ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..! | Children exposed to war confront a distinct array of adversities | Sakshi
Sakshi News home page

ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..! ప్రతీక్షణం భయం..భయం..

Apr 10 2026 5:22 PM | Updated on Apr 10 2026 5:31 PM

Children exposed to war confront a distinct array of adversities

వారు ఎంచుకున్నది కాదు.. కోరుకున్నది అంతకన్నా కాదు... కానీ భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పట్లేదు. ఇరాన్‌లోని ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్గత అశాంతి కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పిల్లలు, మహిళలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది...

యుద్ధం ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు 340 మంది పిల్లలు యుద్ధ దాడుల్లో మరణించగా, 1,767 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌ నగరంలో ఉన్న షజరే తయీబే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. 

మినాబ్‌ నగరంలో కాకుండా, ఇతర ఐదు వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలపై జరిగిన దాడుల్లో మరో 12 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 7 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నపిల్లలే.

మధ్యప్రాచ్య వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది గర్భిణీ స్త్రీలు యుద్ధ నీడలో ఉన్నారు. సరైన వైద్యం లేక రోడ్లపై, కార్లలో, కిక్కిరిసిన శిబిరాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.

చమురు ధరల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్లు, పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాలో 6 నెలల వరకు ఆలస్యం కావచ్చని యూనిసెఫ్‌ అంచనా వేస్తోంది.

బాంబు దాడులు, తరలింపు ఆదేశాల వల్ల మొత్తం 12 లక్షల మంది పిల్లలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.

ఏ యుద్ధమైనా సరే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. అది ఒక దేశపు సామాజిక పునాదులను, ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అభద్రతా భావం మహిళల జీవితాల్ని ప్రభావితం చేస్తే, యుద్ధం నేర్పిన భయం, ఆకలి, కోల్పోయిన బాల్యం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అది కోట్లాది మంది అమాయకుల కన్నీటి గాథ. 

(చదవండి: అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..! అలా గాలిలోనే..)

Advertisement
 
Advertisement
Advertisement