క్రయోథెరపీ.. ఒక చల్లని చికిత్స
స్పీకింగ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, రేడియోథెరపీ, ఫార్మాథెరపీ ఇలా చికిత్స విధానాల పేరు ఏదైనా సమస్య మాత్రం ఒకటే ‘అనారోగ్యం’. నిజానికి ఈ రకమైన థెరపీలు లెక్కకు మించినవి. శారీరక రోగాలకే కాక, మానసిక ఆరోగ్యం కోసం ఉద్దేశించిన సైకోథెరపీ, ఆహార నియమాలతో మెరుగుపరచే డైటరీథెరపీ, రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోథెరపీ వంటివి ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదంలో అయినా, ఆధునిక వైద్యంలో అయినా– కాలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి చికిత్స విధానాలు మారుతూ, మెరుగుపడుతూ వస్తున్నాయి.
నిరంతరం సాగే ప్రయోగాల్లో పరిశోధనల్లో, ఆధునిక విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అన్వేషించిన వాటిని మరింతగా విశ్లేషించి అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో, వైద్య ప్రపంచాన్ని అబ్బురపరచిన సరికొత్త థెరపీనే, క్రయోథెరపీ(Cryotherapy)! ప్రస్తుతం డెర్మటాలజిస్ట్‌లు, ఫిజియోథెరపిస్ట్‌లు, సర్జన్లు ఇలా చాలామంది మెడికల్ స్పెషలిస్ట్‌ల నోట వినిపిస్తున్న వైద్య పద్ధతి క్రయోథెరపీనే!
వారంతా ఈ నాన్–ఇన్వేసివ్ (శరీరానికి కత్తి కోతలు, సూది పోట్లు లేని) చికిత్స విధానానికే ఓటేస్తున్నారు.
క్రయో అంటే గ్రీకు భాషలో చల్లని లేదా గడ్డకట్టిన మంచు అని అర్థం. చల్లదనంతో చేసే చికిత్స కాబట్టి దీనికి క్రయోథెరపీ అని పేరొచ్చింది. ఇది– ప్రస్తుతం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం ఉన్న ఒక ఆధునిక చికిత్స విధానం! మొత్తం శరీరానికి లేదా సమస్య ఉన్న శరీరభాగాలకు అతి శీతల ఉష్ణోగ్రతలను అందించి, చికిత్స చేయడమే ఈ క్రయోథెరపీ పద్ధతి. ఈ చికిత్సతో క్యాన్సర్ వంటి కొన్నిరకాల అసాధారణ కణజాలాలను నాశనం చేయొచ్చు. నైట్రోజన్ లిక్విడ్ లేదా ఆర్గాన్ గ్యాస్ వంటి పదార్థాలను ఉపయోగించి ప్రమాదకరంగా మారిన కణాలను తొలగించడానికి కావలసిన తీవ్రమైన చలిని పొడిగాలుల రూపంలో ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఇది వెల్‌నెస్ ట్రీట్‌మెంట్లలో వినూత్న పద్ధతిగా ప్రాచుర్యం పొందుతోంది. ఒకప్పుడు కేవలం క్రీడాకారులకు మాత్రమే పరిమితమైన ఈ హిమ చికిత్స ఇప్పుడు పలు ఆరోగ్య సమస్యల నివారణకు, మానసిక ఉల్లాసానికి, సౌందర్య చికిత్సలకు ఉపయోగపడుతోంది. దీనిలో ప్రధానంగా రెండు రకాల చికిత్స విధానాలు ఉన్నాయి.
మొదటిది ‘లోకల్ లేదా ఫోకల్ క్రయోథెరపీ’. ఇది శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఉన్న అసాధారణ లేదా ప్రమాదకరమైన కణజాలాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని క్రయో అబ్లేషన్ లేదా క్రయో సర్జరీ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు, క్యాన్సర్ కణాలు, పులిపిర్లు లేదా ఇతర చర్మ గాయాలను సరి చేయడం వంటివి ఈ చికిత్సలోకే వస్తాయి.
రెండవది ‘హోల్ అండ్ బాడీ క్రయోథెరపీ’. ఈ ట్రీట్‌మెంట్‌లో కొన్ని నిమిషాల పాటు క్రయోచాంబర్ అనే ప్రత్యేక గదిలాంటి అతిశీతల పేటికలో ఉంచుతారు. అది కూడా 2 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే చికిత్స ఉంటుంది. ఆ గది చాలా చల్లగా ఉంటుంది. క్రయోథెరపీలో భాగంగా, శరీరంలోని రక్తనాళాలు అతి శీతల వాతావరణంలో (సుమారు మైనస్ 110 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వరకు) సంకోచించి, చికిత్స అవసరమైన అవయవాలకు రక్తప్రసరణను పెంచుతాయి. చికిత్స అనంతరం బయటకు రాగానే – ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా ఉన్న తాజా రక్తం కండరాలకు, చర్మానికి వేగంగా చేరుతుంది.
ఈ ప్రక్రియ వాపును తగ్గిస్తుంది, కండరాల రికవరీలో వేగం కనిపిస్తోంది. నిజానికి అంత మైనెస్ డిగ్రీల చలంటే తలచుకుంటేనే వణుకు పుడుతుంది కదా అనే అనుమానం రావచ్చు. అయితే ‘తడి చలిలో ఉండలేం కానీ పొడిగా ఉండే చలిగాలిలో శరీరం కొద్దిసేపు ఉండగలదు’ అని చెబుతున్నారు క్రయోథెరపీ నిపుణులు.
ఈ చికిత్సతో ఓపెన్ సర్జరీ లేకుండానే వ్యాధిగ్రస్థ కణజాలాన్ని తొలగించొచ్చు. దాంతో చాలామంది త్వరగా, తక్కువ నొప్పితో కోలుకుంటారు. పులిపిర్లు, మచ్చలు, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిడ్స్ రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్), ఎముకల క్యాన్సర్ ఇలా చాలా రకాల సమస్యలను, వ్యాధులను ఈ ట్రీట్‌మెంట్‌తో నయం చేయొచ్చు.
ఈ హిమ చికిత్సకు పునాది ఎక్కడ?
చికిత్స కోసం చల్లదనాన్ని ఉపయోగించే క్రయోథెరపీ ఇప్పటిది కాదు. ఈ పద్ధతి వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. నిజానికి క్రయోథెరపీ చరిత్ర పురాతన నాగరికతలతో ప్రారంభమైంది. ఈజిప్షియన్లు, గ్రీకులు, రోమన్లు అసాధారణ వాపులను తగ్గించడానికి, గాయాలకు చికిత్స చేయడానికి మంచుగడ్డను ఉపయోగించేవారు. ప్రసిద్ధ వైద్యుడు హిపోక్రాట్స్ సైతం గాయాలకు, వాపులకు చల్లదనాన్ని ఉపయోగించమని సిఫారసు చేశారట. చల్లని నీటిలో మునగడం, మంచు ముక్కల్లో కూర్చోవడం ఇవన్నీ నాటి మొదటి అడుగులే!
1800ల నాటి వైద్యులు ‘ఐస్ బాత్’ను (మంచు స్నానాన్ని) వైద్య చికిత్సలో భాగం చేశారు. కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల చికిత్సకు ఐస్ బా™Œ క్లినిక్స్ అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలలో సర్వసాధారణమయ్యాయి. అనంతరం వైద్యులు శస్త్రచికిత్సల సమయంలో కోల్డ్ ప్యాక్‌లను ఉపయోగించడం మొదలుపెట్టారు.
⇒ 19వ శతాబ్దం మధ్యలో ఆధునిక క్రయోథెరపీకి పునాది వేసిన నాటి ప్రసిద్ధ వైద్యుడు జేమ్స్ ఆర్నాట్‌ను క్రయోథెరపీ పితామహుడు అంటారు. ఆయన నొప్పులు, కణితుల నివారణకు ఈ శీతల చికిత్సను ప్రారంభించిన మొదటి వ్యక్తి.
⇒ 20వ శతాబ్దం వచ్చేనాటికి క్రయోసర్జికల్ విధానంలో లిక్విడ్ నైట్రోజన్‌ను ఉపయోగించడంతో పరికరాల అభివృద్ధికి దారితీసింది.
⇒ ఈ చికిత్స ప్రయోజనాలను ప్రాచీన ఈజిప్షియన్లు క్రీ.పూ. 2500 నాటికే గుర్తించారు.
⇒ హిపోక్రాట్స్– క్రీ.పూ. 400 ప్రాంతంలో, నొప్పి నివారణ, వాపు కోసం మంచుగడ్డలు ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి.
క్రయోథెరపీ చరిత్రలో కీలక మలుపు 1978లో వచ్చింది. జపాన్ కు చెందిన డా. తోషిమా యమగుచి– రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు చల్లటి గాలి చికిత్సలను ఉపయోగించడం ప్రారంభించారు. చల్లటి నీటిని ఉపయోగించకుండానే గాలిని వాడి– కీళ్ల నొప్పులు, వాపును త్వరగా తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయోగాలు మంచి ఫలితాలను సాధించడంతో క్రయోథెరపీ చాంబర్ ఆవిష్కరణకు దారి తీసింది. ఇందులో రోగులు తక్కువ సమయం పాటు అతి శీతల ప్రదేశంలో నిలబడతారు. ఇదే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
భారతదేశంలో క్రయోథెరపీ అభివృద్ధి– భవిష్యత్తు!
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ పెరుగుతున్న తరుణంలో భారత్ కూడా క్రయోథెరపీవైపు బాగానే మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో హెల్త్ అండ్ వెల్‌నెస్‌లో ఈ చికిత్సకు ప్రాధాన్యం పెరుగుతోంది. భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి వాటిలో అధునాతన వెల్‌నెస్ సెంటర్‌లు, క్రయోథెరపీ క్లినిక్‌లు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రజలు, కొత్త వెల్‌నెస్ థెరపీలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణికి క్రీడాకారులు, సెలబ్రిటీల మద్దతు కూడా తోడైంది. వారి సానుకూల అనుభవాలే ఇప్పుడు ప్రజల్లో క్రయోథెరపీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నాయి.
ప్రధాన ప్రయోజనాలు
⇒ కండరాల నొప్పిని వేగంగా, పూర్తిగా తగ్గించడం, గాయాలను త్వరగా నయం చేయడం వంటి ఫలితాలతో– క్రీడాకారులలో, ఫిట్‌నెస్ ఔత్సాహికులలో ఈ చికిత్స బాగా ప్రాచుర్యం పొందింది.
⇒ ఫైబ్రోమయాల్జియా, కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం అందించడానికి ఈ ట్రీట్‌మెంట్ సహాయపడుతుంది.
⇒ డెర్మటాలజిస్టులు, కాస్మెటిక్ క్లినిక్‌లు ఈ థెరపీని యాంటీ–ఏజింగ్ లక్షణాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, వృద్ధాప్యం వల్ల శరీరంపై ఏర్పడే ముడతలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ‘ఇన్‌ఫ్లమేజింగ్’ (వయసు పెరగడంతో వచ్చే దీర్ఘకాలిక వాపుల సమస్య)ను తగ్గించి, వృద్ధాప్య సంకేతాలను కాస్త దూరం చేయగలుగుతుంది.
⇒ క్రయోథెరపీతో జీవక్రియ వేగం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొవ్వును కరిగించే చికిత్సగా ఇది ఫిట్‌నెస్ మెయింటెనెన్స్‌లో భాగమవుతోంది.
⇒ క్రయోథెరపీ ఎండార్ఫిన్ ల (ఫీల్–గుడ్ కెమికల్స్) విడుదలకు ఉపయోగపడుతుంది. దాంతో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గుతాయి.
∙∙
⇒ నగరాల్లో నివసించే ప్రజలు ఇలాంటి చికిత్సల కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇది క్రయోథెరపీకి పెద్ద మార్కెట్‌ను సూచిస్తుంది. అలాగే సోషల్ మీడియా, హెల్త్ బ్లాగులతో ఈ చికిత్స గురించి అవగాహన కూడా బాగానే పెరుగుతోంది.
⇒ స్పోర్ట్స్–ఫిట్‌నెస్‌ల మీద అవగాహన, ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ఈ థెరపీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అథ్లెట్ల తమ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవడానికి, క్రీడా అకాడమీలు ఈ థెరపీని తమ శిక్షణ కార్యక్రమాలలో భాగం చేసుకుంటున్నాయి.
⇒ ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్, స్పాలు వంటి ఇతర వెల్‌నెస్ చికిత్సలతో క్రయోథెరపీని అనుసంధానం చేయడంతో భవిష్యత్తులో పూర్తి ఆరోగ్య ప్యాకేజీని కోరుకునే కస్టమర్‌లను ఆకర్షించవచ్చు.
⇒ ‘తక్కువ ధర, అధిక నాణ్యత’ అనే స్లోగన్‌తో భారత్ ఇప్పటికే చాలా వైద్య విధానాలతో విదేశీ రోగులను ఆకర్షిస్తోంది. క్రయోథెరపీని మెడికల్ టూరిజం ప్యాకేజీలలో చేర్చడంతో అంతర్జాతీయ రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
⇒ ఈ చికిత్సలో సాంకేతిక పురోగతులు వేగంగా వస్తున్నాయి. క్రయో పోర్టబుల్ యంత్రాలలో, మెరుగైన, సురక్షితమైన క్రయో చాంబర్‌లలో టెక్నాలజీ మరింత అప్‌డేట్ అవుతోంది.
క్రయోథెరపీ మార్కెట్ ఎన్నుకునేవారికి సవాళ్లు–సూచనలు
సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో క్రయోథెరపీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వైద్యరంగాన్ని తనవైపు తిప్పుకోనున్న క్రయోథెరపీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? పెట్టుబడిపరంగా, విద్యపరంగా ఈ రంగాన్ని ఎంచుకునేవారికి ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి?
∙ఆధునిక క్రయోథెరపీ యంత్రాల దిగుమతి, సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోంది, ఇది కొత్త పారిశ్రామికవేత్తలకు అడ్డంకిగా మారుతుంది.
⇒ సాధారణ ప్రజలు, వైద్య నిపుణులలో కూడా క్రయోథెరపీ ప్రయోజనాలు, భద్రత గురించి మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.
⇒ ఈ క్రయో చికిత్సలకు సంబంధించి – భారత్‌లో సంక్లిష్టమైన చట్టపరమైన నిబంధనలను పాటించడం కాస్త సవాలుగా మారుతుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అవసరం.
⇒ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, అలాగే వ్యాయామశాలలు, వెల్‌నెస్ రిసార్ట్‌లతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ఈ చికిత్సను ప్రజలకు చేరువ చేయగలవు. అంతేకాకుండా, ప్రారంభ ఖర్చులను తగ్గించడానికి తక్కువ–ధర కలిగిన నాణ్యమైన పరికరాలపై దృష్టి పెట్టాలన్నది ఒక సూచన.
లాభనష్టాలు!
ఈ చికిత్సతో ఏర్పడిన పుండు సాధారణంగా ఒకటి నుంచి మూడు వారాల్లో నయమవుతుంది. క్రయోసర్జరీ తర్వాత, కొద్ది రోజులు ఆ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా పుండ్లు ఉండొచ్చు. కొన్నిసార్లు, అసాధారణ కణజాలాన్ని పూర్తిగా తొలగించడానికి ఒకరికంటే ఎక్కువ క్రయోథెరపీలు అవసరం కావచ్చు. అయితే ఈ థెరపీతో నరాలు దెబ్బతినడం, స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి సమస్యలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఎముకల పగుళ్లు (క్రయోసర్జరీ కారణంగా), గర్భాశయం చుట్టూ రక్తస్రావం లేదా తిమ్మిరి వంటివి తలెత్తొచ్చు. ఇవన్నీ అరుదుగా ఏర్పడే సమస్యలు మాత్రమే! చాలామంది క్రయోథెరపీ తీసుకున్న తర్వాత త్వరగా కోలుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలామంది ఆర్థోపెడిక్స్ నుంచి ఆంకాలజీల వరకూ క్రయోథెరపీ గురించే చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశోధనలు ఫలించగానే ప్రత్యేక శిక్షణలు తీసుకుంటారు. మార్కెట్‌లోకి వస్తున్న ప్రతి క్రయోటెక్నాలజీని నేర్చుకునేందుకు చొరవ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రయోథెరపీ– అన్ని వైద్య సేవలతో అన్ని అనారోగ్యాలకు తిరుగులేని చికిత్సగా మారితే ఈ ప్రపంచం వైద్యశాస్త్రంలో మరో మెట్టు ఎక్కినట్లే!
క్రయోథెరపీలో పద్ధతులు– జాగ్రత్తలు
⇒ క్రయో చాంబర్‌లోకి ప్రవేశించే ముందు, చర్మం పొడిగా, శుభ్రంగా ఉండాలి.
⇒ చికిత్సకు 6–12 గంటల ముందు రోగి తినడం, తాగడం మానేయమని చెబుతారు. ముందు నుంచి కోల్డ్ అలెర్జీ, రక్తనాళాల సమస్యలు, రేనాడ్స్ వ్యాధి వంటివి ఉన్న వారు ఈ థెరపీ చేయించుకోరాదు.
⇒ క్రయో చాంబర్‌కి తడి బట్టలు వేసుకోకూడదు. ఎలాంటి గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.
⇒ గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారితో పాటు గర్భవతులు కూడా ఈ చికిత్సకు దూరంగా ఉండాలి.
భారతదేశంలో క్రయోథెరపీ భవిష్యత్తుపై భారీ అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ థెరపీ పాత్ర ఇలా– పలు కారణాలతో ఈ రంగంలో అభివృద్ధికి విస్తృతమైన అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కండరాల రికవరీ, వాపును తగ్గించడం, బరువు తగ్గడం, చర్మ సంరక్షణ వంటి వివిధ పరిస్థితులకు క్రయోథెరపీని ఉపయోగించడంపై నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ, భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో క్రయోథెరపీ తప్పకుండా ప్రత్యేక స్థానంలో నిలుస్తుందనేది ఒక అంచనా.
గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థల నివేదిక ప్రకారం, భారతదేశంలో క్రయోథెరపీ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందుతుందని అంచనా. ఈ క్రయోథెరపీ మార్కెట్ 2024లో 3.6 మిలియన్ డాలర్ల (రూ.31.74 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ లెక్కన 2030 నాటికి 7.0 మిలియన్ డాలర్ల (రూ.61.72 కోట్లు) ఆదాయాన్ని చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2025 నుంచి 2030 వరకు 11.6% వార్షిక వృద్ధి రేటు ఉంటుందని లెక్కలేస్తున్నారు.
అంశం వివరాలు
2024లో మార్కెట్ ఆదాయం 3.6 మిలియన్ డాలర్లు (రూ.31.74 కోట్లు)
2030 నాటికి అంచనా ఆదాయం 7.0 మిలియన్ డాలర్లు (రూ.61.72 కోట్లు)
వృద్ధి రేటు (2025–2030) 11.6%
అంచనా కాలం 2025 –2030
ప్రపంచవాప్తంగా ప్రముఖ క్రయోథెరపీ సంస్థలు– డెన్మార్క్, ఐర్లండ్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఈ సంస్థలు సర్జికల్, లోకలైజ్, హోల్–బాడీ క్రయోథెరపీ పరికరాలను తయారు చేసి, అన్ని ఆసుపత్రులకు, చికిత్స కేంద్రాలకు అమ్ముతున్నారు. అలాగే నిర్వహణ సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రయోథెరపీ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఎలా అభివృద్ధి చెందబోతుంది? అని ‘డేటా బ్రిడ్జ్ మార్కెట్ రీసర్చ్’ అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన సర్వేల్లో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఏషియా–పసిఫిక్, దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో క్రయోథెరపీ అభివృద్ధి గురించి ఈ రీసెర్చ్ సెంటర్ స్పష్టమైన లెక్కలిచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త దేశాలు, కొత్త వినియోగదారులు పెరుగుతున్నారని తేల్చింది. ఆ వివరాలు ఈ చార్ట్‌లో చూడొచ్చు. - సంహిత నిమ్మన


