
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి.కృష్ణంరాజును 2006 సెప్టెంబర్13న దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయన పెంపుడు శునకాన్ని కూడా వారు ఎత్తుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసు అధికారుల్లో ఒకరికి వచ్చిన ‘విసిగించే కాల్’ విలువైన సమాచారం ఇచ్చింది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్‌కు వచ్చి, బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్‌గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు.
అది నష్టాల్నే మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలబాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి, జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్ అవతారం ఎత్తిన సురేష్, పలువురు బడా బాబుల్ని కిడ్నాప్ చేసి, భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ప్రతి నేరానికి ముందూ ఓ ముఠా కట్టే సురేష్ ఒకసారి వినియోగించిన అనుచరుడిని మరోసారి వాడడు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్భంధించేవాడు. కొందరినైతే వాహనంలోనే ఉంచుకుని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసేవాడు. తిరుపతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సురేష్ 2006 ఏప్రిల్‌లో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చి హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
ఘరానా కిడ్నాపర్ గౌరు సురేష్ కన్ను జి.కృష్ణంరాజుపై పడింది. బి.సురేష్ కుమార్, ఎ.పరమేష్, కె.శ్రీనివాస్, కె.వెంకన్న, బి.నాగేశ్వరరావులతో ముఠా కట్టాడు. వీరిలో ఇద్దరు సస్పెన్షన్‌లో ఉన్న పోలీసులు. 2006 సెప్టెంబర్ 9న యూసుఫ్‌గూడలోని ఒక లాడ్జిలో గదులు బుక్ చేసుకున్న ఈ గ్యాంగ్ అక్కడే బస చేసింది. మూడు రోజుల పాటు జి.కృష్ణంరాజు కదలికలను నిశితంగా గమనిస్తూ, రెక్కీ చేసింది. ఈ కిడ్నాప్‌కు ముందు సురేష్ టవేరా వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. కిడ్నాప్ తర్వాత కృష్ణంరాజును దాచి ఉంచడానికి జగద్గిరిగుట్ట సమీపంలో ఉన్న ఎల్లమ్మ బండను ఎంచుకున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అక్కడ ఫామ్‌హౌస్ ఉండేది. ఆయన వీకెండ్స్‌లో కుటుంబంతో వెళ్లి అందులో గడిపేవారు. మిగిలిన రోజుల్లో కాపలాదారుడి దగ్గరే ఆ ఫామ్‌హౌస్ తాళాలు ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న సురేష్ రెండు రోజుల కోసం ఫామ్‌హౌస్ ఇస్తే రూ.లక్ష ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. తన యజమానులు వారాంతాల్లో వస్తుండటం, సురేష్ కోరింది బుధ, గురువారాలు కావడంతో ఆ కాపలాదారు అంగీకరించాడు. 2006 సెప్టెంబర్ 13, బుధవారం లాడ్జి నుంచి బయలుదేరిన సురేష్ గ్యాంగ్, వాకింగ్ కోసం బయటకు వచ్చిన కృష్ణంరాజును ఆయన పమేరియన్‌తో సహా కిడ్నాప్ చేసింది. టవేరా వాహనంలో వెళ్తూ మాదాపూర్ ప్రాంతంలో ఆ శునకాన్ని కారు నుంచి బయటకు విసిరేసింది.
టవేరా వాహనాన్ని సురేష్ నేరుగా ఎల్లమ్మబండకు తీసుకువెళ్లాడు. అయితే ఆ రోజు అనుకోకుండా ఫామ్‌హౌస్ యజమాని అక్కడకు రావడంతో కాపలాదారు చేతులెత్తేశాడు. దీంతో సురేష్ తనకు షెల్టర్ ఇచ్చే ఇతర వ్యక్తులు ఎవరనేది ఆలోచించాడు. ఇలా అతడికి గుర్తుకు వచ్చిన పేరే ఇక్బాల్ (పేరు మార్చాం). ఘరానా నేరగాడైన ఇక్బాల్‌తో సురేష్‌కు చంచల్‌గూడ జైలులోనే పరిచయం ఏర్పడింది. నగర పోలీసులకు ఉన్న ఇన్‌ఫార్మర్స్‌లో ఇక్బాల్ కూడా ఒకడు. అతడు వంద ఫోన్లు చేస్తే అందులో 95 మద్యానికి అవసరమైన డబ్బు కోసమే అయుండేది. దీంతో పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో అతడి ఫోన్లు ఎత్తేవాళ్లు కాదు.
ఒకవైపు కృష్ణంరాజు కిడ్నాప్ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ కేసుపై వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సురేష్ తన వద్ద ఉన్న ఫోన్‌కు కేవలం అవసరమైనప్పుడు ఆన్ చేస్తుండటంతో దర్యాప్తు మరింత కష్టసాధ్యమైంది. మరోవైపు ఎల్లమ్మబండలో షెల్టర్ దొరక్కపోవడంతో సురేష్– ఇక్బాల్‌కు అసలు విషయం చెప్పి, రెండు రోజుల కోసం షెల్టర్ కోరాడు. ఈ విషయంపై టాస్క్‌ఫోర్స్‌లో తనకు నమ్మకస్తుడైన అధికారికి ఉప్పందించాలని భావించిన ఇక్బాల్, ఆయనకు వరుసపెట్టి ఫోన్లు చేశాడు. అయితే కృష్ణంరాజు కేసు బిజీలో ఉన్న ఆ అధికారి ఫోన్ కాల్‌ను కట్ చేస్తూ పోయారు.
అయినా పట్టువదలని ఇక్బాల్ పదేపదే కాల్స్ చేస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేశారు.‘సాబ్ సిటీ మే కోయీ కిడ్నాప్ హువా క్యా’ అని ఇక్బాల్ అడగడంతో ఆ అధికారి అప్రమత్తమయ్యారు. సురేష్‌కు ఆశ్రయం ఇస్తానని చెప్పాలని, ఆపై అతడి ముఠాను తమకు పట్టించాలని కోరారు. దీనికి అంగీకరించిన ఇక్బాల్– సురేష్‌కు ఫోన్ చేసి కూకట్‌పల్లి వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఇక్బాల్‌ను రోడ్డు పైన ఉంచిన పోలీసులు కాస్త దూరంలో కాపు కాశారు. సురేష్ టవేరాలో ఇక్బాల్ వద్దకు వచ్చి, అతడినీ ఎక్కించుకుని ఉడాయించేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఇక్బాల్ కొద్దిదూరం వెళ్లాక డ్రైవింగ్ సీటులోకి మారాడు. పాతబస్తీలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇల్లు సిద్ధంగా ఉందని చెప్తూ, వాహనాన్ని సిటీలోకి తీసుకువచ్చాడు.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు నాంపల్లిలోని ఓ హోటల్ అడ్డాగా ఉండేది. అక్కడ ఏ సమయంలో అయినా కొందరు అధికారులు, సిబ్బంది ఉండేవాళ్లు. వేగులతో సమావేశాలను అక్కడే ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇక్బాల్‌కు ఈ విషయం తెలుసు. ఆ హోటల్ సెల్లార్ కేవలం ఓ చిన్న కారు పట్టేంత మాత్రమే ఉండేది. దీనిపై అవగాహన ఉన్న ఇక్బాల్, కారును నేరుగా సదరు హోటల్ సెల్లార్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. హుటాహుటిన సెల్లార్‌లోకి దూసుకువచ్చిన అధికారులు సురేష్ ముఠాను పట్టుకోవడంతో పాటు కృష్ణంరాజును రెస్క్యూ చేశారు. ఇక్బాల్‌ను అభినందించిన పోలీసులు రివార్డు సైతం అందించారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు.