మద్ది క్షేత్రంలో వరుణ హోమాలు | - | Sakshi
Sakshi News home page

మద్ది క్షేత్రంలో వరుణ హోమాలు

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

మద్ది క్షేత్రంలో వరుణ హోమాలు డీసెట్‌ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన తగ్గుతున్న గోదావరి వరద 31, 1 తేదీల్లో కొన్ని రూట్లలో బస్సులు రద్దు డీటీఏవోగా ఇమ్మానుయేల్‌ డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీకి గోల్డ్‌ రేటింగ్‌

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గుర్వాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం వరుణ జపాలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలతో హోమ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తలు ధూళిపాల వెంకట ప్రభాకర రావు, ధూనబోయిన నారాయణమూర్తి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈవో ఆర్‌వీ చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల దూబచర్లలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌)లో జరిగిన డీసెట్‌–2026 ప్రవేశాల మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్‌) బుధవారం ముగిసినట్లు దూబచర్ల డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎం.కమలకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు జరిగిన ఈ సర్టిఫికెట్ల పరిశీలన వివరాలను ఆమె వెల్లడించారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) దూబచర్లకు కేటాయించిన 131 సీట్లకు గాను 86 మంది విద్యార్థులు, భీమవరంలోని సీఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేటు కళాశాలకు కేటాయించిన 80 సీట్లకు గాను 30 మంది విద్యార్థులు సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశపత్రాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రిన్సిపాల్‌ కమలకుమారి ఆధ్వర్యంలో సీనియర్‌ అధ్యాపకులు కే సరోజిని, ఏఎస్‌ఎస్‌ఆర్‌ గుప్తా, వీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌ లక్ష్మీనారాయణ ఈ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ తనిఖీ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని, ప్రవేశపత్రాలు పొందిన విద్యార్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 27 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే నుంచి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి వచ్చే వరద నీరు క్రమేపీ తగ్గుతుండటంతో, ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టింది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో, జిల్లాలోని వివిధ ప్రధాన రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేయనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్‌ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన బస్సులను ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీల్లో రెండు రోజులపాటు విజయనగరం జోన్‌కు కేటాయించిన కారణంగా, కొన్ని రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని ఆమె కోరారు.

ఏలూరు టౌన్‌: జిల్లా ట్రెజరీ, గణాంక అధికారిగా (డీటీఏవో) బొడ్డు ఇమ్మానుయేల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు బుధవారం ఆయన ఏలూరులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్విని, జాయింట్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును దక్కించుకుంది. గ్రీన్‌ మెంటార్స్‌ సంస్థ నిర్వహించిన ‘నేషనల్‌ గ్రీన్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ (ఎన్‌జీయూఆర్‌) –2026’లో దేశంలోనే 16వ ర్యాంక్‌ను సాధించి, గోల్డ్‌ రేటింగ్‌ కై వసం చేసుకుంది. పర్యావరణ నిర్వహణ, సౌరశక్తి ఉపయోగం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను కేటాయించారు. ఈ జాతీయ గుర్తింపుతో పాటు, అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే 10వ ‘ఎన్‌వైసీ గ్రీన్‌ స్కూల్‌ కాన్ఫరెన్స్‌–2026’ సదస్సులో పురస్కారం అందుకోవడానికి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా వీసీ డాక్టర్‌ ధనుంజయరావు అధికారులను, సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement