
రాజస్థాన్ విలాసవంతమైన పెళ్ళిళ్లకు పెట్టింది పేరు. తాజాగా జోధ్‌పూర్‌లో జరిగిన ఒక రాయల్ వెడ్డింగ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతదేశ సంప్రదాయాలను గౌరవిస్తూ జోధ్‌పూర్‌ను ఎంచుకునీ మరి ఒక జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వీరు ఏఇండియన్ సెలబ్రటీలోఅనుకుంటే పొరబాటే. వీరు నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన ఒక విదేశీ జంట. బారాత్‌నుంచి వధువు నుదిటిన తిలకం దిద్దడంవరకు ప్రతీ కార్యక్రమాన్ని అత్యంత సాంప్రదాయ బద్దంగా జరిపించుకోవడం విశేషం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవాల్సిందే.
హిందూ ఆచారాలపై ప్రేమతో 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, 27 ఏళ్ల వధువు అన్హెలినా భారతీయ ఆచారాలను స్వీకరించి, సప్తపధిని పాటించారు. వీరివురూ ఉక్రెయిన్‌కు చెందిన వారు. జైపూర్, ఉదయపూర్, జోధ్‌పూర్ వేదికలను పరిశీలించి చివరికి జోథ్‌పుర్‌లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది.
జోధ్‌పూర్ ఎందుకు?
రాజస్థాన్ చరిత్ర, జోధ్‌పూర్ నగర వైభవం, సాంస్కృతిక వారసత్వం , ఐకానిక్ మెహ్రాన్‌గఢ్ కోట, వారసత్వ ప్రదేశాలు ,ఉత్సాహభరితమైన మార్కెట్లు తదిరరాజ నేపథ్యం వారిని ఆకర్షించింది. ఈ వివాహ సమన్వయ కర్తలు రోహిత్, దీపక్ మాట్లాడుతూ, వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు ఆకర్షితురాలైందని ప్రతి ఆచారాన్ని ప్రామాణికతతో గౌరవించాలని పట్టుబట్టారని వివరించారు.
సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులు
వధూవరులిద్దరూ భారతీయ దుస్తులు ధరించి, వివాహ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయారు, సాంప్రదాయ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. వరుడు రాజ షేర్వాణి, రత్నాలు పొదిగిన కాషాయ తలపాగాతో గుర్రంపై రావడంతో వివాహ వేడుకలు ప్రారంభమైనాయి. జోధ్‌పూర్‌లోని సుందరమైన ఖాస్ బాగ్‌లో సాంప్రదాయ టికా వేడుక అతన్ని స్వాగతించింది. ఆపై దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల నడుమ, జంటను పవిత్ర హోమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్టానిస్లావ్ అన్హెలినా మెడలో మంగళ సూత్ర ధారణ చేశాడు. ఆమె నుదిటిపై సింధూరం దిద్ది వారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు.