కాకరకాయ కూర తరచూ తింటే చక్కెర అదుపులోకి వస్తుందా? 

Bitter Gourd Curry Will Control Diabetes - Sakshi

చక్కెరవ్యాధి ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటూ ఉండటంగానీ లేదా రోజూ కాకరను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల... చక్కెర అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. ఇది ఒకరకంగా అపోహ లేదా పాక్షిక సత్యం మాత్రమే అని చెప్పవచ్చు. నిజానికి కాకరలో ఉండే రెండు ప్రధాన పోషకాలైన ‘కరాటిన్‌’, ‘మమోర్డిసిన్‌’లకు రక్తంలోని చక్కెరపాళ్లను కొంతవరకు తగ్గించే సామర్థ్యం ఉన్నమాట వాస్తవమే.

అలాగే కాకర గింజలలో పాలీపెపై్టడ్‌–పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం కూడా ఉంటుంది. అది కూడా ఇన్సులిన్‌లాగా ప్రవర్తించి కొంతవరకు చక్కెరపాళ్లను అదుపు చేస్తుంది. అయితే... ఒకసారి డయాబెటిస్‌ వ్యాధి వచ్చిదంటే... అది కేవలం కాకరకాయ తినడం వల్ల మాత్రమే అదుపులో ఉండడమన్నది జరగదు. డయాబెటిస్‌ రోగులు కాకరకాయ కూర తింటున్నా చక్కెరను నియంత్రించే మందులు తీసుకోవాల్సిందే. కాకపోతే కాకరలో ఇంకా అద్భుతమైన గుణాలున్నాయి. ఆరోగ్యాన్ని సమకూర్చి పెట్టే కాకరలో పోషకాలు చాలా ఎక్కువ.

పీచు పుష్కలం.  క్యాలరీలు చాలా తక్కువ. పోషకాల విషయానికి వస్తే విటమిన్‌ బి1, బి2, బి3, సి లతో పాటు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఫైబర్‌తో పాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. కాకర గింజలు కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి.

అలా గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. సి విటమిన్‌ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కావడంతో అది దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆ ప్రక్రియతో మాలిగ్నంట్‌ కణాల (క్యాన్సర్‌ కారక కణాలు) తొలగిపోయి... క్యాన్సర్లు నివారితమవుతాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది.

చదవండి : కరోనా వచ్చిన తర్వాత నిద్రలేమా?.. ఇలా చేయండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top