Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు

Carnatic Vocal concert by Vijayalakshmy Subramaniam - Sakshi

ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్‌. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్‌లవుతున్నాయి. తీయని కృతులు షుగర్‌ లెవెల్స్‌ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్‌ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్‌... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు.

ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు.
 
► తంజావూరు సరస్వతి మహల్‌
‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్‌ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్‌ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి.

నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది.

సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్‌ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్‌ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది.  

► మతిమరపు దూరం
మ్యూజిక్‌ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్‌ ఆఫీసర్‌ మూడు వందలకు పైగా డయాబెటిస్‌తో ఇన్సులిన్‌ తీసుకునేవాడు. మ్యూజిక్‌ థెరపీతో ఇన్సులిన్‌ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం.

నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్‌ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్‌ చేసి ఇస్తాం. పేషెంట్‌ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్‌ థెరపీని డిజైన్‌ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు.

కాంప్లిమెంటరీ మెడిసిన్‌గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్‌ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్‌ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్‌ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్‌నెస్‌ టూ వెల్‌నెస్‌ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం.

రాగాల చికిత్స
సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్‌ మ్యూజిక్‌ థెరపీ అసోసియేషన్‌ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్‌ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్‌ యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్‌ చిల్డ్రన్‌కి మ్యూజిక్‌ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్‌లకు మెరుగైన ఫలితాన్ని చూశాను.
– ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్,
హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్‌ కాలేజ్, మంగళూరు, కర్ణాటక

– జనరల్‌ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ

– వాకా మంజులారెడ్డి.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top