
వయసు పెరిగే కొద్ది ముఖానికి మరింత సంరక్షణ తప్పనిసరి అంటారు సౌందర్య నిపుణులు. అందుకు చాలామంది సాధారణ ఫేషియల్ క్లీనర్‌లు, మాన్యువల్ బ్రష్‌లనే ఎంచుకుంటారు. అయితే, తక్కువ ఖర్చులో మంచి ఫలితాన్ని పొందాలనుకునే వారికి ఈ సిలికాన్ ఫేషియల్ క్లీనర్ చక్కగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని మరింత లోతుగా శుభ్రం చేయడానికి, మసాజ్ చేయడానికి సహాయపడుతుంది. ముఖంపై పేరుకుపోయిన మురికిని, మేకప్‌ను, నల్లమచ్చలను ఇట్టే తొలగిస్తుంది.
ఈ క్లీనర్ చాలా సున్నితమైన సిలికాన్ కుచ్చులతో రూపొందింది. అవి చర్మాన్ని సుతారంగా శుభ్రం చేసి, ముఖాన్ని సుమనోహరంగా మెరిపిస్తాయి. ఈ బ్రష్ క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్, మసాజ్, బ్లాక్‌హెడ్ తొలగింపు వంటి నాలుగు రకాల పనులకు ఉపయోగపడుతుంది. చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించి, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
ఇది సులభంగా పట్టుకుని, ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. దీన్ని తేలికగా వేలికి తొడుక్కుని సులభంగా వాడుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. దీంతో శుభ్రపరచుకోవడం కూడా తేలికే! ఇది రెండు వందల రూపాయల నుంచి ఆన్‌లైన్‌లో లభిస్తుంది. చాలా రంగుల్లో దొరుకుతున్నాయి.
చిరునవ్వు మెరిసేలా!
పంటి సమస్యలను పరిష్కరించడానికి అనేక రకాలుగా దంత చికిత్సలుంటాయి. అయితే వాటిలో సాధారణ చికిత్స– జనరల్ చెకప్ స్కేలింగ్. రోజుల తరబడి దంతాలపై పేరుకుపోయిన గారలను పోగొట్టే పద్ధతి ఇది. దంతాలపై ఏర్పడే బ్యాక్టీరియాతో కూడిన జిగురు లాంటి, రంగులేని పొరను బ్రష్‌తో సరిగ్గా క్లీన్ చేయలేప్పుడు, అది పుచ్చిపోవడం లేదా చిగుళ్ల వ్యాధికి దారి తీయడం మనకు తెలిసిందే!
అలా పసుపు, గోధుమ రంగులో మారిన గారను.. డెంటల్ హైజీనిస్ట్ అల్ట్రాసోనిక్ స్కేలర్ అనే ప్రత్యేకమైన పరికరంతో శుభ్రపరుస్తారు. పంటి ఉపరితలంపై, చిగుళ్ల ఇరుకుల్లో గారను తొలగించే ఈ ప్రక్రియ– సాధారణంగా నొప్పి లేకుండానే జరుగుతుంది. ఈ స్కేలింగ్ చికిత్స తర్వాత, దంతాల ఉపరితలాన్ని నునుపుగా చేయడానికి పాలిష్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ప్లాక్ సులభంగా పళ్లను అంటుకోకుండా ఉంటుంది. ఈ చికిత్స చేయించుకోవడంతో పళ్లు త్వరగా పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు)