ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, తణుకు డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోందని శాసనమండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిడ్నీ ఆరోగ్య సమస్య కారణాలపై విశ్లేషణ చేసి, నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఉద్యాన పంటలకు బీమా సౌకర్యంపై రైతులకు అవగాహన కలి గించి, బీమా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీ సుకోవాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో తన పదవీ కాలంలో రూ.130 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. వ్యవసాయ, ఉ ద్యాన, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, ఇరిగేషన్, గృహనిర్మాణం తదితర శాఖల ప్రగతిని సమీక్షించారు. పలువురు జెడ్పీటీసీలు తమకు గౌ రవ వేతనాలు అందలేదని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం జెడ్పీటీసీలను సత్కరించి మెమెంటోలు అందజేశారు. ముందుగా మాజీ మంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఆకివీడు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే తాను జెడ్పీటీసీ స భ్యుడిని అయ్యానని ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకట్రాజు (యండగండి శ్రీను) అన్నారు. ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఏలూరులోని జెడ్పీ సమావేశ హాలులో జరిగింది. సమావేశంలో తను మాట్లాడిన విషయాల్ని ఆకివీడులో ఆయన విలేకరులకు తెలియజేశారు. జిల్లాపరిషత్ ఆఖరి సమావేశంలో శ్రీను మాట్లాడుతూ జగన్ ప్రోత్సాహంతోనే తాను జెడ్పీటీసీగా గెలుపొందానన్నారు. ఐదేళ్ల పాటు జెడ్పీటీసీ హోదాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని మండలంలో నిర్వహించానన్నారు. ఆ ఖరి సమావేశంలో జగన్‌ను తలుచుకోవడం ఆ నందంగా ఉందని, జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న వ్యక్తి జగన్‌ను స్మరించుకోకపోవడం విచారకరమన్నారు. ఐదేళ్లూ తనకు సహకరించిన ఉద్యో గులు, సిబ్బంది, జెడ్పీటీసీ సభ్యులకు కృత జ్ఞతలు చెప్పిన జెడ్పీ చైర్‌పర్సన్‌ను వైఎస్ జ గన్‌కు కృతజ్ఞతలు చెప్పకపోవడం దారుణమన్నారు. జగన్ వల్లే ఆమె చైర్‌పర్సన్ అయిన వి షయాన్ని మరిచిపోవడం విచారకరమని యండగండి శ్రీను అన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047– ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్ అనే అంశంపై నేషనల్ సైన్స్ సెమినార్ నిర్వహించనున్నట్టు జిల్లా సైన్స్ అధికారి ఎస్‌వీఎస్ సోమయాజులు ప్రకటనలో తెలిపారు. బుధవారం పాఠశాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులను గురువారం మండల స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులను 18న ఏలూరు ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. అక్కడి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.
హనుమాన్ జంక్షన్ రూరల్: 16వ నంబర్ జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి నూజివీడు కోర్టులో ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే 2022లో కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదకి చెందిన గొడవర్తి శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తూ బాపులపాడు మండలం వీరవల్లి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అతని తల్లి లక్ష్మి వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందగా, భార్య కీర్తన, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ కేసులో నూజివీడులోని జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీ ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శివ పార్వతి తీర్పు వెలువరించారు. ముద్దాయి శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.


