మార్క్‌ఫెడ్ ద్వారా కొనాలి
కనీసం రూ.300 ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఈ ఏడాది వర్జీనియా పొగాకు రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పొరుగు రాష్ట్రంలో మంచి ధర ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం కనీస గిట్టుబాటు ధర లేకపోవడంపై రైతులు గత మూడు నెలలుగా విభిన్న రూపాల్లో పోరు సాగిస్తున్నా సర్కారు మాత్రం స్పందించడం లేదు. గతేడాది సరాసరి కిలో రూ.300 పలికిన ధర ప్రస్తుతం రూ.243కు చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు పొగాకు కొనుగోలు కేంద్రాల పరిధిలో భారీగా సాగు చేస్తున్నారు.
పొగాకు రైతు ఈ ఏడాది ఆర్థికంగా నష్టపోయాడు. ఒకవైపు ధరలు భారీగా పతనం కావడం, మరోవైపు పెట్టుబడులు ఆకాశన్నంటడంతో లక్షల్లో అప్పులు పేరుకుపోయాయి. మరోవైపు సర్కారు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఏడాది దేవరపల్లి, జంగారెడ్డిగూడెం 1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో మార్చి 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటిరోజే ధర భారీగా తగ్గించి కిలో సగటున రూ.261తో కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్నాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. సరాసరి కిలో ధర రూ.320కు అక్కడ జరిగాయి. ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలో జిల్లాలో 22,194 హెక్టార్ల పరిధిలో పొగాకు సాగు జరుగుతుంది. తేలిక నేలలు కావడంతో కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉన్న పరివాహక ప్రాంతం ఉండటంతో గాలిలో అతి స్వల్పంగా తేమ శాతం ఉండటం సాగుకు పూర్తి అనుకూలం. దీంతో జిల్లాలో నాణ్యమైన గ్రేడ్–1 పొగాకు దిగుబడి అధికంగా ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో సగటు సరాసరి రూ.300 ధర దాటితే పెట్టుబడులకు ఇబ్బంది ఉండదనేది అన్నదాతల భావన. సీజన్ ప్రారంభమయ్యాక కిలో రూ.45 తగ్గించి కొనుగోలు చేయడంతో మొదలుపెట్టారు. 100 రోజులు దాటినా అదే రీతిలో కొనుగోళ్లు సాగిస్తున్నారు. కర్నాటక కొనుగోళ్లు ముగిసిన తరువాత కొంత డిమాండ్ వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. దీంతో పోరుబాటకు సన్నద్ధమయ్యారు. బుధవారం 5 ప్లాట్‌ఫాంల పరిధిలో 2,452 బేళ్ళు అంటే 3,19,286 కిలోల పొగాకును సరాసరి 243.63 ధరకు కొనుగోలు చేశారు. 5 ప్లాట్‌ఫామ్ పరిధిలో ఇప్పటి వరకు 98.25 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేశారు.
కూటమి ప్రభుత్వంలో కష్టాలు
ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో వర్షాభావ పరిస్థితులు, విపరీతంగా పెరిగిన సాగు ఖర్చులకు తోడు మార్కెట్లో కొనుగోలుదారులంతా సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతుండటంతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే పరిస్ధితి ఉత్పన్నమైనప్పుడు రూ.289 కోట్లతో మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేశారు. సిండికేట్ ధరను బలంగా కట్టడి చేసి రైతులను ఆదుకున్నారు.
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి బ్యారన్‌కు వచ్చి రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి. హైగ్రేడ్‌కి రూ.10 పెంచారు. అదే సమయంలో లోగ్రేడ్‌కి రూ.20 తగ్గించారు. పది రూపాయలు పెంచిన నాటి నుంచి ప్రతిరోజూ ఒక్కో రూపాయి తగ్గుతూ వస్తోంది.
– ధూళిపూడి బాబురావు, రైతు, కొయ్యలగూడెం
కంపెనీలు విదేశీ ఆర్డర్లు రావడం లేదని అంటున్నాయి. కేంద్రం పట్టించుకోవడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే పంటకు అనుమతులు ఇచ్చిన సమయంలోనే పొగాకు కొనుగోలు ధర ప్రకటించాలి. ధర స్థిరీకరణ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు.
– తాండ్రు రామకృష్ణ, రైతు, గవరవరం
గతేడాదితో పోల్చితే 50 శాతం ధర పతనం
కొనుగోళ్లు ప్రారంభం రోజే భారీగా ధరల తగ్గింపు
వ్యాపారుల సిండికేట్‌తో పొగాకు రైతులు బలి
సరాసరి కిలోకు రూ.243.. గతేడాది రూ.300 పైమాటే


