చిరుత దళం; వాళ్లు చంపాలని.. వీరు కాపాడాలని!

All women team of forest guards in Surat rescues and tags leopard - Sakshi

చిరుతపులిని రక్షించాలా? మనిషినా?
ఏ ప్రాణమూ తక్కువ విలువైనది కాదు అంటారు ఈ ఏడుగురు. అడవి నుంచి ఊళ్లలోకి వచ్చే చిరుతలను పట్టి మళ్లీ అడవిలో వదలడానికి సూరత్‌ సమీపాన ఉండే మాండ్వి అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళా దళం పని చేస్తోంది. ఏడుగురు ఉండే ఈ దళం అడవిలోని చిరుతలకు రక్షకులు. కొత్త చిరుత కనిపిస్తే పట్టుకుని వాటికి ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ ట్యాగ్స్‌ను అమర్చడం కూడా వీరి పనే. కాంక్రీట్‌ అరణ్యంలో తిరగడానికి జంకే కొందరు స్త్రీలు ఉన్న రోజుల్లో కీకారణ్యంలో ధైర్యంగా తిరుగుతూ స్ఫూర్తినిస్తున్నారు వీరు.

విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు

ప్రభుత్వం చిరుతలను అదుపు చేయడానికి చేయవలసిందంతా చేస్తోంది. ఒక్క అడవులను తెగ నరకడాన్ని సమర్ధంగా ఆపు చేయడం తప్ప. సూరత్‌ (గుజరాత్‌) జిల్లాలోని మాండ్వి అంటే భిల్లుల సామ్రాజ్యం. అటవీ ప్రాంతం. భిల్లులు, అడవి మృగాలు కలిసి జీవించిన ప్రాంతం అది ఒకప్పుడు. ఇప్పుడు అరా కొరా అడవి మిగిలింది. వాటిలోని చిరుతలు ఏం చేయాలో తెలియక ఊళ్ల మీద పడుతున్నాయి. మాండ్వి అడవిని ఒరుసుకుంటూ పారే తాపి నది ఒడ్డున ఉన్న పల్లెల్లో ఒకప్పుడు కోళ్లు, గొర్రెలు, పశువులు పెంచేవారు. ఇప్పుడు మానేశారు చిరుతల దెబ్బకు.

ఒక ఊరిలో కుక్కలు మాయమయ్యాయంటే చిరుతలు తరచూ దాడి చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించిన నెమళ్లు, కోతులు, కుక్కలు అన్నీ పారిపోయాయి. మాండ్వి అడవిలో దాదాపు 50 చిరుతలు ఉన్నట్టు అంచనా. ప్రభుత్వానికి వాటిని కాపాడటం ఎంత అవసరమో మనుషుల్ని కాపాడటం కూడా అంతే అవసరం. మృగానికి మనిషికి మధ్య తకరారు వచ్చినప్పుడల్లా ఫారెస్ట్‌ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. అయితే చిరుత దాడి వల్ల మనిషినో, పశువునో కోల్పోయిన గ్రామస్తులు చాలా కోపంగా ఉంటారు. చిరుతను కొట్టి చంపాలని చూస్తారు.

ఆ సమయంలో మగ ఫారెస్ట్‌ సిబ్బంది మాట వినరు. కాని మహిళా సిబ్బంది అయితే నచ్చ చెప్పే అవకాశం ఎక్కువ. అందుకే ఫారెస్ట్‌ ఆఫీసర్లు ఏడుగురు మహిళలతో చిరుత దళాన్ని ఏర్పాటు చేశారు. మాండ్వి ప్రాంతంలో చిరుతను పట్టుకోవాలన్నా, దూరంగా తీసుకెళ్లాలన్నా, దాడుల నుంచి కాపాడాలన్నా, వాటిని పట్టి వాటి కదలికల్ని తెలియచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్‌ అమర్చాలన్నా అదంతా ఈ ఏడుగురు మహిళా సిబ్బంది పనే. స్థానిక సమూహాల నుంచి ఈ మహిళా సిబ్బందిని తీసుకోవడం వల్ల వారికి అడవి తెలుసు. మచ్చల ఒంటితో హఠాత్తుగా ఊడి పడే చిరుతా తెలుసు. వారు భయపడరు.

‘గత సంవత్సర కాలంలో మేము 22 చిరుతలను పట్టుకుని వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్‌ అమర్చాము’ అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజా సింగ్‌. ‘ఇంకా కనీసం 20 లేదా 30 చిరుతలకు ఈ పని చేయాల్సి ఉంది. కాని చిరుతలు అంత సులువుగా దొరకవు. బోన్‌లో పడవు. వాటి కోసం వేచి ఉండాలి. అదే సమయంలో అవి ఉత్త పుణ్యానికి దాడి చేయవు’ అంటారు ఈ చిరుత దళ సభ్యులు. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంటారు ఈ సిబ్బంది. కాని అన్నిసార్లు పరిస్థితి ఇంత సులువుగా ఉండదు.

విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు

మధార్‌కుయి గ్రామంలో చిరుత దాడి చేసి ఒక నాలుగేళ్ల పాపాయిని చంపేసింది. గ్రామస్తులు అగ్గి మీద గుగ్గిలం అయ్యి చిరుత వెంట పడ్డారు. అది ఊళ్లోనే నక్కింది. చిరుత దళానికి కబురు అందింది. వీరు ఆఘమేఘాల మీద చేరుకున్నారు. గ్రామస్తులు ఆ చిరుతను చంపాలని. వీరు కాపాడాలని. ‘చివరకు గాలిలో కాల్పులు జరిపి చిరుతను ప్రాణాలతో పట్టుకున్నాం. లోపలి అడవిలో దానిని వదిలిపెట్టాం’ అన్నారు ఆ దళ సభ్యులు.

మాండ్వి అడవంచు పల్లెల్లో చెరకు పంట వేస్తారు. పెరిగిన చెరకు పంట చిరుతలకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. కనుక దాడి చేస్తాయి. మరోవైపు అడవిలో ఆహారం దొరక్కపోవడం, వేసవిలో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల కూడా ఊళ్ల మీదకు వస్తాయి. ‘వేసవిలో అవి నీరు తాగే చోటుకు నీరు చేర వేసి ఆ కుంటలు నిండుగా ఉండేలా చూస్తాం’ అంటారు చిరుత దళ సిబ్బంది. వీరు చిరుతలను కాపాడటమే కాదు ఉచ్చుల్లో చిక్కుకున్న అటవీ మృగాలను, గాయపడ్డ పక్షులను కూడా కాపాడుతుంటారు. చిరుతల కోసం ఇలా ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పని చేయడం ఈ కాలంలో స్ఫూర్తినిస్తున్న గొప్ప విశేషం. స్త్రీల చేతుల్లో అడవి క్షేమంగా ఉంటుంది అనడానికి మరో నిదర్శనం.
 
‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top