చికెన్‌- పాలకూర ఫ్రిట్టర్స్‌ ఎలా తయారు చేయాలో తెలుసా?

Chicken Spinach Fritters‌ Special Recipe Making Ingredients - Sakshi

చికెన్‌–పాలకూర ఫ్రిట్టర్స్‌

కావలసినవి:  బోన్‌లెస్‌ చికెన్‌ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని తురుములా చేసుకోవాలి), మొక్కజొన్న పిండి, చిక్కటి పాలు – అరకప్పు చొప్పున, బియ్యప్పిండి – పావు కప్పు, పాలకూర తురుము – 1 కప్పు, పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, టొమాటో గుజ్జు – 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా, గుడ్డు – 1 (అర టేబుల్‌ స్పూన్‌ పాలలో కలిపి పెట్టుకోవాలి.. అభిరుచిని బట్టి).

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, ఉడికించిన చికెన్‌ తురుము వేసుకుని, పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, పాలకూర తురుము వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా చేసుకుని ఓవెన్‌లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత అభిరుచిని బట్టి.. గుడ్డు – పాల మిశ్రమంలో ముంచి, పాన్‌ మీద ఇరువైపులా కొద్దిగా  నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. లేదంటే ఓవెన్‌లో ఉడికించినవి టొమాటో సాస్‌లో తింటే భలే రుచిగా ఉంటాయి.

వాల్‌నట్‌ లడ్డూస్‌
కావలసినవి: శనగపిండి – 2 కప్పులు, వాల్‌నట్స్‌ – ముప్పావు కప్పు (నేతిలో దొరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి), పంచదార పొడి –1 కప్పు, నెయ్యి – 1 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్‌, నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌లో నెయ్యి వేసుకుని అందులో శనగపిండి వేసుకుని తిప్పుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత నీళ్లు పోసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వాల్‌నట్స్‌ పౌడర్, పంచదార పొడి, యాలకుల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. పొడిపొడిగా మారి, దగ్గర పడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. ఆ మిశ్రమం చల్లారనివ్వాలి. అనంతరం లడ్డూల్లా చేసుకోవాలి. అభిరుచిని బట్టి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

కోకోనట్‌–రైస్‌ ఇడ్లీ
కావలసినవి:  కొబ్బరి కోరు, అన్నం – అర కప్పు చొప్పున, బెల్లం కోరు – పావు కప్పు (అభిరుచిని బట్టి), అరటిపండ్లు – 2, నెయ్యి – (ఇడ్లీ ప్లేట్స్‌కి అప్లై చేసుకునేందుకు సరిపడా)

తయారీ: ముందుగా మిక్సీ బౌల్‌లో అన్నం, కొబ్బరికోరు, బెల్లం కోరు (అభిరుచిని బట్టి) అరటిపండు ముక్కలు వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–కొబ్బరికోరు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని పది లేదా పన్నెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. బెల్లం కోరు వెయ్యకుంటే చేసుకున్న ఇడ్లీలైతే.. సాంబార్‌లో భలే రుచిగా ఉంటాయి.

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top