
పూర్వం గోమతీ నది తీరంలో కంధుడు అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కంధుడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ప్రమ్లోచన అనే అప్సరసను పంపించాడు. ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం ప్రమ్లోచన కంధుడిని చేరి, సపర్యలు చేసి అతడి మనసును రంజింపజేసింది. వారిరువురి మధ్య అనురాగం వృద్ధిపొందింది. అలా కొంత కాలం గడిచాక, తాను వచ్చిన పని అయిందని గ్రహించిన ప్రమ్లోచన కంధుడితో ‘స్వామీ, నేను ఇంద్రుడి కొలువులో ఉండేదానను. ఇక్కడకు వచ్చి చాలా కాలం అయింది. ఇక సెలవిస్తే వెళతాను!’ అంది. దానికి కంధుడు ‘నువ్వు ఇక్కడకు వచ్చి ఎక్కవసేపేమీ కాలేదు. అప్పుడే నన్ను విడిచి వెళితే ఎలా?’ అన్నాడు. మరికొంత కాలం గడిచింది. ప్రమ్లోచన మళ్ళీ వెడతానని బయలుదేరింది.
‘నీవు వచ్చి ముహూర్తం సమయమైనా గడవలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటావేమిటి?’ అన్నాడు కంధుడు. మరి కొంత కాలం గడిచింది. మరోసారి ప్రమ్లోచన ఇంద్రుడి సన్నధికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. ‘తపస్సు చేసుకుంటూ రోజులు గడిపే నా జీవితంలో నేను కోరకుండానే ప్రవేశించి, నా మనసులో మోహ బీజాన్ని నాటి, ఆనందపరచి, ఇప్పుడు ఆ అంతటినీ వ్యర్థంచేసి వెళ్ళిపోతాననడం నీకు తగినదేనా?’ అన్నాడు కంధుడు.
మరి కొంత కాలం గడిచింది. ఒకనాడు సూర్యుడు అస్తమిస్తున్న వేళ నదీతీరానికి బయలుదేరాడు కంధుడు. ‘ఎక్కడికి స్వామీ?’ అడిగింది ప్రమ్లోచన. ‘సాయంత్రమయింది, సంధ్యాకాల విధులు తీర్చుకుని వస్తాను!’ అన్నాడు కంధుడు. దానికి ఆమె నవ్వి ‘ఒకనాటి పొద్దున నేను రావడం నిజం! ఇప్పుడు సాయంత్రమవడమూ నిజం! కానీ ఈ రెండింటి మధ్య తొమ్మిది వందల ఏడు సంవత్సరాల ఆరు నెలల మూడు రోజుల కాలం గడిచింది!’ అన్నది. తెలివిలోకి వచ్చిన కంధుడు, మోహంలో చిక్కుకుని ఎంత విలువైన జీవితాన్నీ, తపోధనాన్నీ తాను పోగొట్టుకున్నాడో గ్రహించి బాధపడ్డాడు.
– భట్టు వెంకటరావు