, రిసార్ట్‌..

మన నిత్య జీవితంలో తరచుగా వాడే కొన్ని పదాల మధ్య అసలు తేడా చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో హోటల్, మోటెల్, రెస్టారెంట్‌ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రిసార్ట్‌ పదాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రదేశాలు దాదాపు ఒకే విధంగా అనిపించినా, వాటి సేవలు, ఉద్దేశం, స్థానాల విషయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వీటిని ఒకే విధంగా వాడటం వల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు ఈ నాలుగు పదాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

హోటల్‌ అంటే..
హోటల్‌ అనేది చాలా మందికి బాగా తెలిసిన, తరచుగా ఉపయోగించే ఒక వసతి కేంద్రం. ప్రయాణ సమయంలో బస చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతి పొందే ప్రదేశం. హోటల్స్‌లో సాధారణంగా భోజనం (రెస్టారెంట్‌), టీవీ, వైఫై వంటి అదనపు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. హోటళ్లు పట్టణాల మధ్యలో లేదా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో నిర్మించి ఉంటాయి.

మోటెల్‌ అంటే..
మోటెల్స్‌ అనేవి హోటల్స్‌కు భిన్నంగా, చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించబడ్డాయి. మోటెల్‌  అంటే కారు డ్రైవ్‌ చేస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి, ఆగి వెళ్లడానికి వీలుగా ఉండే ప్రదేశం. ఇవి ప్రధానంగా సుదూర హైవేల వెంబడి నిర్మించబడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

  • మోటెల్స్‌లో సాధారణంగా రాత్రి బస చేయడానికి గది దొరుకుతుంది, ఉచిత పార్కింగ్‌ తప్పనిసరి ఉంటుంది. అయితే, రెస్టారెంట్‌ లేదా పూర్తి భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. కొన్ని మోటెల్స్‌లో కేవలం కేఫ్‌ సౌకర్యం మాత్రమే ఉంటుంది.

రెస్టారెంట్‌..
హోటల్, మోటెల్‌తో పోలిస్తే రెస్టారెంట్‌ ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది. రెస్టారెంట్‌ అనేది వసతి సౌకర్యం లేకుండా, కేవలం తినే సదుపాయం మాత్రమే ఉన్న ప్రదేశం. ఇక్కడ వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. చాలా పెద్ద హోటళ్లు తమ అతిథుల కోసం తమ సొంత రెస్టారెంట్‌లను కలిగి ఉంటాయి. కానీ, రెస్టారెంట్లలో రాత్రి బస చేసే సదుపాయం ఉండదు.

రిసార్ట్‌ అంటే... 
రిసార్ట్‌ అనేది హోటల్‌ కంటే చాలా విస్తృతమైన సౌకర్యాలు, అనుభవాన్ని అందిస్తుంది. రిసార్ట్‌లు సాధారణంగా హోటళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇవి కేవలం బస కోసమే కాకుండా, కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి, వినోదం పొందడానికి ఉద్దేశించబడ్డాయి.

  • రిసార్ట్‌లో వసతి, భోజనాలతో పాటు అదనపు వినోద సౌకర్యాలు ఉంటాయి. ఉదాహరణకు, స్విమ్మింగ్‌ పూల్, గేమ్‌ జోన్, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, స్పా, ఇతర ఆటల సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్‌తో సహా అనేక పర్యాటకప్రాంతాలలో ఈ రిసార్ట్‌ల సంఖ్య పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement