ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Aug 18 2026 7:28 AM | Updated on Aug 18 2026 7:28 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య ఇంటికి తిరిగి వస్తుండగా.. అనంత లోకాలకు జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య బాలికల అదృశ్యంపై కేసు నమోదు మరుగుదొడ్డి నిర్మాణంపై వివాదం

ముసునూరు: తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. గోపవరం గ్రామానికి చెందిన డాలు రవితేజ (19) ఏలూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థి. గత రెండు నెలలుగా కాలేజీకి వెళ్లకపోవడంతో కాలేజీకి వెళ్ళి సక్రమంగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రవితేజ తల్లిదండ్రులు తమ వాటర్‌ ప్లాంట్‌కు వెళ్లిన సమయంలో తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు.

దెందులూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు (55) ఆదివారం ఏలూరులో పని ఉండి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా గాలాయగూడెం పతాంజలి పామాయిల్‌ ఆఫీస్‌ వద్ద అతివేగంగా నిర్లక్ష్యంగా వస్తున్న మరొక ద్విచక్ర వాహనం వెంకటేశ్వరరావు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడ్ని 108 వాహనంలో ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

పెదవేగి: జీవితంపై విరక్తి చెంది పురుగుమందును ఇంజెక్షన్‌ ద్వారా శరీరంలోకి ఎక్కించుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన శ్రీకాకుళం వెంకటేశ్వరరావు (37) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2022 నుంచి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన, వంగాయగూడెం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 16న ఆటోలో ఇంటి నుంచి బయటికి వెళ్లగా, లక్ష్మీపురం వద్ద పోలవరం కుడికాలువ కట్టపై గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, చనిపోవాలన్న ఉద్దేశంతోనే పురుగుమందును ఇంజెక్షన్‌ ద్వారా శరీరంలోకి ఎక్కించుకున్నట్లు వెంకటేశ్వరరావు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ సోమవారం ఆసుపత్రిలో మృతి చెందారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఉండి: స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి బ్యాగులు తగిలించుకుని ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు బడికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఉండి జగనన్న కాలనీ, కొండ్రోతుపేటకు చెందిన ఇద్దరు బాలికలు పదోతరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి బ్యాగులు వేసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. కొంతసేపటికి మీ పిల్లలు ఈరోజు స్కూల్‌కు ఎందుకు రాలేదు? అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం) బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో లబోదిబోమంటూ తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకుని ఆరా తీశారు. పాఠశాల గేటు వరకు వచ్చిన విద్యార్థినులు లోపలికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లిపోయారనే విషయం తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో ఉండి పోలీసులను ఆశ్రయించారు. ఓ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, దాతల ఆర్థిక సహకారంతో గిరి ప్రదక్షిణ మార్గంలో చేపట్టిన మరుగుదొడ్డి నిర్మాణం వివాదానికి దారితీసింది. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఈ నిర్మాణం చేపట్టడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి అనుమతి లేకుండా, అనధికారికంగా ముత్యాలమ్మ విగ్రహం వద్ద సోమవారం శంకుస్థాపన చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్మాణాన్ని వేరే ప్రాంతంలో చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ వివాదంపై ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ అల్లూరి రామకృష్ణ స్పందిస్తూ.. ఆలయాభివృద్ధికి సహకరించే దాతలను ఎల్లప్పుడూ గౌరవిస్తామని తెలిపారు. అయితే, కమిటీ స్థలాన్ని ఖరారు చేయకుండా దాతలు ఇష్టానుసారంగా నిర్మాణం చేపట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement