యూరియా.. లేదయా! | - | Sakshi
Sakshi News home page

యూరియా.. లేదయా!

Sep 17 2026 1:02 AM | Updated on Sep 17 2026 1:02 AM

యూరియా లేక ఇబ్బంది

ముంపు పేరుతో ఆపితే ఎలా?

ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిలిపివేతతో అవస్థలు

ఎరువుల కొరతతో రైతుల సతమతం

ముంపు మండలాల్లో మిర్చి సాగు ప్రశ్నార్థకం

కుక్కునూరు: మిర్చి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న వేళ యూరియా కొరత ఆందోళనకు గురిచేస్తోంది. పంట సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుని, నారు పెంచుకుంటున్నా.. అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో జిల్లా లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మిర్చి సాగుపై అనిశ్చితి నెలకొంది. సీజన్‌ ప్రారంభంలో పత్తి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు మూడు బస్తాల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో యూరియాను అందించింది. అయితే అనంతరం ముంపు భూములకు పరిహారం అందించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియను నిలిపివేయడంతో తాజాగా మిర్చి సాగుకు సిద్ధమవుతున్న రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంది.

మిర్చి వైపు మొగ్గు

వర్షాభావ పరిస్థితులు, పత్తికి గిట్టుబాటు ధరపై నెలకొన్న అనిశ్చితి, గోదావరి వరదల ప్రభావం తదితర కారణాలతో ఈ ఏడాది పలువురు రైతులు మిర్చి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పొలాలను సిద్ధం చేసుకుని నారు వేసుకుంటున్నారు. అయితే సాగు ప్రారంభ దశలోనే యూరియా అందుబాటులో లేకపోవడం కలవరపెడుతోంది. పత్తితో పోలిస్తే మిర్చి పంటకు అధిక మోతాదులో ఎరువులు అవసరమవుతాయని, సాధారణంగా ఎకరాకు సుమారు 6 నుంచి 10 బస్తాల వరకు యూరియా వినియోగించాలని రైతులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో యూరియా అందకపోతే పంట సాగు, దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఆన్‌లైన్‌ కాదు.. సాగు ఆధారంగా ఇవ్వాలి

ముంపు ప్రాంత రైతుల పరిస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని, సాగు విస్తీర్ణాన్ని పరిశీలించి ఆన్‌లైన్‌ పరిమితులు లేకుండా ఆధార్‌ ఆధారంగా అవసరమైన మేరకు యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు. పరిహారం అందిందన్న కారణంతో సాగు చేస్తున్న భూములకు ఎరువులు అందకుండా చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

యూరియా అందుబాటులో లేక కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసిత రైతుల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని అవసరమైన మేరకు యూరియాను అందించి ఆదుకోవాలి.

– షేక్‌ అజిత్‌, మిర్చి రైతు, కుక్కునూరు

పరిహారం చెల్లించారన్న కారణంతో ముంపు భూముల్లో సాగు చేస్తున్న రైతులకు యూరియా అందించకపోతే వ్యవసాయం సాగేదెలా? ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని ఆధార్‌ ఆధారంగా అవసరమైన యూరియా అందించాలి.

– మాచర్ల శ్రీను, మిర్చి రైతు, కుక్కునూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement