
ప్రపంచంలోని కొన్నిచోట్ల ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రమైన వింత భవంతులు పుట్టుకొస్తున్నాయి. వాస్తుకళా నైపుణ్యానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేసి నిర్మించిన ఈ అద్భుత భవంతులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో కొన్నింటి విశేషాలను తెలుసుకుందాం.
ది డ్యాన్సింగ్ హౌస్
ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉంది. ఈ భవనం 1996లో పూర్తయింది. దీని ఆకృతి డ్యాన్స్ చేస్తున్న జంటను పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని మొదట్లో ‘జింజర్ అండ్ ఫ్రెడ్‘ అని పిలిచేవారు. ఆ పేరు ప్రముఖ డ్యాన్సర్లు జింజర్ రోజర్స్, ఫ్రెడ్ ఆస్టైర్‌ల పేర్ల నుంచి వచ్చింది. ఇది ఒక కార్యాలయ భవనం. అయితే, దీని పై అంతస్తులో ఒక రెస్టరెంట్ ఉంటుంది. ఆ రెస్టరెంట్‌లో కూర్చుని భోంచేస్తూ, ప్రేగ్ నగర అందాలను తిలకించడం మరపురాని అనుభూతిగా ఉంటుంది.
ది వేవ్ బిల్డింగ్
ఇది డెన్మార్క్‌లోని వెజ్లే నగరంలో ఉంది. దీనిని హెన్నింగ్ లార్సెన్ ఆర్కిటెక్ట్స్ సంస్థ డిజైన్ చేసింది. పేరుకు తగ్గట్టుగానే, ఇది వెజ్లే నౌకాశ్రయం పక్కన, సముద్ర కెరటాల ఆకారంలో ఉంటుంది. దీని నిర్మాణం 2009లో మొదలైంది. ఇది రెండు దశల్లో పూర్తయింది.
మొదట ఒక వైపు నిర్మాణం పూర్తయిన తర్వాత, 2018లో రెండవ వైపు నిర్మాణం కూడా పూర్తయింది. వేవ్ బిల్డింగ్‌లో మొత్తం 140 అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఈ భవనం తన డిజైన్, లైటింగ్‌తో ఆ ప్రాంతానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రిపూట ఈ భవనం విద్యుత్ కాంతులతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ భవనం డిజైనింగ్ నైపుణ్యానికి అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.
ఎలిఫెంట్ బిల్డింగ్
ఇది థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఉంది. దీని నిర్మాణం 1997లో పూర్తయింది. థాయ్ ఆర్కిటెక్ట్ ఒంగ్–అర్డ్ సత్రాబంధు, ఇంజినీర్ డాక్టర్ అరుణ్ చైసెరితో కలిసి దీనిని రూపొందించారు. ఈ భవనం మూడు టవర్లను కలిగి ఉంటుంది, ఇవి ఏనుగు కాళ్లు, తొండంలా కనిపిస్తాయి. దీనికి ఏనుగు చెవులు, కళ్లు, దంతాలలాంటి డిజైన్ కూడా ఉంది.
ఇది కేవలం ఒక ఆకర్షణీయమైన కట్టడం మాత్రమే కాదు, ఇందులో నివాసయోగ్యమైన అపార్ట్‌మెంట్‌లు, కార్యాలయాలు, షాపింగ్ సెంటర్లు, బ్యాంక్, పోస్టాఫీసు వంటివి చాలానే ఉన్నాయి. ఏనుగు థాయ్‌లాండ్ జాతీయ జంతువు కావడంతో ఈ భవనం థాయ్ జాతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్ర, విలక్షణ భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
క్రాస్ టవర్స్
ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉంది. ఈ భవనాన్ని డానిష్ ఆర్కిటెక్ట్ సంస్థ బ్యార్కే ఇంగెల్స్ గ్రూప్ 2012లో డిజైన్ చేసింది. రెండు వేర్వేరు టవర్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా, వాటి మధ్యలోని కొన్ని గదులు ఒకదానితో ఒకటి కలిసేలా డిజైన్ చేశారు.
ఇది బయట నుంచి చూడటానికి హ్యాష్‌ట్యాగ్‌లా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాష్‌ట్యాగ్ టవర్స్’ అని కూడా అంటారు. గాలి, సూర్యరశ్మి భవనంలోకి ధారాళంగా వెళ్లేలా దీన్ని నిర్మించారు. దాంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇందులో పలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, నివాసయోగ్యమైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
జిగ్‌జాగ్ టవర్స్
ఇది ఖతార్ రాజధాని దోహాలో ఉంది. ఈ టవర్స్‌ను 2009లో నిర్మించారు. ఈ టవర్స్ రూపకల్పన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవనం నిర్మాణం బయట నుంచి చూస్తే జిగ్‌జాగ్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, వివిధ రకాల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఈ రెండు టవర్స్‌లో మొత్తం 748 లగ్జరీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి.
లాంగాబెర్గర్ బిల్డింగ్
ఇది అమెరికాలోని ఒహాయోలో ఉంది. ఈ భవనం లాంగాబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం. ఈ కంపెనీ చేతితో తయారు చేసే చెక్క బుట్టలకు ప్రసిద్ధి చెందింది. తమ ప్రత్యేకతకు గుర్తుగా వారు తమ ప్రధాన కార్యాలయాన్ని ఒక పెద్ద బుట్ట ఆకారంలో 1997లో నిర్మించారు. ఇది నిజంగానే చూడటానికి బుట్టలా కనిపిస్తుంది. ఈ భవనం సుమారు 192 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 79 అడుగుల ఎత్తుతో ఉంటుంది. లాంగాబెర్గర్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత, ఈ భవనాన్ని 2018లో అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది, కాని, దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ఇది ఇప్పటికీ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.
సంహిత నిమ్మన