నిత్యం జరిగే ట్రాఫిక్ చెకింగ్ కాస్తా, ఒక బైకర్ సమయస్ఫూర్తితో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బిజీగా ఉన్న ఒక రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని వాహనదారులను ఆపుతున్నారు. ఒక బైకర్ హెల్మెట్ లేకుండా దొరికిపోయాడు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో జరిమానా కట్టడమో, వాదించడమో జరుగుతుంది. కానీ, ఈ యువకుడు మాత్రం కొత్తగా ఆలోచించాడు. వెంటనే తన ఫోన్ తీసి బ్లింకిట్ యాప్ ద్వారా ఒక హెల్మెట్‌ని ఆర్డర్ పెట్టాడు. కేవలం కొద్ది నిమిషాల్లోనే డెలివరీ ఎగ్జిక్యూటివ్, పోలీసులు తనిఖీ చేస్తున్న అదే ప్రాంతానికి వచ్చి హెల్మెట్ బాక్స్‌ని అందించాడు.
అందరూ చూస్తుండగానే హెల్మెట్‌ని ధరించి పోలీసుల ముందు నిలబడ్డాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. భారతీయుల తెలివితేటలకు, సమయస్ఫూర్తికి ఇది నిదర్శనమని కొందరు మెచ్చుకోగా, జరిమానా నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప, భద్రత పట్ల బాధ్యత లేదని కొందరు విమర్శిస్తున్నారు. ప్రయాణం మొదట్లోనే హెల్మెట్ పెట్టుకోవాలి కానీ, దొరికిపోయినప్పుడు కొనుక్కోవడం వల్ల ప్రయోజనం లేదని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదు, ప్రాణ రక్షణ కోసం అని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు నిమిషాల్లో డెలివరీ చేసిన కంపెనీ సేవలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


