విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..! | Is Devotion Essential During The Student Phase, The Role Of Devotion Explained Inside | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..!

May 11 2026 2:10 PM | Updated on May 12 2026 9:27 AM

Is Devotion essential during the student phase

ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్‌. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.

‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. 

అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement